logo

చదువుకున్నాడు.. చోరీలు చేస్తున్నాడు

శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడ గ్రామానికి చెందిన బలగ హరిబాబు రాజమహేంద్రవరంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

Updated : 03 Jun 2023 13:17 IST

బెట్టింగ్‌కు అలవాటు పడి  అప్పులపాలైన యువకుడు
అవి తీర్చేందుకు దొంగగా మారిన వైనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

ఆ యువకుడు ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. సివిల్స్‌ పరీక్ష రాశాడు. బ్యాంకు కొలువు సాధించాలని ప్రయత్నించాడు. అవేమీ ఫలించలేదు.  ఇంతలో ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. లక్షల్లో అప్పులు చేశాడు. అవి తీర్చేందుకు దొంగగా మారాలని నిర్ణయించుకుని పలుచోట్ల ఇళ్లకు కన్నం వేశాడు. ఎన్నిసార్లు జైలుకెళ్లినా మార్పు     రాలేదు. ఇటీవల ఓ ఇంట్లో చోరీకి పాల్పడి మరోసారి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం


శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడ గ్రామానికి చెందిన బలగ హరిబాబు రాజమహేంద్రవరంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ తరువాత హరియాణాలో సాఫ్ట్‌వేర్‌ కొలువు వచ్చింది. ఆరు నెలల పాటు ఉద్యోగం చేశాడు. అనంతరం ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటికి వచ్చేశాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఓసారి సివిల్స్‌ పరీక్షలు కూడా రాశాడు. మెయిన్స్‌లో అర్హత సాధించలేకపోయాడు. ఎస్‌బీఐ పీవో ఉద్యోగానికి నాలుగుసార్లు ఇంటర్వ్యూల వరకు వెళ్లాడు. అనంతరం ఉపాధి పథకంలో క్షేత్రసహాయకుడిగా చేరాడు. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. అలా సుమారు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు వరకు అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు 2019లో స్వగ్రామంలోనే బంధువుల ఇంట్లో చొరబడి 5 తులాల బంగారాన్ని చోరీ చేశాడు. తర్వాత ఆ యువకుడిపై శ్రీకాకుళం గ్రామీణ మండలంలో 10,  నగర పరిధిలో 3, తెలంగాణ రాష్ట్రం హనుమకొండలో 2 కేసులు నమోదయ్యాయి.


వేలిముద్రలే పట్టించాయి...

శ్రీకాకుళం రెండో పట్టణంలో 2 కేసులు, శ్రీకాకుళం గ్రామీణ మండలంలో 2 కేసులకు సంబంధించి సుమారు 13 తులాల బంగారు వస్తువులను పోలీసులు రికవరీ చేశారు. ఆ కేసులు ఒకే తరహాలో ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ సమయంలో నిందితుడిని పట్టించడంలో వేలిముద్రలు కీలకపాత్ర పోషించాయి. నిందితుడిని 2019-20లో ఓ కేసులో అరెస్టు చేశారు. 2022లో అంపోలు జైలు నుంచి విడుదలైన యువకుడు వరంగల్‌ వెళ్లిపోయాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా నేరం చేసి పోలీసులకు చిక్కడంతో ఖమ్మం జైలులో ఉంచారు. అక్కడ నుంచి బయటకు వచ్చాక గత మార్చిలో శ్రీకాకుళం నగరంలోని ఏఎస్‌ఎన్‌కాలనీలో మరో దొంగతనం చేశాడు. ఇన్‌ఫార్మర్ల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని మళ్లీ జైలుకు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని