logo

బడులు తెరిచే నాటికి బాలసైన్యం సిద్ధం

సాంకేతికతోపాటు సైబర్‌ నేరాలూ పెరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు వీటి బారిన పడుతున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టింది

Published : 27 May 2022 03:42 IST

దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: సాంకేతికతోపాటు సైబర్‌ నేరాలూ పెరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు వీటి బారిన పడుతున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టింది. కొంతమందిని  విద్యార్థులను ఎంపిక చేసుకొని బాలసైన్యం (సైబర్‌ అంబాసిడర్లు) తీర్చిదిద్దింది. ఇప్పటికే పదిమంది గుమ్మికూడిన చోట సైబర్‌ నేరాల గురించి వివరిస్తూ.. చైతన్యపరుస్తున్నారు. బడులు ప్రారంభం నాటి నుంచి వీరు పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నారు.

సైబర్‌ కాంగ్రెస్‌ అంటే..
కరోనా మూలంగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణతో ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులు ఆధునిక హంగులున్న చరవాణులను కొనిచ్చి అంతర్జాలాన్ని అనుసంధానం చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను వినడంతోపాటు తరచూ అంతర్జాలంలో పలు విజ్ఞాన అంశాలను శోధించేవారు. వారి తల్లిదండ్రులు కూడా సామాజిక మాధ్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి సైబర్‌ నేరాలపై అంతగా అవగాహన లేకపోవడంతో నేరగాళ్ల ఉచ్చులో పడి పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయారు. ఇలాంటి విషయాల్లో విద్యార్థులను మించిన ప్రచార సాధనంలేదని గమనించిన ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో సైబర్‌ అంబాసిడర్లను నియమించింది. జిల్లాలో ఎంపిక చేసిన యాభై పాఠశాలల్లో ఇద్దరేసి విద్యార్థులకు సైబర్‌ నేరాలు, వారి ఉచ్చులు, ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇచ్చారు.

శిక్షణలో మెలకువలు..
సాధారణంగా బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ, మరేదైనా అపరిచిత నెంబరు నుంచి ఫోన్‌ చేసి లాటరీ వచ్చిందనో నమ్మబలికి బ్యాంకు ఖాతా నెంబరు, ఏటీఎం కార్డు ప్రత్యేక నెంబరు తదితరాలు అడిగి తెలుసుకొని సొమ్ము స్వాహా చేస్తారు. ఇలాంటి అపరిచిత చరవాణి నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్ల విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరిస్తారు. పోలీసు ఉన్నతాధికారులు, సైబర్‌ నేరాల నియంత్రణ నిపుణులు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి విద్యార్థి అంతర్జాల వేదిక ద్వారా ఎనిమిది సమావేశాలు, ప్రాజెక్టులు పూర్తి చేశారు.

  అవగాహన కల్పిస్తూ..
శిక్షణకాలం విజయవంతంగా పూర్తయిన క్రమంలో వీరికి గుర్తింపు కార్డులు అందించారు. పది మంది గుమ్మికూడిన చోట సైబర్‌ నేరాలు, అపరిచిత కాల్స్‌ గురించి స్పందించొద్దని సూచిస్తారు. పొరపాటున బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము బదిలీ అయితే 24 గంటలలోగా సమాచారమిస్తే తిరిగి రాబట్టే అవకాశాలుంటాయని అంతవరకు రానీయొద్దని సూచిస్తారు. ప్రతి పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడి అనుమతితో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. సమావేశాలు, లేదా గ్రామాలలో పదిమంది కూర్చున్న చోటకు వెళ్లి చరవాణి నుంచి ఎవరైనా పొదుపు ఖాతా వివరాలు, డెబిట్‌ కార్డు వివరాలు అడిగినా ఎవరికీ చెప్పొద్దని ఒకటికి రెండు సార్లు హెచ్చరిస్తారు. గ్రామాల్లో ఉన్న సైబర్‌ అంబాసిడర్‌ చరవాణి నెంబరును ప్రదర్శనగా పెడతారు.


 వందమందికి శిక్షణ పూర్తి..
- పూనెం సంయుక్తారాణి, జిల్లా ప్రత్యేకాధికారిణి, సైబర్‌ కాంగ్రెస్‌ విద్యా శాఖ

జిల్లాలో ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో వంద మంది విద్యార్థులకు సైబర్‌ నేరాల ప్రాథమిక సమాచారంపై అవగాహన కల్పించాం. వీరికి ఎనిమిది అసైన్‌మెంట్లు అప్పగిస్తే వాటిని విజయవంతంగా పూర్తి చేశారు. వారికి అవసరమైన సమాచారం అందించా. ప్రజలు ఇలాంటి అనుచిత కాల్స్‌ వస్తే వెంటనే అంబాసిడర్లను సంప్రదిస్తే సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నిలువరిస్తారు. పాఠశాలలు ప్రారంభం కాగానే వీరు పూర్తి స్థాయిలో సేవలందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని