logo

మేట్టూర్ జలాల విడుదల

కురువై సాగు కోసం మేట్టూర్‌ ఆనకట్ట నీటిని ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం విడుదల చేశారు. కావేరి డెల్టా ప్రాంతంలో కురువై సాగు కోసం మేట్టూర్‌ ఆనకట్ట జలాలను ముందుగానే 24వ తేదీ నుంచి విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

Published : 25 May 2022 01:29 IST

గేట్ల ద్వారా ప్రవహిస్తున్న నీటిలో పువ్వులు చల్లుతున్న స్టాలిన్‌

చెన్నై, సేలం, న్యూస్‌టుడే: కురువై సాగు కోసం మేట్టూర్‌ ఆనకట్ట నీటిని ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం విడుదల చేశారు. కావేరి డెల్టా ప్రాంతంలో కురువై సాగు కోసం మేట్టూర్‌ ఆనకట్ట జలాలను ముందుగానే 24వ తేదీ నుంచి విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు మేట్టూర్‌ ఆనకట్టలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గేట్లను ఎత్తివేసి జలాలను విడుదల చేశారు. గేట్ల నుంచి ప్రవహిస్తున్న నీళ్లలోకి పువ్వులు చల్లి స్వాగతించారు. సుమారు 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా దశలవారీగా ఈ పరిమాణం పెంచనున్నట్టు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. మేట్టూర్‌ జలాలను ముందస్తుగా మే నెలలో విడుదల చేయడం స్వాతంత్య్రం వచ్చాక ప్రథమమని, నిర్ణీత జూన్‌ 12 నాటికి క్రమంగా మూడేళ్లు నీరు విడుదల చేయడం ఇది రెండోసారి అని పేర్కొన్నారు. మంత్రులు దురైమురుగన్‌ (జలవనరులు), కేఎన్‌ నెహ్రూ (మున్సిపల్‌ పరిపాలన), శివశంకర్‌ (రవాణ), ఎంపీలు సెంథిల్‌కుమార్‌, పార్తీబన్‌, చిన్నరాజ్‌, ఎమ్మెల్యే రాజేంద్రన్‌, ప్రజాపనులశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సందీప్‌ సక్సేనా, సేలం కలెక్టరు కార్మేగం, జలవనరులశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీరు రామమూర్తి పాల్గొన్నారు.

ముందస్తు విడుదలతో ప్రయోజనాలు

మేట్టూర్‌ జలాల ముందస్తు విడుదలతో పలు ప్రయోజనాలు కలగనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ మేరకు... కావేరి డెల్టా ప్రాంతం పూర్తిగా నీరు చేరి భూగర్భ జలాలు మట్టం పెరిగేందుకు మార్గం సుగమం కానుంది. దీంతో వరి మాత్రమే కాకుండా వేసవి పంటలు, ధాన్య రకాలు ఎక్కువగా దిగుబడి చేయవచ్ఛు సుమారు 5.22 లక్షల ఎకరాల్లో కురువై సాగు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంబా సాగు సీజన్‌ కూడా త్వరగా ముగించవచ్ఛు

కేరళ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు

చెన్నై, న్యూస్‌టుడే: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన ట్విట్టర్‌ పేజీలో ఓ సందేశాన్ని ట్వీట్‌ చేశారు. అందులో... వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు, దేశ సమైక్యత కోసం కేరళ మరింత బలాన్ని చూపేందుకుగాను పినరయి విజయన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్టు తెలిపారు.

‘వృథా కానీయొద్దు’

సైదాపేట: మేట్టూరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో..సాధారణంగా జూన్‌ 12న మేట్టూరు నుంచి నీటిని విడుదల చేస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని డెల్టా జిల్లాల్లో కావేరి, వెన్నారు, కల్లనై కాలువల్లో కోట్ల వ్యయంతో పూడికతీత పనులు, ఆనకట్ట నిర్మాణ పనులు, గట్లను బలపరిచే పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ తరుణంలో నీటిని విడుదల చేయడం వలన పగుళ్లు ఏర్పడి నీరు వృథా అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులతో చర్చించి మేట్టూరు నుంచి విడుదలయ్యే నీరు వృథాకాకుండా పూర్తిగా సాగుకు ఉపయోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను అన్నాడీంకే తరఫున డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. కురువై సాగుబడికి నీటిని ముందస్తుగా విడుదల చేసినందున పంట విస్తీర్ణం పెరుగుతుందని, అలాగే సంబా సాగుబడికి సిద్ధమయ్యేందుకు కూడా ఇది ఓ అవకాశంగా ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని