logo

ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్‌

ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్‌(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్‌(దక్షిణ చెన్నై)కు మద్దతుగా..

Published : 18 Apr 2024 01:27 IST

అభివాదం చేస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్‌(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్‌(దక్షిణ చెన్నై)కు మద్దతుగా నగరంలో బుధవారం స్టాలిన్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. బెసెంట్‌ నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 40 నియోజకవర్గాలనూ ‘ఇండియా’ కూటమి గెలుస్తుందని, దేశాని తమ కూటమే ఏలుతుందని జోస్యం చెప్పారు. మోదీ నిరంకుశత్వం, రాష్ట్రాల అధికారాలను చిదిమేయడం, ప్రజల్లో విభేధాలు సృష్టించే మతవాద వ్యాఖ్యలు అందుకు కారణమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించారని, సీపీఎం, కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేశారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం పలు అక్రమాలకు పాల్పడిందని, దాని గురించి ప్రశ్నించేవారిపై యాంటీ ఇండియన్‌ ముద్ర వేసిందని విమర్శించారు. ప్రజలు ఏం తినాలి, ఏం తినకూడదని కూడా నిర్ణయించాలని భాజపా భావిస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని దగా చేసిన భాజపా, రాష్ట్రాన్ని నాశనం చేసిన అన్నాడీఎంకే కూటములను ఓడించాలని పిలుపునిచ్చారు.

కమలం వికసించదు

కాంచీపురం, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిసార్లు తమిళనాడుకు వచ్చి డీఎంకేకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. కాంచీపురం జిల్లా పడపై సమీపాన కరసంగాల్‌ ప్రాంతంలో కాంచీపురం రిజర్వు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి జి.సెల్వం, శ్రీపెరుంబుదూర్‌ అభ్యర్థి టీఆర్‌ బాలుకు మద్దతుగా ప్రచారసభ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీఎంకే ప్రభుత్వం పలు పథకాలు అమలు  చేస్తోందని చెప్పారు. ఈ పథకాలను దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. నాన్‌ ముదల్వన్‌ కింద 28 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించామని, మహిళలకు ప్రతినెలా రూ.1000 అందిస్తున్నామని చెప్పారు. పదవి కోసం అన్నాడీఎంకేను పళనిసామి భాజపాకు తాకట్టు పెట్టారని, అంందుకే కమలానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఆరోపించారు. భాజపాతో అన్నాడీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకొందని విమర్శించారు.


ఇండియాను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దాం

చెన్నై, న్యూస్‌టుడే: ఇండియాను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు ధీరన్‌ చిన్నమలై జయంతి సందర్భంగా ఎక్స్‌ పేజీలో సందేశాన్ని పోస్టు చేశారు. అందులో... చిన్నమలై ఓ అసమాన పోరాట యోధుడని, సామాజిక సమైక్యతకు చిహ్నమని తెలిపారు. ఆంగ్లేయులకు సింహస్వప్నంగా మారారని, చెన్నిమలై, శివన్‌మలైకు మధ్య అవతరించి అన్యాయపు పన్నులను దోచుకుని ప్రజలకు అందించారని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఇండియాను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు