logo

భక్తుల సందడి లేని కాళేశ్వరం

శ్రావణమాసం వచ్చిందంటే చాలు కాళేశ్వరం భక్తులతో కిటకిటలాడేది. గోదావరిలో కొత్త జలాలు చేరడంతో పుణ్యస్నానాలు, శ్రావణంలో ప్రత్యేక పూజలతో పాటు లక్ష పత్రి పూజలు, రుద్రాభిషేకాల కోసం భక్తులు బారులు తీరేవారు.

Published : 08 Aug 2022 05:26 IST

కాళేశ్వరం, న్యూస్‌టుడే: శ్రావణమాసం వచ్చిందంటే చాలు కాళేశ్వరం భక్తులతో కిటకిటలాడేది. గోదావరిలో కొత్త జలాలు చేరడంతో పుణ్యస్నానాలు, శ్రావణంలో ప్రత్యేక పూజలతో పాటు లక్ష పత్రి పూజలు, రుద్రాభిషేకాల కోసం భక్తులు బారులు తీరేవారు. గతేడాది కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో శ్రావణమాసంలో అనేక మంది భక్తులు స్వామివారి సన్నిధిలో గడిపారు. ప్రస్తుతం శ్రావణమాసం భిన్నంగా ఉంది. 10 రోజులు గడిచినా భక్తులు రాకపోవడంతో శుభమాసంపై ఆశలు పెట్టుకున్న ఆలయ టెండరు వ్యాపారులు నష్టపోతున్నారు. ఆలయానికి ఆదాయం తగ్గింది. నిత్యం భక్తులతో కిటికిటలాడే దేవస్థానం అతిథి గృహాలు, హరితాహోటల్‌, ప్రైవేటు లాడ్జీలు బోసిపోతున్నాయి. గత నెల 8 నుంచి వర్షాలు కురుస్తుండడంతో భారీ వరదలతో ఉభయ నదులు ఉప్పొంగి పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌ మోటార్లు మునిగిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు లక్ష్మీ పంపుహౌస్‌ సందర్శనకు వస్తున్న క్రమంలో పోలీసులు కాళేశ్వరానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని భక్తుల్లో అపోహ నెలకొంది. కాళేశ్వరం క్షేత్రానికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల భక్తులు అధికంగా వస్తారు. శ్రావణమాసంలో రెండు రాష్ట్రాలతో పాటు మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. వరదల కారణంగా కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన అవతలి వైపు జాతీయరహదారి కోతకు గురైంది. దీంతో ఆ ప్రాంతాల నుంచి భక్తుల రాకపోకలకు ఆటంకమేర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని