logo

ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తాం

‘జిల్లాలో వంశధారపై ఆధారపడిన ఆయకట్టు మొత్తానికి ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో సాగునీరందించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. శివారు ప్రాంతాల్లో ఏటా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాం.’

Updated : 06 Jun 2023 06:05 IST

వంశధార పర్యవేక్షక ఇంజినీరు డోల తిరుమలరావు
న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

‘జిల్లాలో వంశధారపై ఆధారపడిన ఆయకట్టు మొత్తానికి ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో సాగునీరందించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. శివారు ప్రాంతాల్లో ఏటా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాం.’ అని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీరు డోల తిరుమలరావు అన్నారు. శివారు ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు చేపడుతున్న చర్యలు, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వివరించారు. అవి ఆయనమాటల్లోనే..

శివారు ప్రాంతాలకు ఇబ్బంది రానివ్వం

గతేడాది వర్షాభావ పరిస్థితులు, గొట్టాబ్యారేజీ, రిజర్వాయర్‌లో అవసరమైన మేరకు నీరు నిల్వ లేకపోవడంతో పూర్తిస్థాయిలో పంట పొలాలకు నీరందించడంలో కొంచెం జాప్యం జరిగింది. ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేసి శివారు ప్రాంతాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా కార్యాచరణను రూపొందిస్తున్నాం.

లష్కర్ల నియామకానికి చర్యలు

వంశధార ఎడమకాలువ షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. గట్లు బలహీనపడి ఏర్పడిన లీకుల ద్వారా నీరు వృథాగా పోతోంది. సాగునీరు విడుదల చేసే క్రమంలో ఎక్కడికక్కడ గట్లు తెగిపోయి దిగువకు నీరు సక్రమంగా వెళ్లడం లేదు. సాగునీటి క్రమబద్ధీకరణపై ఇంజినీర్ల బృందంతో చర్చిస్తున్నాం. అవసరమైన మేరకు లష్కర్లను నియమించి సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం.

దశలవారీగా ఆధునికీకరణ

శిథిలావస్థలో ఉన్న వంశధార ఎడమ కాలువ పనులు ఆధునికీకరణ చేపట్టకుంటే శివారు ప్రాంతాలకు ఆశించినంత స్థాయిలో సాగునీరందించడం కష్టమే. దశలవారీగా చేపట్టాల్సిన ఆ పనులకు సంబంధించి రూ.950 కోట్ల అంచనావ్యయంతో ప్రభుత్వానికి నివేదిక పంపించాం. అందుకు నిధులు ఏర్పాటుచేస్తామని ఉన్నతాధికారులు మౌఖికంగా తెలిపారు. మొదటి దశలో అండర్‌ టన్నెల్స్‌, ఆఫ్‌ టేక్‌ స్లూయీజ్‌లు తక్షణం పునఃనిర్మించాల్సి ఉంది. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

ప్రధాన సమస్యగా గుర్రపుడెక్క

శివారు ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేయడంలో గుర్రపుడెక్క ప్రధాన సమస్య. 2020-21లో రూ.40 లక్షలు, 2021-22లో రూ.66 లక్షలు ఖర్చు చేశాం. ఈ ఏడాది కూడా మరో రూ.60 లక్షలు అవసరం అవుతోంది. రసాయనాల ద్వారా గుర్రపుడెక్క సమస్య నివారించవచ్చు. కానీ దిగువనున్న మానవ,పశుపక్ష్యాదులకు ఇది ప్రమాదకరం. అందుకే ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోతున్నాం. ప్రస్తుతానికి కలెక్టర్‌ ఆదేశాల మేరకు పొక్లెయిన్లతోనే గుర్రపుడెక్క తొలగిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాం.

అభివృద్ధి పనులు ఇవీ...

* నాగావళి-వంశధార నదుల అనుసంధాన పనులు ఇప్పటివరకు 78 శాతం పూర్తయ్యాయి. గుత్తేదారుడు కాస్త జాప్యం చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌కు పనులు పూర్తయ్యే అవకాశం లేదు.

* గతంలో ఆఫ్‌షోర్‌ పనులు 38 శాతం జరిగి నిలిచిపోయాయి. ఇటీవల ప్రభుత్వం నిధులిచ్చింది. రైతులతో మాట్లాడి పునరావాసం, భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగించాం. ఈ ఏడాది మరో ఏడు శాతం పనులు జరిగాయి. రెండేళ్లలో వీటిని పూర్తి చేస్తాం.

* ముఖ్యమంత్రి ఇటీవల హిరమండలం ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. సర్వే, డిజైన్లు పూర్తయ్యాయి. పంపులు, మోటార్ల కొనుగోలుకు ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌లో పనులు ప్రారంభించి డిసెంబరులో పూర్తికి ప్రయత్నిస్తున్నాం.

* హిరమండలం రిజర్వాయర్‌ పనులు 93 శాతం జరిగాయి. ప్రస్తుతం స్పిల్‌వే పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

* గొట్టా బ్యారేజీ దిగువున ఉన్న ఇసుక కొట్టుకుపోయి రాతిపరుపు(ఏప్రాన్‌) దిగిపోయింది. దాన్ని పునర్నిర్మించేందుకు రూ.12 కోట్లు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపాం. ఇంకా ఆమోదం రావాల్సిఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని