logo

వీడని భయం!

వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.

Published : 29 Mar 2024 04:42 IST

ఎలుగుతో వణికిపోతున్న ప్రజలు  
శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండు

నిర్మానుష్యంగా గ్రామంలోని ఓ వీధి

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లి తోటలో జరిగిన దారుణ ఘటనతోపాటు అంతకు ముందు ఉద్దానం, తీర ప్రాంతాల్లో అనేక ఉదంతాలు చోటు చేసుకున్న విషయం విదితమే. వీటికి సత్వరమే శాశ్వత పరిష్కారం చూపకుంటే మరిన్ని దారుణాలు జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ప్రధానంగా కొండపల్లి, అనకాపల్లి, బిడిమి, రట్టి కొండల్లో అధికంగా ఎలుగులు ఆవాసం చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా జోన్లు ఏర్పాటు చేయాలి. ఉద్దానంలో పదుల సంఖ్యలో సంచరిస్తున్న ఎలుగుబంట్లను ఒకే చోటకు తరలించి చుట్టూ ఇనుప కంచె వేయడంతోపాటు కందకాలు తవ్వి తాగునీరు, ఆహారం కల్పించాలి. అప్పుడే వాటి బారి నుంచి రక్షణ పొందగలమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐసీయూలో బాధితురాలు..

గాయాలతో బయట పడిన సావిత్రిని శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందని వైద్యులు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తక్షణమే పరిహారం అందించాలి

ఎలుగు దాడి ఘటన నుంచి తేరుకోలేపోతున్నాం. ఇంటి పక్క తోటలోకి వెళ్లాలంటే భయమేస్తోంది. అధికారులు పట్టుకుని, జన సంచారం లేని ప్రాంతాల్లో విడిచి పెట్టాలి. లేదంటే జీవనాధారమైన ఉద్యాన పంటల సాగుపై ఆశలు వదులుకోవాల్సిందే.

సుంకర రాజు, గ్రామస్థుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని