logo

సిలిండర్‌ ధర రూ.500కు తగ్గిస్తాం

కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే వంటగ్యాస్‌ ధరను రూ.500కు తగ్గిస్తామని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ హామీ ఇచ్చారు.

Published : 27 Mar 2024 00:20 IST

ఉదయనిధి స్టాలిన్‌ హామీ

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే వంటగ్యాస్‌ ధరను రూ.500కు తగ్గిస్తామని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ హామీ ఇచ్చారు. తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి సీఎన్‌ అన్నాదురైకి మద్దతుగా ఆయన స్థానిక గాంధీ విగ్రహం వద్ద ప్రచారం చేశారు. తిరువణ్ణామలైలో రూ.38 కోట్లతో కొత్త బస్టాండు ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీర్చడానికి రూ.56 కోట్లతో సాతనూరు డ్యామ్‌ నుంచి భారీ పైప్‌లైన్‌ ద్వారా నీటిని తెచ్చే పనులు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి పాలనకు వస్తే తిరువణ్ణామలై నుంచి చెన్నైకి రోజూ రైలు నడుపుతామని, తిరుపత్తూర్‌కు రైలు సేవ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న టోల్‌గేట్‌ రద్దు చేస్తామన్నారు. 2014లో రూ.450 ఉన్న వంటగ్యాస్‌ ధర మోదీ ప్రభుత్వంలో సుమారు రూ.1000కి చేరిందని, ప్రస్తుతం రూ.100 తగ్గించినట్లు డ్రామా వేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆయన నాటకాన్ని నమ్మవద్దని, ఇండియా కూటమి పాలనకు వస్తే సిలిండర్‌ ధర రూ.500కు తగ్గిస్తామని అన్నారు. రూ.75కు లీటరు పెట్రోలు, రూ.65కు లీటరు డీజిల్‌ విక్రయించే ఏర్పాటు చేస్తామని ఉదయనిధి స్టాలిన్‌ చెప్పారు. కార్యక్రమంలో మంత్రి ఈవీ వేలు, డిప్యూటీ స్పీకర్‌ పిచ్చాండి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని