logo

యువ.. పెడదోవ

మారుతున్న కాలం, మారిన అవసరాలు అందుకనుగుణంగా వస్తున్నఅలవాట్లు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి.

Updated : 02 Dec 2022 05:09 IST

మారుతున్న కాలం, మారిన అవసరాలు అందుకనుగుణంగా వస్తున్నఅలవాట్లు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. నేర ప్రవృత్తి వైపు నడిపిస్తున్నాయి.. జీవితమే గాడితప్పేలా చేస్తున్నాయి.. అసలు ఇవన్నీ పెద్ద నేరాలే కాదన్న తేలిక భావన వారిని ఇటువైపు అడుగులేసేలా చేస్తోంది.. వెలుగులోకి వస్తేనే కదా అనే నిర్లక్ష్య స్వభావం కొందరిదైతే.. అలవాట్లు, అవసరాలను తీర్చుకునేందుకు దొంగతనమే దగ్గరి మార్గంగా ఎంచుకున్నవారు మరికొందరు.. జిల్లాలో ఈ సంస్కృతి ఇటీవల చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్ని కేసుల విషయంలో పోలీసులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

- న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం, శ్రీకాకుళం నేరవార్తావిభాగం

* విజయనగరం జిల్లాకు చెందిన ఓ ముఠాలోని యువకుడు ముందుగా బండిపై నుంచి పడిపోయినట్లు నటిస్తాడు. సమీపంలోని ఎవరైనా సాయానికి వెళ్లగానే మరోవ్యక్తి వచ్చి సాయం చేసిన వ్యక్తి జేబులోని చరవాణి లేదా పర్సును లాగేస్తారు. బస్సెక్కే సమయంలోనూ వీరు చోరీలకు పాల్పడతారు. ఒక్క శ్రీకాకుళం కాంప్లెక్స్‌లోనే వీరు 70 చరవాణులు దొంగిలించారు. వీరంతా 35 ఏళ్ల లోపువారే. వీరిపై శ్రీకాకుళంలో కేసులు నమోదయ్యాయి.


* శ్రీకాకుళం దమ్మలవీధికి చెందిన 25 ఏళ్ల యువకుడు రాత్రివేళ ఇళ్లకు లోపల తలుపులు వేసుకోకుండా పడుకునేవారి ఇళ్లల్లోకి చొరబడతాడు. కేవలం పుస్తెలతాడును మాత్రమే తెంపి పట్టుకొని పరారవుతాడు.


* పోలీసుశాఖలో ఉన్నతస్థాయి అధికారి కుమారుడితో పాటు జలుమూరు మండలానికి చెందిన యువకుడు, మరికొందరు కుర్రాళ్లు ఓ బ్యాచ్‌గా ఏర్పడి కార్లను తాకట్టుపెట్టే పని చేస్తున్నారు. నగరాల్లో అద్దెకిచ్చే కార్లను తీసుకొని ఉన్నతాధికారి కుమారుడి ద్వారా తనఖా పెడుతున్నారు. శ్రీకాకుళంలోని అధునాతన
కల్యాణ మండపం కలిగిన ఓ యజమానిని ఇలా ముగ్గులోకి దింపి కల్యాణ మండపానికి అవసరమని పలు కార్లను తనఖా పెట్టారు. కార్ల యజమానులు కొన్నాళ్లకు వచ్చి వాటిని తీసుకెళ్లిపోయారు. దీంతో అతడు రూ.60 లక్షలు నష్టపోయారు.


* సోంపేట మండలానికి చెందిన ఓ యువకుడు దొంగతనాలు చేస్తుంటాడు. 30 ఏళ్ల వయసున్న ఆయన ఆటో నడుపుతాడు. గ్రామీణ రోడ్లే అడ్డాగా చేసుకుని చోరీలకు పాల్పడతాడు. సీసీ కెమెరాలు లేని చోట మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు తొలుత చిరునామా అడుగుతాడు. వారు వెళ్లిపోయేటప్పుడు వెనుక నుంచి మెడలో బంగారు వస్తువులు తెంచుకొని పరారవుతాడు. ఇతనిపై టెక్కలి, నౌపడ, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, ఇచ్ఛాపురం గ్రామీణంతో పాటు ఒడిశాలోని గురండి, గారబంద పోలీస్‌స్టేషన్ల పరిధిలో 40కి పైగా కేసులు ఉన్నాయి.


విస్మయానికి గురిచేస్తున్న విచారణలు.. ఇటీవల జిల్లాలో పలు ఘటనలు పోలీసులకు పెద్ద సవాలుగా మారాయి. పాతపట్నం, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట ప్రాంతాల్లో దొంగతనాలతో పాటు గ్రామాల్లో జరుగుతున్న దోపిడీల్లో ఎక్కువగా పోలీసుల రికార్డుల్లో ఉన్న దొంగలు కాక కొత్తవారు ప్రవేశిస్తున్నట్లు తేలింది. దీంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది.

* ఈ కేసులను సీరియస్‌గా తీసుకుని విచారణ సాగిస్తే అందులో నిందితులు వెల్లడిస్తున్న విషయాలు పోలీసులను విస్మయానికి గురిచేస్తున్నాయి. అమ్మాయిలు, దురలవాట్లు, తాత్కాలిక అవసరాల కోసమే ఈ పనులు చేస్తున్నట్లు ఎక్కువమంది చెబుతున్నారు. ఇదే తీరులో మెళియాపుట్టి మండలానికి చెందిన ఓ యువకుడు 200కు పైగా నేరాలకు పాల్పడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు.



నగరంలో ఇటీవల పట్టపగలే గొలుసు తెంచుతూ..

గొలుసుతెంచుతున్నారు.. ఇటీవల జిల్లాలో జరిగిన దొంగతనాల్లో అధికశాతం చైన్‌స్నాచింగ్‌లే. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు చెలరేగిపోతున్నారు. ఈ చోరీల్లో ఎక్కువగా యువకులే ఉంటున్నారు. ద్విచక్ర వాహనం వేగంగా నడపగల నైపుణ్యంతో ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల ఒకేరోజు శ్రీకాకుళం నగరంలో ఇద్దరు యువకులు బండిపై వచ్చి రెండుచోట్ల ఇలా పుస్తెలతాళ్లు తెంపడమే కాక టెక్కలి, పలాస, ఇచ్ఛాపురంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడి ఒడిశావైపు వెళ్లిపోయారు. వీరిద్దరూ 20-25 ఏళ్ల యువకులే. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి చోరీలు జరుగుతూనే ఉన్నాయి.


తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి..

పిల్లలు బయటకెళ్లి వస్తున్నపుడు వారేం చేస్తున్నారనే పర్యవేక్షణ బాధ్యత తల్లిదండ్రులది. వారి కదలికలపై దృష్టిపెట్టాలి. చెడు వ్యసనాలకు బానిసవుతున్నాడా అనేది గమనించాలి. కళాశాలకు వెళ్తున్నాడో లేదో ఆరా తీయాలి. చెడు నడతను గమనిస్తే వెంటనే చర్యలు చేపట్టాలి. ఎక్కువగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులోనే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు.

- టి.పి.విఠలేశ్వర్‌, అదనపు ఎస్పీ, నేర విభాగం


సరదాలు తీర్చుకుంటున్నారు..

కొందరు యువకులు మార్కెట్లోకి వచ్చిన కొత్త ద్విచక్ర వాహనాలకు ఆకర్షితులవుతున్నారు. వాటిని కొనే ఆర్థికస్తోమత లేకపోవడంతో దొంగిలించి సరదాలు తీర్చుకుంటున్నారు. ఇలా అలవాటుపడిన వారు కొట్టేయడమే కాక ఎలాంటి భయం లేకుండా ఇతరులకు అమ్మేస్తున్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి బైకు చోరీలకు పాల్పడుతున్నారు.


గత జనవరి నుంచి అక్టోబరు వరకు జిల్లాలో పలు చోట్ల గొలుసు, పర్సులు, ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. వాటిల్లో ఎక్కువ మంది నిందితులు యువకులే ఉండటం గమనార్హం. ఆ విధంగా నమోదైన కేసుల్లో కొన్నింటిని పరిశీలిస్తే..  

పోలీసుస్టేషన్‌          నమోదైన కేసులు

ఆమదాలవలస         11
కాశీబుగ్గ                  11
శ్రీకాకుళం 1 టౌన్‌      10
శ్రీకాకుళం 2 టౌన్‌      10
శ్రీకాకుళం గ్రామీణం     8


ద్విచక్ర వాహనాల చోరీలిలా...

ఎక్కడ             నమోదైన కేసులు

పొందూరు                227
జి.సిగడాం               238
హిరమండలం          249
పోలాకి                   306
సారవకోట               415


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని