logo

మాకొద్దీ వైకాపా..!

జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు..

Published : 28 Apr 2024 03:48 IST

సీఎం వచ్చి వెళ్లాక పెరిగిన నాయకుల వలసలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోరుపెంచిన తెదేపా

న్యూస్‌టుడే, టెక్కలి : జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు.. వారి చేయిపట్టి దగ్గరుండి నేనే అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి వల్లించినా ఆ మాటలేవీ ఆపార్టీ శ్రేణులకు రుచించలేదు. ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి వెళ్లిన తర్వాత కూడా వైకాపా నుంచి వలసల జోరు తగ్గట్లేదు.

అధికార పక్షానికి ఎదురుగాలే

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యమంత్రి సభకు వందల బËస్సులు ఏర్పాటు చేసినా, రూ.కోట్ల మేర డబ్బు కుమ్మరించినా ఆశించిన జనం రాకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన పెంచేస్తోంది. నిన్నటి వరకు అంతా మనమే అనుకున్నవారు రాత్రికి రాత్రే పార్టీని వీడి వెళ్తుంటే కిందిస్థాయిలో ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి నాయకులది. సామాజిక, ఇతర మాధ్యమాల్లో ఎంత ఊదరగొట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండటంతో స్థానిక నేతలంతా తెదేపా వైపు కదులుతున్నారని వైకాపా ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు.

తాయిలాలకు తలొగ్గలేదు..

వైకాపా సార్వత్రిక ఎన్నికలను ఖరీదైన కార్యక్రమంలా మార్చేసింది. ప్రతి కదలికకు కట్టలతో ముడిపెట్టి కొనేద్దామన్న దర్పం ప్రదర్శిస్తోంది. నామినేషన్‌కు రావాలన్నా, గ్రామాల్లో ప్రచారాలకు వెళ్లాలన్నా ప్రతి దానికి జోరుగా తాయిలాలు వెళ్తున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, వాలంటీర్లు, అయినవారికి, కానివారికి లెక్కలేనంతగా వెదజల్లుతున్నా పార్టీ శ్రేణుల్లో నేతలతో కలసి పనిచేసే ఆలోచనకు ముందుకు రావడంలేదు. కనీసం డబ్బువస్తుంది కదా ఆగుదాం అన్న ఆలోచనకు కూడా వెనకడుగు వేయట్లేదు.

  • పలాస: మందస మాజీ ఎంపీపీ కొర్ల కన్నారావు, వైకాపా పట్టణ నేత దువ్వాడ శ్రీకాంత్‌ సహా తెదేపాలో చేరడంతో వారి అనుచరులు తెదేపా గూటికి చేరుతున్నారు. గ్రామాల్లో వరుసగా చేరికలు పెరగడంతో వైకాపా నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. భారీగా తాయిలాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
  • టెక్కలి: వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ సొంత పంచాయతీ లింగాలవలస నుంచి మాజీ సర్పంచి సంపతిరావు సుజాత, ఆమె భర్త రవీంద్రనాథ్‌ వారి అనుచరులతో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. కింజరాపు కుటుంబ ప్రత్యర్థులకు కంచుకోటగా నిలిచే ఇక్కడి నుంచి భారీగా చేరికలు జరగడంతో ఒక్కసారిగా ఇక్కడి రాజకీయ ముఖచిత్రం మారుతోంది. బోరుభద్ర నుంచి ముద్దపు రమణ, పెద్దబాణాపురం నుంచి కర్రి శేషు వంటి సీనియర్‌ వైకాపా నేతలు తెదేపా గూటికి చేరారు.
  • శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో గట్టి పట్టున్న అంధవరపు వరం కుటుంబం వైకాపాను వీడనుంది. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ పైడిశెట్టి జయంతితో పాటు వరం కుమారులు, వారి అనుయాయులు తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
  • పాతపట్నం: హిరమండలం ఎంపీపీ, కొత్తూరు మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు వారి అనుచరులు, మెళియాపుట్టి సర్పంచి, అనుచరులు తెదేపా గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ నియోజకవర్గంలో చేరికల ప్రభావం ఊపందుకోనుంది.
  • నరసన్నపేట: జలుమూరు జడ్పీటీసీ సభ్యురాలు మెండ విజయశాంతి, వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బాబాజీనాయుడు, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ డోల జగన్మోహనరావు, పోలాకి మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణం గత వారంరోజుల వ్యవధిలో తెదేపాలో చేరారు. నేడు సారవకోట ఎంపీపీ కూడా కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నారు.
  • ఇచ్ఛాపురం: నియోజకవర్గ పరిధిలో ఇప్పటికీ కీలక నేతలు వైకాపా అభ్యర్థితో కలసి ప్రచారంలో పాల్గొనడం లేదు. అందులో కొందరు తెదేపాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రావాల్సిన బిల్లులు, ఇతర వ్యవహారాలు ఉండటంతో పార్టీలో ఉన్నప్పటికీ తమ అనుచరులంతా తెదేపాకే ఓటేస్తారని చెబుతున్నారు.
  • శ్రీకాకుళం: అరసవల్లి శ్రీశయనవీధిలో పార్టీలో చేరుతున్న వారికి కండువాలు వేస్తున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని