logo

ఉచిత విద్యుత్తు వినియోగదారుల్లో అనర్హులెందరు?

గతంలో ఎస్సీ, ఎస్టీలు నివసించే ఇళ్లలో ఇప్పుడు వేరేవారు ఎవరైనా నివాసం ఉంటున్నారా.. వారి పేరున వీరు లబ్ధి పొందుతున్నారా.. లబ్ధిదారుని ఆధార్‌ కార్డులతో విద్యుత్తు కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా.. వంటి వివరాలను సేకరిస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో సుమారు 10 వేల మంది వరకు అనర్హులుండే అవకాశం ఉందని ఈపీడీసీఎల్‌ అధికారి ఒకరు తెలిపారు.

Updated : 19 May 2022 03:58 IST

200 యూనిట్లలోపు వాడే ఎస్సీ, ఎస్టీ వర్గాలపై సర్వే

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

గతంలో ఎస్సీ, ఎస్టీలు నివసించే ఇళ్లలో ఇప్పుడు వేరేవారు ఎవరైనా నివాసం ఉంటున్నారా.. వారి పేరున వీరు లబ్ధి పొందుతున్నారా.. లబ్ధిదారుని ఆధార్‌ కార్డులతో విద్యుత్తు కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా.. వంటి వివరాలను సేకరిస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో సుమారు 10 వేల మంది వరకు అనర్హులుండే అవకాశం ఉందని ఈపీడీసీఎల్‌ అధికారి ఒకరు తెలిపారు.

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ గృహవిద్యుత్తు వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తోంది. వారు వినియోగించిన విద్యుత్తుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోంది. అయితే ఈ కేటగిరీలో కొందరు అనర్హులూ లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అసలు మొత్తం ఎంతమంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులున్నారు..వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు.. పంచాయతీలు, కాలనీల్లో ఎంతమంది ఉంటున్నారు.. పట్టణ ప్రాంతాల్లో ఎందరున్నారు.. వారిలో ఉద్యోగాలు చేసేవారు ఎవరైనా ఉన్నారా వంటి వివరాలను సేకరించి అనర్హులను గుర్తించి వారికి నెలవారీ బిల్లింగ్‌ చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో విద్యుత్తు సిబ్బంది క్షేత్రస్థాయిలో వీరి వివరాలను పట్టుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లుగా ఉన్న వారికి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 14 లక్షలకు పైగా గృహవిద్యుత్తు కనెక్షన్లు ఉంటే అందులో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు 1.75 లక్షల మంది ఉన్నారు. వీరిలో మెజారిటీ పాడేరు డివిజన్‌లోనే ఉన్నారు. ఇదివరకు ఎక్కడున్నా కుల ధ్రువీకరణ పత్రం ఇస్తే ప్రభుత్వమిచ్చే 200 యూనిట్ల రాయితీ పరిధిలోకి వచ్చేవారు. అయితే వీరిలో పేదరికానికి ఎగువనున్నవారు సైతం ఈ రాయితీ వాడుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారందరికీ తక్షణం రాయితీ నిలిపేయాలని ఆదేశించింది.

అర్హులకు ఎక్కడున్నా రాయితీ

ఈ విషయమై విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ మహేంద్రనాథ్‌ వద్ద ప్రస్తావించగా ఎస్సీ, ఎస్టీల్లో అర్హులు ఎక్కడ నివసించినా వారికి రాయితీ కొనసాగుతుందని, అనర్హులకు మాత్రమే తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ కేటగిరీలో లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తోందన్నారు.. వారికి రాయితీ నిలిపేస్తామని చెప్పారు. మిగతా వినియోగదారులు ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని