logo

పరిహారం.. అక్రమాల పర్వం

బొగ్గు తవ్వకాల కోసం సర్వం కోల్పోతున్న కాపురం గ్రామ గిరిజనులకు చుక్కెదురైంది. అధికారులు ప్రకటించిన పునరావాస జాబితాలో అర్హుల పేర్లు గల్లంతయ్యాయి.

Updated : 21 May 2022 01:52 IST

కాపురంలో స్థానికేతరులు ఇలా గృహాలు నిర్మించుకుని ప్రభుత్వ పరిహారం పొందారు..

మల్హర్‌ (జయశంకర్‌ జిల్లా), న్యూస్‌టుడే: బొగ్గు తవ్వకాల కోసం సర్వం కోల్పోతున్న కాపురం గ్రామ గిరిజనులకు చుక్కెదురైంది. అధికారులు ప్రకటించిన పునరావాస జాబితాలో అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. స్థానికేతరులకు పరిహారం మంజూరు చేసిన అధికారులు త్యాగధనులను విస్మరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాడిచెర్ల బ్లాక్‌-1 ఉపరితల గని తవ్వకాలతో కాపురంలో 136, తాడిచెర్ల ఎస్సీకాలనీలో 49 ఇళ్ల సేకరణ చేపట్టారు. సామాజిక, ఆర్థిక సర్వే చేసిన అధికారులు 2017లో ఇళ్లకు సంబంధించిన పరిహారం చెల్లించారు. సుమారు ఐదేళ్లుగా బాంబు పేలుళ్ల మధ్య కాపురం గ్రామ నివాసులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అర్హులైన గిరుజనులకు మొండిచెయ్యి ఎదురైంది. అధికారులు నిబంధనలు పాటించడంలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

లోపించిన పారదర్శకత

ఐదేళ్ల క్రితం ఇళ్ల పరిహారం చెల్లించిన అధికారులు ప్రస్తుతం పునరావాస పరిహారం కింద ఒక్కో కుటుంబానికి( భార్య, భర్త) ఒక యూనిట్‌కు రూ. 7.61 లక్షలు కేటాయించారు. ఆయా కుటుంబాల్లో 2017 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఎంత మంది ఉంటే ఒక్కొక్కరికి రూ. 7.61 లక్షలు మంజూరు చేశారు. ఈ లెక్కన కాపురంలో 171, తాడిచెర్ల ఎస్సీకాలనీలో 61 మంది నిర్వాసితులకు రూ. 13.01 కోట్ల పునరావాస పరిహారం విడుదలైంది. 2017 వరకు 18 ఏళ్లు నిండిన వారికే మంజూరు ప్రతిపాదించారు. అప్పటి తేదీని పరిగణలోకి తీసుకోవడంతో చాలా మంది గిరిజనులకు పరిహారం దక్కలేదు.

* అధికారులను మచ్చిక చేసుకున్న కొందరు అక్రమార్కులు 18 ఏళ్లు నిండని, వివాహాలు చేసుకున్న వారి పేర్లను జాబితాలో చేర్చారు. ఒక్కొక్కరికి రూ.7.60 లక్షల చొప్పున సుమారు రూ. 1.50 కోట్లు స్వాహా చేసేందుకు సిద్ధమైంది. పూర్వకాలం నుంచి నివాసముంటున్న 25 మంది గిరిజన యువతకుపరిహారం మంజూరు చేయలేదు.

తప్పుడు ధ్రువపత్రాలు

పరిహారం కాజేందుకు అక్రమార్కులు తప్పుడు వయస్సు ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. మంథని, గోదావరిఖని, భూపాలపల్లి ఆధార్‌ కేంద్రాల్లో తప్పుడు ఆధార్‌ కార్డులు సంపాదించారు. 2017 ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం మంజూరు చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న వారికి డబ్బులు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారి పదో తరగతి మెమోలు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకిరానున్నాయి.

జాబితాలో పేర్లు లేవు

- సంకుర్తుల లక్ష్మీ, కాపురం

ఏళ్ల తరబడి ఇక్కడనే నివాసం ఉంటున్నా. నా కొడుకు 18 ఏళ్లు నిండాయి. ఇద్దరి పేర్లు పునరావాస పరిహారం జాబితాలో లేవు. బాంబుల పేలుళ్లతో ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు రాలేదో అర్థంకావడంలేదు.

మా పొట్టకొట్టడం సరికాదు

- శీలం మనోజ్‌, స్థానిక యువకుడు

పూర్వం నుంచి అడవిని నమ్ముకుని జీవిస్తున్నాం. బొగ్గు తవ్వకాలతో మా కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. డబ్బుల కోసం ఇళ్లు కట్టుకున్న, వయసు లేని వారికి ఎలా మంజూరు చేశారు. వాళ్లకు లేని నిబంధనలు మాకేందుకు?

అర్హులకు న్యాయం చేస్తాం

- శ్రీనివాస్‌, తహసీల్దార్‌

కొంత మంది మైనర్‌ జాబితా పునరావాస కమిషనర్‌ కార్యాలయంలో ఉంది. అర్హులకు అన్యాయం జరగదు. పూర్తి స్థాయిలో విచారణ చేసి అర్హులకు పరిహారం చెల్లిస్తాం. ప్రస్తుత జాబితా పారదర్శకంగా రూపొందించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని