logo

విమ్స్‌లో రోగి సహాయకులపైనే భారం

విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి.

Published : 28 Mar 2024 02:46 IST

నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరుపై విమర్శలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. రోగుల బాధ్యతను పట్టించుకోకపోవడంతో సహాయకులపైనే భారం పడుతోంది. బుధవారం ఓ రోగిని సహాయకుడే చక్రాల కుర్చీలో తోసుకుంటూ వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆసుపత్రిలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇప్పటికే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగుల సంఖ్య పెరగడం లేదని విమర్శలున్నాయి.

స్టాఫ్‌నర్స్‌లపై ఎదురు తిరుగుతూ..:

విమ్స్‌లో దాదాపు 200 మంది నాలుగో తరగతి ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, స్ట్రెచర్‌ బాయ్స్‌, డ్రెస్సర్లు ఉన్నారు. వాస్తవానికి స్టాఫ్‌నర్సులు చెప్పిన బాధ్యతలను వారంతా నిర్వర్తించాలి. కానీ వారు అటెండర్లతో పనిచేయిస్తూ ఆసుపత్రిలో షికార్లు చేస్తున్నట్లు తెలిసింది. వారికి గట్టిగా చెప్పినా, బాధ్యత గుర్తుచేసినా.. నర్సులు వేధిస్తున్నారని డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కొంత మంది నర్సింగ్‌ సిబ్బంది వారికి పని చెప్పకుండా.. స్వయంగా చేసుకుంటున్నారు. భద్రత విధులు చూస్తున్న ఉద్యోగులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారి పైస్థాయి ఉద్యోగులు చెప్పిన పనులు చేయకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.

అధిక విద్యార్హతే కారణమా..: నాలుగో తరగతి పోస్టులకు విద్యార్హత పదో తరగతే. కానీ అక్కడ ఉద్యోగుల్లో డిగ్రీ, బీటెక్‌ చదివినవారున్నారు. దీంతో వారంతా నర్సింగ్‌ సిబ్బంది ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు. రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు, నర్సింగ్‌ ఇంఛార్జి చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. పైగా నర్సింగ్‌ ఇంఛార్జిగా పనిచేస్తున్న మహిళను చులకనగా చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఆమె అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. ఉన్నతాధికారికి విషయం తెలిసినా పట్టించుకోరని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉద్యోగులకు ఏమీ చెప్పలేకపోతున్నామని ఆసుపత్రి అధికారులే పేర్కొనడం గమనార్హం. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ తెలిసినా డైరెక్టర్‌ పట్టించుకోవడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని