logo

మొక్క..లేదిక్కడ!

పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామ రహదారి ఇది. ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ రహదారి పొడవునా 400 మొక్కలను అధికారులు నాటారు. చిత్రంలో కనీసం ఓ ఇరవై మొక్కలైనా కన్పించాలి.

Published : 29 Jan 2022 05:24 IST

 పాలకొండ, న్యూస్‌టుడే

పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామ రహదారి ఇది. ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ రహదారి పొడవునా 400 మొక్కలను అధికారులు నాటారు. చిత్రంలో కనీసం ఓ ఇరవై మొక్కలైనా కన్పించాలి. కనుచూపు మేరలో మరి మూడు నాలుగు మోడులు తప్ప మరేమీ కన్పించడం లేదు. నిర్వహణ సక్రమంగా లేక 150కి పైగా మొక్కలు, వేసిన రక్షణ కంచెలూ ప్రస్తుతం కనిపించడం లేదు. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి.

పర్యావరణ పరిరక్షణతో పాటు వేతనదారులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో తొమ్మిది వందల గ్రామ పంచాయతీల పరిధిలో 954 కిలోమీటర్ల మేర గతేడాది జులైలో అధికారులు 3.81 లక్షలు మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించి ఒక్కో మొక్కకు రూ.350 వరకు వ్యయం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించడంతో పాటు మొక్క నాటడం, కంచె ఏర్పాటుతో పాటు నిర్వహణకు ఈ మొత్తాన్ని వెచ్చించారు.

కనుమరుగవుతున్నాయ్‌..

నీరందించకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా చాలా వరకు మొక్కలు చనిపోయాయి. ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 3.14 లక్షల మొక్కలు ఉన్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో చాలా వే కన్పిస్తున్నాయి. లబ్ధిదారుల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతోపాటు రహదారి వెంబడి మొక్కలు నాటడంతో నీరు మోసుకువెళ్లేందుకు దూరం కావడంతో లబ్ధిదారులు చాలాచోట్ల నిర్వహణను గాలికొదిలేస్తున్నారు.

దృష్టిసారించని ప్రజాప్రతినిధులు

ఈ సారి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచులు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 85 శాతం మొక్కలు పూర్తిస్థాయిలో బతికేలా సర్పంచులు లబ్ధిదారుల ద్వారా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కానీ చాలాచోట్ల ఈ పథకానికి సంబంధించి సర్పంచులు బాధ్యత తీసుకోవడంలేదు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో గ్రామ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ క్షేత్రస్థాయిలో చాలామంది ప్రజాప్రతినిధులు అందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.

చర్యలు చేపడతాం

జిల్లాలో వరుస వర్షాలు, తుపానుల కారణంగా నాటిన మొక్కలు దెబ్బతిన్నాయి. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి మొక్కల పరిరక్షణ చర్యలు చేపడతాం. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తాం. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటుతాం. వేసవిలో ప్రత్యేక నిర్వహణ చర్యలు చేపడతాం.

- ఎస్‌.శ్యామల, ప్లాంటేషన్‌ మేనేజర్‌, ఉపాధిహామీ పథకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని