logo

దారి చూపు శివయ్యా..!

దక్షిణ కాశీగా ప్రసిద్ధి   చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు.

Published : 28 Mar 2024 05:34 IST

శ్రీముఖలింగేశ్వరస్వామి చక్రతీర్థ స్నానానికి వచ్చే భక్తులకు తప్పని అవస్థలు

పొలం గట్టుపై నుంచి నడుచుకుంటూ వస్తున్న భక్తులు

న్యూస్‌టుడే, జలుమూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి   చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. దారులు బాగోలేక ఇక్కడికి చేరుకునే సరికి వారు నీరసించిపోతున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు స్వామి చక్రతీర్థస్నానం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఘట్టం. తెలుగు రాష్ట్రాలు, ఒడిశా నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులు తరలివస్తారు. నదికి వెళ్లడానికి సరైన మార్గాలు లేక పొలం గట్లపై రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.

2018లో అప్పటి కలెక్టర్‌ ధనంజయరెడ్డి క్షేత్రాన్ని పరిశీలించి నదికి శాశ్వత రహదారి నిర్మించాలని ప్రతిపాదించారు. అవసరమైన చోట రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అప్పట్లో కొలతలు వేసి ఊరుకున్నారు. ఉత్సవాల సమయంలో అధికారులు వచ్చి హడావుడి చేస్తున్నారు. ఆ తరువాత సమస్య పరిష్కారానికి ఏం చేయాలనే విషయం మరిచిపోతున్నారు. శాశ్వత ప్రాతిపదికన రహదారులు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

దాహార్తి తీర్చుకోవడానికి చలమల నీరే ఆధారం


కానరాని అభివృద్ధి

ఐదేళ్లుగా కార్తిక మాసం, చక్రతీర్థస్నానం నాడు శ్రీముఖలింగేశ్వరస్వామి దర్శనానికి వస్తున్నాను. ఇక్కడ అభివృద్ది ఏమాత్రం కనిపించడం లేదు. పంట పొలాల మీదుగా ఇరుకైన దారిలో నదికి చేరుకోవాల్సి వస్తోంది. అక్కడి నుంచి బయటపడే సరికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. అధికారులు స్పందించి నదికి వెళ్లడానికి పక్కా రహదారులు నిర్మించాలి.

అరసవల్లి సంతోష్‌, భక్తుడు, పలాస


నిధులు మంజూరైతే పనులు చేస్తాం..

శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధిలో భాగంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. స్వామి వంశధార నదికి వెళ్లే రహదారులు, సోమతీర్థం ఘాట్‌ను పునరుద్ధరించాలని ప్రతిపాదించారు. రూ.54 కోట్ల అంచనాతో రూపొందించిన ప్రణాళిక ప్రతిపాదనల దశలో ఉంది. నిధులు మంజూరైతే పనులు చేపడతాం.

పి.ప్రభాకరరావు, ఈవో, శ్రీముఖలింగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని