logo

వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనతోపాటు విద్యా రుణాలను అందించేందుకు అధికార యంత్రాంగం

Published : 30 Jun 2022 06:14 IST

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనతోపాటు విద్యా రుణాలను అందించేందుకు అధికార యంత్రాంగం వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2892.19 కోట్లు రుణాలను అందించేందుకు ఆర్థిక రుణ ప్రణాళికను నిర్దేశించింది. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ రూ. 2349.52 కోట్లు, పరిశ్రమలకు రూ. 271.43 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ. 39.64 కోట్లు, ప్రాధాన్యేతర అంశాలకు రూ. 231.50 కోట్లు కేటాయించింది.

గతంలో కంటే పెరిగింది

రెండేళ్లుగా జిల్లాలో అధికార యంత్రాంగం ఖరారు చేసిన వార్షిక ప్రణాళిక కంటే ఈ ఏడాది అదనంగా రూ. 1390.53 కోట్లు ప్రతిపాదించారు. పంట ఉత్పత్తులకు పెట్టుబడులు, భూములు, విత్తనాభివృద్ధి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, విద్యా, గృహరుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రుణ ప్రణాళికలను రూపొందించారు.

అమలులో ప్రగతి ఉంటే మేలు

వివిధ బ్యాంకుల ద్వారా రుణ ప్రణాళిక అమలులో విఫలమైతే ఫలితం ఉండదు. లక్ష్యాన్ని సాధించే దిశలో బ్యాంకు అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సంస్థలు, ప్రజలు, పరస్పర సహాయ, సహకారాలతో ముందడుగు వేస్తేనే ప్రయోజనం కలుగుతుంది. రెండేళ్లుగా పోల్చుకుంటే 2020-21లో 54.99 శాతం, 2021-22లో 69.91 శాతమే రుణాలను అందించి లక్ష్యానికి దూరంగా ఉన్నారు. జిల్లాలో యువతకు రుణాలను అందించడంలో చాలా వెనకబడి ఉన్నామని ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ వారి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమానికి ప్రకటిస్తున్న రుణాలను అందించడంలో శ్రద్ధ చూపాలని సూచించారు.

రుణ లక్ష్యాలను సాధిస్తాం : -విజయరావు, ఇన్‌ఛార్జి ఎల్‌డీఎం

జిల్లాలో ఈ వార్షిక సంవత్సరం ఖరారు చేసిన రుణ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతాం. సాగు రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఇతర రంగాల్లో ఆర్థిక ప్రగతిని సాధించేందుకు కలెక్టర్‌ సహకారంతో కృషి చేస్తాం.

ఈ ఏడు వార్షిక రుణ ప్రణాళిక రంగం లక్ష్యం (రూ.కోట్లలో)

పంట యాజమాన్యం మార్కెటింగ్‌ 1668.49

పంట కాలంలో పెట్టుబడి రుణాలు 238.82

వ్యవసాయ అనుబంధ రుణాలు 247.87

సాగు యంత్రాల పరికరాల కొనుగోలు 136.74

చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 271.43

వ్యవసాయ టర్మ్‌లోన్స్‌ ఎన్‌కిల్లరీ 57.70

విద్యా రుణాలు 10.46

గృహ రుణాలు 18.90

సంక్షేమ పథకాలు 9.28

ప్రాధాన్యేతర రంగాలు 231.50

చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 2147.91

సౌర విద్యుత్తు 1.00

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని