logo
Published : 13 Aug 2022 03:32 IST

వీరి దానం.. నిలిపింది ప్రాణం..!

చనిపోయాక మట్టిలో కలిసిపోయే అవయవాలు ఆపదలో ఉన్న మరో మనిషి ప్రాణాన్ని నిలుపుతున్నాయి. మరణశయ్యపై ఉన్నవారి శరీర భాగాలు మరొకరి ఊపిరి నిలిపేందుకు దోహదపడుతున్నాయి. ఆత్మీయులను కోల్పోయామనే దుఃఖంలోనూ వారు మరొకరిలో బతికి ఉంటున్నారనే భావన అవయవ దానంతో సాధ్యమవుతోంది. నేడు ‘అవయవదాన దినోత్సవం’ సందర్భంగా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపినవారి గురించి ఓ సారి తెలుసుకుందాం..


బిడ్డ కష్టం చూసి తట్టుకోలేక...

కుమారుడు రమణతో నారాయణమ్మ

లావేరు మండలం కేశవరాయపురం గ్రామానికి చెందిన ఇనపకుర్తి రమణకు నాలుగేళ్ల కిందట రెండు కిడ్నీలు పాడైపోయాయి. మూడు నెలల పాటు డయాలసిస్‌ చేయించిన ప్రయోజనం లేదు. వైద్యులు కిడ్నిలు మార్చాలని చెప్పారు. ఎవరు ముందుకు రాకపోవడంతో తల్లి నారాయణమ్మ తల్లడిల్లిపోయింది. బిడ్డ కష్టం చూడలేక ఆరు పదుల వయసులో తన కిడ్నీని కుమారుడికి దానం చేసి ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.  

- న్యూస్‌టుడే, లావేరు గ్రామీణం


తమ్ముడి కోసం  ఆమె త్యాగం

తోడబుట్టిన తమ్ముడి రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. చలించిపోయిన అక్క తన సోదరుడితో పాటు కూతురు జీవితాన్ని నిలబెట్టాలనే తపనతో అవయవదానం చేయాలని నిర్ణయించుకుంది. నరసన్నపేట మండలంలోని బడ్డవానిపేట గ్రామానికి చెందిన జల్లు తిరుపతమ్మ. 12 ఏళ్ల క్రితం తన రెండు మూత్రపిండాల్లో ఒక దాన్ని తన తమ్ముడు వజ్జ ప్రసాదరావుకు దానం ఇచ్చి అతని జీవితంలో వెలుగులు నింపింది.

- న్యూస్‌టుడే, బడ్డవానిపేట (నరసన్నపేట గ్రామీణం)


నలుగురికి కొత్త జీవితం

ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణ చంద్రరౌళో(52) శివాలయంలో దైవారాధన వృత్తిగా, కుటుంబ పోషణ చేసుకునేవారు. ఐదేళ్ల కిందట గ్రామంలో నడుస్తుండగానే పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. బ్రెయిన్‌డెడ్‌ అయినట్లుగా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. భార్య శారద రౌళో, కుమారుడు జగదీశ్‌రౌళో స్పందించి, కృష్ణ చంద్ర రౌళో అవయవదానానికి అంగీకారం తెలిపారు. గుండె, మూత్రపిండాలు, కాలేయం, నేత్రాలు ఇతరులకు అమర్చేందుకు సమ్మతం తెలిపారు. ఆ మేరకు వైద్యులు అవయవాలను తీసి నలుగురికి అదేరోజు అమర్చారు. వారికి కొత్తజీవితాన్ని ప్రసాదించారు.

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని