logo

సమస్యలు పరిష్కరించండి

లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్‌లోని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అన్నానగర్‌ రెసిడెంట్్స అసోసియేషన్స్‌’ (ఎఫ్‌ఏఎన్‌ఆర్‌ఏ) తమ డిమాండ్లను సెంట్రల్‌ చెన్నై లోక్‌సభ అభ్యర్థుల ముందుంచారు.

Published : 18 Apr 2024 01:24 IST

పార్టీ అభ్యర్థులకు అన్నానగర్‌ వాసుల వినతి

ఓట్టేరి నల్లా

వడపళని, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్‌లోని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అన్నానగర్‌ రెసిడెంట్్స అసోసియేషన్స్‌’ (ఎఫ్‌ఏఎన్‌ఆర్‌ఏ) తమ డిమాండ్లను సెంట్రల్‌ చెన్నై లోక్‌సభ అభ్యర్థుల ముందుంచారు. తమ ప్రాంతంలోని కొన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. 10.5 కి.మీ. పొడవున్న ఒట్టేరి నల్లా శుభ్రతా పనులు చేసి మురుగు సవ్యంగా సాగేలా చూడాలని కోరారు. డీఎంకే అభ్యర్థి దయానిధిమారన్‌, భాజపా అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వాన్ని త్వరగా పనులు పూర్తి చేయాలని వేడుకున్నారు.

పరిస్థితి అధ్వానం..

1978 నుంచి కాలువలో నీరు పొంగి పొర్లుతోంది. కొంతకాలంగా పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని, 2013 డిసెంబరులో కురిసిన వర్షాలకు నడుము లోతు నీళ్లలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంఘ సభ్యురాలు వి.సంధ్య విన్నవించారు. అయపాక్కం, అంబత్తూరు, కొలత్తూరు, విల్లివాక్కం నుంచి మురుగు ఒట్టేరి నల్లాలోకి చేరుకుంటోంది. ఇక్కడ ఇప్పటికే ఆక్రమణలు పెరిగిపోయాయి. వర్షాల సమయంలో అన్నానగర్‌లోని 1, 3, 6 అవెన్యూలోకి వరదనీరు ప్రవేశిస్తుంది. ఇళ్లలోని ఏసీలు, ఇతర గృహోపకరణాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పునర్నిర్మాణమే మార్గం..

న్యూ ఆవడి రోడ్డులో(పాడి పైవంతెన నుంచి 3వ అవెన్యూ డైవర్షన్‌ ఛానెల్‌ నుంచి కూవం వరకు), 5వ అవెన్యూ (ఓట్టేరి నల్లా నుంచి కూవం వరకు) మురుగు నీటి కాలువలను శుభ్రం చేసి పునర్నిర్మాణం జరపాలని ప్రభుత్వానికి విన్నవించారు. 3వ అవెన్యూ డైవర్షన్‌ ఛానెల్‌ వద్ద పూడికతీత పనులు చేపట్టి, మురుగు తొలగించడానికి అక్కడక్కడా మ్యాన్‌హోల్స్‌ ఏర్పాటు చేయాలని ‘ఎస్‌’ బ్లాకు నివాసి సుకుమార్‌ అన్నారు. వాటితో పాటు అన్నానగర్‌ 30 అడుగుల రోడ్డులోని ‘ఎల్‌ నుంచి జడ్‌’ వరకు ఉన్న బ్లాకుల్లో కొత్తగా మురుగునీటి లైన్లు నిర్మించాలన్నారు. తమ సంఘంలో 20వేలకుపైగా ఓటర్లున్నారని, వరదల నుంచి విముక్తి కలగడానికి ఓట్టేరి నల్లా పునరుద్ధరణ ఒక్కడే మార్గమని సంధ్య ఎంపీ అభ్యర్థులకు విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని