logo

ఓటే ఆయుధం.. అందుకోండి సత్వరం

సమాజాభివృద్ధిలో కీలకంగా మారాల్సిన యువత.. ఓటు అనే ఆయుధాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతోంది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలోని యువ ఓటర్లు తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం.

Published : 27 Nov 2022 05:07 IST

నమోదుకు చొరవచూపని యువత

కొత్తగా దరఖాస్తు చేసిన యువత

నక్కపల్లి, న్యూస్‌టుడే: సమాజాభివృద్ధిలో కీలకంగా మారాల్సిన యువత.. ఓటు అనే ఆయుధాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతోంది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలోని యువ ఓటర్లు తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. జిల్లాల విభజన తర్వాత అనకాపల్లి జిల్లా పరిధిలోకి ఆరు శాసనసభ నియోజకవర్గాలు వచ్చాయి. ఇందులో పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, నర్పీపట్నం, మాడుగుల, చోడవరం ఉన్నాయి. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా చేర్పులు, తొలగింపులు, సవరణలు, బదిలీలకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారుల (ఈఆర్వో) ఆధ్వర్యంలో ఏఈఆర్వోలు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఓటర్ల నమోదుపై దృష్టిసారించి అవగాహన కల్పిస్తున్నారు. బూత్‌ లెవల్‌ (బీఎల్వోలు) అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. కళాశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను మండలాలకు సరఫరా చేశారు. బీఎల్వోల వద్దకు రాలేని వారు ఆన్‌లైన్‌లో మొబైల్‌ ఫోన్‌ ద్వారా కూడా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. 2023 జనవరికి 18 ఏళ్లు నిండే వారితోపాటు ఇదే ఏడాది ఏప్రిల్‌, జులై, అక్టోబరు నాటికి 18 ఏళ్లు నిండే వారినీ భావి ఓటర్లుగా పేర్కొంటూ ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించింది.

3, 4 తేదీల్లో..

ఓటరుగా నమోదయ్యే విషయంలో జిల్లాలో యువత దూరంగా ఉంటోంది. ఆరు నియోజకవర్గాల పరిధిలో 12,68,900 మంది ఓటర్లున్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారు 65,522 మంది ఉంటే 2137 మందే ఓటర్లుగా జాబితాలో ఉన్నారు. సుమారు 63 వేల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉంది. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారు 1.1 లక్షల మంది ఓటర్లుగా చేరాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఇంతమంది దూరంగా ఉండటంతో వీరే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాశాలలకు వెళ్లి అవగాహన సమావేశాలు నిర్వహించడంతోపాటు అక్కడే దరఖాస్తులు ఇచ్చి నమోదు చేయిస్తున్నారు. ప్రత్యేక ఓటరు నమోదు పేరిట డిసెంబరు 3, 4 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. ఓటును సద్వినియోగం చేసుకోగలిగితేనే అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సమస్యలపై నిలదీసే హక్కూ ఉంటుంది.

దరఖాస్తులు స్వీకరిస్తున్న బీఎల్వోలు

ప్రత్యేక చర్యలు - పి.వెంకటరమణ, డీఆర్వో

ప్రస్తుతం యువతను ఓటర్లుగా చేర్చడంపైనే దృష్టిపెట్టాం. ప్రతి కళాశాల నుంచి ప్రిన్సిపల్‌ను నోడల్‌ అధికారిగా, ఆ కళాశాల విద్యార్థిని రాయబారిగా నియమిస్తున్నాం. వీరి ద్వారా అర్హులతో దరఖాస్తు చేయిస్తాం. 18 ఏళ్లు నిండిన/నిండుతున్న వారిని ఓటర్లుగా నమోదు చేయించేలా చూస్తాం. తహసీల్దార్లు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని