logo

తీరాన్నీ వదలట్లేదు

విశాలమైన 193 కిలోమీటర్ల తీరం జిల్లా సొంతం.. ఒకప్పుడు ఉన్నతమైన సరుగుడు వనాలతో కళకళలాడేది. పర్యవేక్షణ లోపించడం, వన సంరక్షణ సమితులు నిర్వీర్యమవ్వడం, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పరిస్థితే మారిపోయింది.

Published : 01 Aug 2022 04:35 IST

ఆక్రమించుకుని తోటల పెంపకం

యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపు


హుకుంపేట తీరంలో ఇసుక తవ్వకాలతో ఇదీ పరిస్థితి

వజ్రపుకొత్తూరు గ్రామీణం, సోంపేట, న్యూస్‌టుడే: విశాలమైన 193 కిలోమీటర్ల తీరం జిల్లా సొంతం.. ఒకప్పుడు ఉన్నతమైన సరుగుడు వనాలతో కళకళలాడేది. పర్యవేక్షణ లోపించడం, వన సంరక్షణ సమితులు నిర్వీర్యమవ్వడం, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పరిస్థితే మారిపోయింది. సరుగుడు వృక్షాలు ఎక్కడికక్కడ నరికివేతకు గురికాగా, తీర భూములకు రక్షణ లేకపోయింది, దీంతో చాలా వరకు ఆక్రమణలకు గురవుతోంది. ఈ ఆక్రమిత భూముల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగిపోతోంది. దీంతో ఇసుక దిబ్బలు కనుమరుగై ఏకంగా తీరాన్నే ముప్పులో పడేసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి.

ఉద్ధండులే..
జిల్లాలోని తీరప్రాంతంలో 104 మత్స్యకార గ్రామాలున్నాయి. ఇవి కాకుండా తీరానికి దగ్గర్లో మరో 500 వరకు గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల పరిధిలో తీరప్రాంత భూములు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. తీర భూములను ఆక్రమించి కంచెలు ఏర్పాటు చేసుకుని జీడి, కొబ్బరి వంటి తోటలను ఏర్పాటు చేసుకున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో 16 కిలోమీటర్ల పరిధిలో తీరప్రాంతం విస్తరించి ఉంది. ముఖ్యంగా ప్రధాన అమలపాడు, యూఆర్‌కేపురం, కేఆర్‌పేట, కొత్తపేట, జీజేపురం, డోకులపాడు, చినకొత్తూరు, కిడిసింగిశారధాపురం, గుణుపల్లి, అక్కుపల్లి, బైపల్లి ప్రాంతాల్లో చాలా వరకు తీరప్రాంత భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అమలపాడు ప్రాంతంలో కొద్దిమంది రైతుల చేతులో తీరప్రాంత భూములు వందల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి.

అమ్మకాల జోరు
తీర ప్రాంతాలకు రక్షణగా ఉన్న ఇసుక తిన్నెలు అక్రమార్కుల పుణ్యమాని కనుమరుగైపోతున్నాయి. ఇటీవల జీజేపురం, అమలపాడు ప్రాంతాల్లో పొక్లెయిన్లు పెట్టి ట్రాక్టర్ల ద్వారా టన్నుల కొద్ది ఇసుకను తరలించారు. ప్రస్తుతం ఇసుకను ఉద్దానం ప్రాంత తోటలకు, భవన నిర్మాణాలకు అధికంగా ఉపయోగిస్తున్నారు. మరి కొంత మంది ఇసుక వ్యాపారులు నది ఇసుకలో కలిపి అమ్మేస్తున్నారు. అమలపాడు, కేఆర్‌పేట ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు కొందరు తాము ఆక్రమించిన తోటల్లో ఇసుక అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టరు లోడు రూ.500 వరకు అమ్ముతున్నారు. హుకుంపేట ప్రాంతంలో శ్మశానవాటికలోనూ ఇసుక తవ్వకాలు చేపట్టి అమ్ముకున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.


వజ్రపుకొత్తూరు మండలం కంభాలరాయుడిపేట సమీపంలో తీరంలో ఇసుక తరలింపునకు సిద్ధంగా ఉన్న ట్రాక్టరు ఇది. నిత్యం ఇక్కడ నుంచి ఇసుక తరలిపోవడంతో తీరం రూపురేఖలే మారిపోతున్నాయి. ఒక్క వజ్రపుకొత్తూరు మండలంలోనే సముద్రతీరం నుంచి రోజుకు సగటున వంద ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది.


ఒకప్పుడు నిలువెత్తు సరుగుడు చెట్లతో నిండుగా కనిపించిన తీర ప్రాంత భూములివి. తుపానుల నుంచి వచ్చే తీవ్రగాలులను అవి ఆపేవి. ప్రస్తుతం అవి పరులపాలయ్యాయి. భూములను ఆక్రమించి ఇదిగో ఇలా జీడిమొక్కలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అమలపాడు, యూఆర్‌కేపురం, కేఆర్‌పేట, కొత్తపేట, జీజేపురం, డోకులపాడు, చినకొత్తూరు, కిడిసింగిశారధాపురం, గుణుపల్లి, అక్కుపల్లి, బైపల్లి ఇలా చాలా వరకు తీరప్రాంత భూములు ఆక్రమణలకు గురయ్యాయి.


చాలా అన్యాయం

తీరం వెంబడి సరుగుడు, తాటి వంటి వృక్షాలు నాటి తీరానికి రక్షణగా చేపట్టాల్సిన చర్యలు అటవీ శాఖ ద్వారా జరగడంలేదు. దీని వల్ల తీరప్రాంతం తుపాన్‌ల సమయంలో ప్రమాదకరంగా మారుతుంది. మరోవైపు ఇసుక తీరం నుంచి యథేచ్ఛగా తరలిపోతోంది. ఇసుక తరలింపుపై చర్యలు చేపట్టాలి.

- బి.ధనుంజయ్‌, కేఆర్‌పేట


చర్యలు తీసుకుంటాం

తీరప్రాంత భూముల ఆక్రమణ, సముద్రపు ఇసుక తరలింపు విషయమై నా దృష్టికి రాలేదు. వివరాలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటాం.

- సీతారామ్మూర్తి, ఆర్డీవో, పలాస

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని