logo

నాడు కమ్యూనిస్టులకు కంచుకోట.. నేడు తెదేపాకు పెట్టని కోట

ఒకనాడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న అనకాపల్లి నేడు తెదేపాకు పెట్టని కోటగా నిలిచింది. తెదేపా ఆవిర్భావానికి ముందు వరకు ఇక్కడ ఎర్రజెండా రెపరెపలాడేది.

Updated : 26 Mar 2024 08:16 IST

ఒకనాడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న అనకాపల్లి నేడు తెదేపాకు పెట్టని కోటగా నిలిచింది. తెదేపా ఆవిర్భావానికి ముందు వరకు ఇక్కడ ఎర్రజెండా రెపరెపలాడేది. తెలుగుదేశం పార్టీ తొలి సారిగా 1983 ఎన్నికల్లో పోటీ చేసింది. అంతకు ముందు అనకాపల్లి నియోజకవర్గంలో ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల నుంచి  నాలుగు పర్యాయాలు సీపీఐ అభ్యర్థి విజయకేతనం ఎగరవేశారు.

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి అసెంబ్లీకి తొలిసారిగా 1952లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలో సీపీఐ అభ్యర్థి కె.గోవిందరావు గెలుపొందారు. తర్వాత 1955లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఏవిధంగానైనా ఓడించాలని మిగిలిన పార్టీలు అన్ని జతకట్టాయి. కృషికార్‌లోక్‌ పార్టీ పేరుతో బరిలో దిగి ఈ పార్టీ నుంచి భీశెట్టి అప్పారావు పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత జరిగిన 1962, 1964 ఎన్నికల్లో తిరిగి కమ్యూనిస్టు పార్టీ నుంచి పోటీ చేసిన గోవిందరావు విజయం సాధించారు. ఇక 1972 నాటి ఎన్నికలలో కొత్త సమీకరణలు చోటుచేసుకున్నాయి. కమ్యూనిస్టు పార్టీలో గోవిందరావు, పీవీ రమణ సమఉజ్జీలుగా ఉండేవారు. ఇరువురూ ఒకే స్థాయి నేతలు. దీంతో పార్టీ గోవిందరావును అసెంబ్లీకి పంపగా ఇతర పదవులకు రమణను నిలిపేది. ఆ విధంగానే 1951లో జిల్లా బోర్డు సభ్యునిగా, 1958లో ఎమ్మెల్సీగా రమణను పంపించింది. పార్టీలో రమణ అనుచరులు దీన్ని తరచూ వ్యతిరేకించేవారు. రమణను ఎమ్మెల్యేగా పంపాలని కోరేవారు. దీంతో 1962 నాటి ఎన్నికల్లో గోవిందరావును అనకాపల్లి నుంచి, రమణను కొండకర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీకి నిలిపింది. ప్రస్తుతం అచ్యుతాపురం మండలంలో ఉన్న కొండకర్ల ఆనాడు అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. ఈ ఎన్నికల్లో ఇరువురూ గెలుపొందారు. 1972 ఎన్నికల నాటికి నియోజకవర్గ పునర్విభజనలో కొండకర్లను తొలగించారు. అనకాపల్లి ఒక్కటే ఉన్నందున ఇక్కడ నుంచి ఎవరిని పోటీకి నిలపాలనే అంశంపై పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ఆది నుంచి గోవిందరావు పోటీ చేస్తున్నందున ఆయనకే టికెట్‌ ఇవ్వాలని ఎట్టకేలకు పార్టీ నేతలు నిర్ణయించినా రమణ వర్గీయులు సమ్మతించలేదు. ఆ పరిణామాలను కాంగ్రెసు పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంది. గోవిందరావు 6,893 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1978 ఎన్నికల్లో తిరిగి కమ్యూనిస్టులే జెండా ఎగరవేశారు.

తెదేపా ఆవిర్భావంతో..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కమ్యూనిస్టులు తమ ఉనికిని కోల్పోయారు. 1983 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి రాజా కన్నబాబు గెలుపొందారు. ఇంత వరకు తొమ్మిది పర్యాయాలు ఎన్నికలు జరగ్గా ఆరు సార్లు పసుపు జెండా ఎగిరింది. ఒక సారి కాంగ్రెసు, మరో సారి ప్రజారాజ్యం, గత ఎన్నికలలో వైకాపా గెలుపొందాయి. రాజా కన్నబాబు గెలిచిన తర్వాత ఆయన నాదెండ్ల వర్గంలో చేరిపోయారు. ఏఎంఎల్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన దాడి వీరభద్రరావు సినీ నటుడు రావుగోపాలరావు ఆశీస్సులతో పార్టీ టికెట్‌ పొందారు. వరసగా నాలుగు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 2004 నాటి ఎన్నికల్లో కొణతాల గెలవగా, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తిరిగి తెదేపాకే పట్టం కట్టారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన పీలా గోవిందసత్యనారాయణ ఘన విజయం సాధించారు. గత ఎన్నికలలో వైకాపా నుంచి గుడివాడ అమర్‌నాథ్‌ గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గాన్ని అమర్‌ పట్టించుకోలేదు. ప్రస్తుతం జనసేన నుంచి కొణతాల రామకృష్ణ, వైకాపా నుంచి భరత్‌కుమార్‌ పోటీపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని