logo

కానుక మూణ్ణాళ్లే మన్నిక..!

ప్రభుత్వ బడిలో చదువుకునే విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక పుస్తకాల బ్యాగు, మూడు జతలకు సరిపడా ఏకరూప దుస్తుల వస్త్రం, బెల్టు, బూట్లు, సాక్సులు, రాత, పాఠ్య పుస్తకాలు కలిపి విద్యాకానుకగా ప్రతి

Updated : 24 Sep 2022 04:21 IST

చిరిగిన బ్యాగులు

విద్యార్థులకు తప్పని అవస్థలు

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం,   - న్యూస్‌టుడే, బృందం

ప్రభుత్వ బడిలో చదువుకునే విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక పుస్తకాల బ్యాగు, మూడు జతలకు సరిపడా ఏకరూప దుస్తుల వస్త్రం, బెల్టు, బూట్లు, సాక్సులు, రాత, పాఠ్య పుస్తకాలు కలిపి విద్యాకానుకగా ప్రతి విద్యార్థికి అందించింది. ప్రభుత్వం కానుక మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. నాణ్యత లేక నాసిరకంగా దర్శనమిస్తున్నాయి. బూట్లు, సాక్సులు కూడా కొన్నిచోట్ల అలాగే ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థుల చేతికొచ్చి రెండు నెలలే గడిచింది. ఈలోపే అవన్నీ చిరిగి పనికిరాకుండా పోయాయి.


కోటబొమ్మాళి మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు విద్యాశాఖ సరఫరా చేసిన బ్యాగులివి. ఇచ్చిన రెండు నెలలకే పూర్తిగా చిరిగిపోవడంతో విద్యార్థులు ఇలా పక్కన పడేశారు. చాలామంది బయట కొనుక్కున్న వాటిలోనే పుస్తకాలు పెట్టుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, కోటబొమ్మాళి


బూర్జ మండలం పణుకుపర్త ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థి వాడుతున్న బ్యాగు ఇది. కనీసం కుట్టుకునేందుకు కూడా వీల్లేనంతగా మారింది. ప్యాడ్‌ పట్టేటంతటి సైజులో బ్యాగు లేకపోవడంతో దానిని చేత్తోనే పట్టుకుని, చిరిగిన బ్యాగులోనే పుస్తకాలు పెట్టుకుని ఇలా వెళ్తున్నాడు.

- న్యూస్‌టుడే, బూర్జ


తరగతుల వారీగా సరఫరా

విద్యార్థులకు తరగతుల వారీగా పరిమాణం గల బ్యాగులు అందించారు. 1 నుంచి 3 తరగతి వరకు చిన్న, 4 నుంచి 6 వరకు మధ్యస్థ, 7 నుంచి పదో తరగతి వరకు పెద్ద పరిమాణం గల బ్యాగులు అందించారు. జిల్లా పరిధిలోని 30 మండలాల పరిధిలో 2,657 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వీటిని సరఫరా చేశారు.

నాణ్యతగా ఉంటాయని చెప్పినా..

ప్రభుత్వం విద్యాకానుక సామగ్రి కోసం ఒక్కో విద్యార్థికి సుమారు రూ.2 వేలు ఖర్చుచేస్తోంది. బ్యాగులు, బూట్లు కనీసం ఏడాదైనా మన్నేలా ఉండాలని, పూర్తిస్థాయిలో ప్రమాణాలు పాటిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే బ్యాగులు, బూట్లు, సాక్సులు నాణ్యతతో ఉంటాయని అనుకున్నామని, రెండు నెలలకే ఇలా మారడంతో ఇబ్బందులు తప్పలేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.  

జిల్లాకు తొలివిడతలో ఆరు మండలాల పరిధిలో 54 వేల బ్యాగులు వచ్చాయి. గుత్తేదారు సరఫరా చేసిన వీటి నాణ్యతను పరిశీలించిన అధికారులు లోపాలను గుర్తించి వెనక్కి పంపించేశారు. వాటిని ఆ గుత్తేదారుడు సిక్కోలుకు సమీపంలో ఉన్న మరో జిల్లాకు తీసుకెళ్లినట్లు తెలిసింది. అనంతరం మళ్లీ బ్యాగులను తీసుకొచ్చి సరఫరా చేసినా, నాణ్యతలో మాత్రం మార్పు కనిపించలేదు. విడతల వారీగా వీటిని విద్యార్థులకు అందజేశారు.  


లావేరు మండలం పెదరావుపల్లి  ఎంపీయూపీ పాఠశాలలో ఇచ్చిన బ్యాగులు జిప్‌లు ఊడి ఇలా తయారయ్యాయి. కొందరు విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కుట్టుకుని మరీ వాడుకోవాల్సిన పరిస్థితి.

- న్యూస్‌టుడే, లావేరు


సారవకోట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇలా పిన్నీసులు పెట్టుకుని వాడుకుంటున్నారు. ఇచ్చిన రెండు నెలలకే ఇలా తయారయ్యాయి. బయట కొనుక్కునే బ్యాగులు కనీసం విద్యాసంవత్సరం చివరి వరకూ ఉండేవని విద్యార్థులు చెబుతున్నారు.

- న్యూస్‌టుడే, సారవకోట


 వాటిని తిరస్కరించాం

విద్యా సంవత్సరం ప్రారంభంలో వచ్చిన బ్యాగులు, బూట్లు కొన్ని నాసిరకంగా ఉండడంతో వాటిని తిరస్కరించాం. తర్వాత మరోసారి సరఫరా చేశారు. కొన్ని చోట్ల విద్యార్థులకు వచ్చిన బ్యాగులు కొంచెం చిరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తాం.

- జయప్రకాశ్‌, ఏపీడీ, సమగ్రశిక్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని