logo

చెత్త కొండంత.. సంపద గోరంత..!

పల్లెసీమలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ఉపాధి పథకంలో భాగంగా చెత్తసంపద కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.

Published : 26 Jan 2023 06:27 IST

అలంకారప్రాయంగానే కేంద్రాలు
గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులతో అవస్థలు
న్యూస్‌టుడే, లావేరు, బృందం

నిరుపయోగంగా తాళ్లవలసలోని కేంద్రం

పల్లెసీమలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ఉపాధి పథకంలో భాగంగా చెత్తసంపద కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క నిర్మాణాలకు స్థలం లేకపోవడం, ఉన్నచోట నిధుల కొరత, అన్నీబాగున్న చోట పర్యవేక్షణ లేకపోవడంతో ఆశించిన లక్ష్యం చేకూరడం లేదు. ఘన వ్యర్థాల నిర్వహణ, వర్మీకంపోస్టు ఎరువు తయారీ సక్రమంగా సాగడం లేదు. దీంతో ప్రధాన రహదారుల వెంట చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. అపరిశుభ్రత పల్లెలను పట్టిపీడిస్తోంది.  

జిల్లాలో 30 మండలాలకు సంబంధించి 912 పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 912 ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు (ఎస్‌డబ్ల్యూపీసీ) మంజూరు కాగా అందులో రెండు వంతులు కేంద్రాలు నిర్మించారు. మిగిలిన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల పునాదుల్లోనే ఏళ్లతరబడి దర్శనమిస్తున్నాయి. పలు పంచాయతీల్లో షెడ్లు నిర్మాణం చేపట్టకపోవడంతో రహదారులపైనే చెత్త వేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి.


జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజుకు 80 నుంచి 90 టన్నుల వరకు  చెత్త ఉత్పత్తి అవుతోంది.


ఘనవ్యర్థాల నిర్వహణ నామమాత్రం

జిల్లా వ్యాప్తంగా 518 పంచాయతీల్లో మాత్రమే ఘనవ్యర్థాల నిర్వహణ కొనసాగుతోంది. 394 పంచాయతీల్లో ఆ ఊసేలేదు. దీంతో పెద్దగా ఆదాయం రావడం లేదు. చెత్తను కేంద్రాల సమీపంలోనే పారబోసి తగలబెడుతున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులను ముక్కలుగా చేసేందుకు అవసరమైన యంత్రాలను గత ప్రభుత్వం కొన్ని పంచాయతీలకు అందజేసింది. అవి ఇప్పటివరకు వినియోగించిన దాఖలాలు లేవు. వీటిని వినియోగించుకుని ప్లాస్టిక్‌ వస్తువులను ముక్కలుగా చేసి ఆయా పరిశ్రమలు, తారురోడ్ల నిర్మాణంలో ఉపయోగించుకునేలా చేయగలిగితే మంచి ఆదాయం వచ్చే అవకాశముంది.  


అంతంతమాత్రంగా ఆదాయం

ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాల నుంచి ఫిబ్రవరి-2022 నుంచి ఇప్పటివరకు వర్మీకంపోస్టు ఎరువు తయారీ ద్వారా రూ.6.47 లక్షలు, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తలో ఉండే ప్లాస్టిక్‌ డబ్బాలు, ఇనుప వస్తువులు, సీసాలు, సంచులు, అట్టపెట్టెల తదితర సామగ్రి తదితర వాటిని నుంచి రూ.5.75 లక్షల ఆదాయం సమకూరింది. వర్మీకంపోస్టు తయారు చేసేందుకు అవసరమైన తొట్టెలు అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు దృష్టిసారించడం లేదు. దీంతో ఆదాయం అరకొరగానే వస్తుంది.


ఇదీ పరిస్థితి

* టెక్కలి మేజరు పంచాయతీలో రూ.20 లక్షలతో చెత్తసంపద కేంద్రాన్ని నిర్మించారు. దీని సమీపంలో జిల్లా ఆసుపత్రి నిర్మించడంతో ఈ కేంద్రంలో చెత్త వేయడం లేదు. సేకరించిన చెత్తను జాతీయ రహదారి పక్కన వేస్తున్నారు. దీంతో సమీపంలో ఉన్న చెరువులు కలుషితం కావడంతో పాటు పరిసర గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షల వ్యయంతో నిర్మించిన కేంద్రం ప్రస్తుతం నిరుపయోగం ఉంది. దీనినుంచి ఒక్క పైసా ఆదాయం రావడం లేదు.

* సంతబొమ్మాళి: బోరుభద్రలో సుమారు రూ.15 లక్షలతో నిర్మించిన కేంద్రం తిత్లీ తుపానుకు శిథిలమైంది. నాటినుంచి మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. దీంతో షెడ్డు వృథాగా పడి ఉంది. పంచాయతీలో సేకరించిన చెత్తను రోడ్ల పక్కన పడేస్తున్నారు.

* పొందూరు: కింతలి, రాపాక పంచాయతీల్లో సుమారు రూ.25 లక్షలతో కేంద్రాలను కట్టారు. ఇవి అలంకారప్రాయంగా మిలిగిపోయాయి.  

* జలుమూరు: శ్రీముఖలింగంలో ఇంతవరకు చెత్తసంపద కేంద్రాన్నే నిర్మించలేదు. దీంతో చెత్త నిల్వలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. గ్రామంలో సేకరించిన చెత్తను గ్రామానికి సమీపంలో కొంత.. మరికొంత వంశధార నది ప్రాంతంలో వేస్తున్నారు.


‘కేంద్రాల్లో వర్మీకంపోస్టు తయారీకి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు పనులు పూర్తికాని షెడ్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఘనవ్యర్థాల నిర్వహణ, వర్మీకంపోస్టు ఎరువు తయారీని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. దీనిపై ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.’

పి.వెంకటరాజు, జిల్లా సమన్వయకర్త (ఎస్‌డబ్ల్యూపీసీ) కేంద్రాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని