logo

తెదేపాలో చేరారని కక్ష సాధింపు

వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు.

Updated : 28 Mar 2024 06:44 IST

గుత్తేదారు పేరు మార్చి బిల్లుల చెల్లింపు
ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పీఏ సిఫార్సుతోనే జమ
సహకరించిన ఇంజినీరింగ్‌ అధికారులు
చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

మాట్లాడుతున్న గుత్తేదారు సింహాచలం (మెడలో కండువా ఉన్న వ్యక్తి), తెదేపా నాయకులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. నరసన్నపేటలో బుధవారం సంబంధిత గుత్తేదారుతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. ‘సారవకోట మండలం దంత నుంచి జరాళి గ్రామం వరకు 2.5 కి.మీ. రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ నిధులు రూ.1.65 కోట్లు మంజూరు చేసింది. 2019 డిసెంబరు 30న రోడ్డు నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా పనులను అప్పటి వైకాపా నాయకుడు కోన సింహాచలం చేపట్టారు. 2022 ఫిబ్రవరి 25 నాటికి రూ.39.11 లక్షల మేర పనులు పూర్తి చేసినట్లు ఇంజినీర్లు ఎంబుక్‌లో నమోదు చేశారు. గతేడాది మార్చిలో గుత్తేదారుకు రూ.12 లక్షలకు పైగా చెల్లించారు. సింహాచలం ఇటీవల తెదేపాలో చేరారు. ఆయన చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఎమ్మెల్యే కృష్ణదాస్‌ పీఏ మురళి సమీప బంధువు వెలమల కుమార్‌ ఖాతాకు రూ.21 లక్షల పైగా జమ చేశారు. దీనికి ఇంజినీరింగ్‌ అధికారులు సహకరించారు. ఈ నెల 12న కుమార్‌ను గుత్తేదారుగా ధ్రువీకరించిన అధికారులు గత నెల 20న అతను పనులు చేసినట్లు ఎంబుక్‌లో నమోదు చేశారు. అధికారుల తీరుపై బాధిత గుత్తేదారు ఈ నెల 24న సారవకోట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు’ అని. పేర్కొన్నారు.

దాడి చేశారు..

ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పీఏ మురళి అనుచరులు తనపై దాడి చేశారని గుత్తేదారు సింహాచలం ఆవేదన వ్యక్తం చేశారు. అతనితో తనకు ప్రాణభయం ఉందని వాపోయారు. మరో రెండు పనులు రూ.రెండు కోట్ల వరకు చేయగా వాటినీ రద్దు చేశారని తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తనను వేధిస్తున్నారని.. ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. అక్రమాలకు పాల్పడిన ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని