logo

పేరుకే క్రీడా ప్రాంగణాలు..

యువతను, చిన్నారులను ఆటలవైపు మళ్లించాలి. వారిని శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దాలనేది  తెలంగాణ క్రీడా ప్రాంగణాల ముఖ్య లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్న తీరును చూస్తే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే భరోసా కనిపించడం లేదు.

Published : 13 Aug 2022 04:37 IST

భూపాలపల్లి, న్యూస్‌టుడే: యువతను, చిన్నారులను ఆటలవైపు మళ్లించాలి. వారిని శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దాలనేది  తెలంగాణ క్రీడా ప్రాంగణాల ముఖ్య లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్న తీరును చూస్తే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే భరోసా కనిపించడం లేదు. కేవలం లెక్కల కోసం, ఉన్నతాధికారులకు చెప్పేందుకే హడావుడిగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. చిన్న పనులు చేసి మమ అనిపిస్తున్నారు. పలు చోట్ల ప్రాంగణాల్లో క్రీడా పరికరాలు కూడా అందుబాటులో లేవు.  భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తే.. కేవలం రెండు, మూడు గుంటల భూమిని చదును చేసి.. అందులో నాలుగు ఇనుపరాడ్లు పాతేశారు. ఆటలు ఆడుకునేందుకు పూర్తిగా ఆ ప్రాంగణాన్ని సిద్ధం చేయడం లేదు. భూమిని మంచిగా చదును చేయాలి. ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ కోర్టులు ఏర్పాటు చేయాలి. లాంగ్‌జంప్‌ ఫీ‡ట్‌ నిర్మించాలి. వీటిని పూర్తిస్థాయిలో పాటించడం లేదు. ఉన్నతాధికారులు ఈ పనులపై ప్రత్యేక దృష్టిసారిస్తే ప్రయోజనం ఉంటుంది. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 30 వార్డులుండగా ఇందులో సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం అంబేడ్కర్‌ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసింది. ఇందులోనే వివిధ క్రీడలు ఆడుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8 వరకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాధించారు. ఇప్పటికే భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణ, సుభాష్‌కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనకభాగంలో, సింగరేణి మిలీనియం క్వార్టర్ల ప్రాంతంలోని సూపర్‌బజార్‌ పక్కన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. మిగితా 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేయటానికి స్థలాలు కూడా గుర్తించారు.
ప్రతిపాదించినవి..
మున్సిపాలిటీ పరిధిలో ఇంకా ఐదు ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. రాంనగర్‌, జంగేడు కేజీబీవీ సమీపంలో, గడ్డిగానిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, ఆకుదారివాడ, మాంటిస్సోరీ స్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేయడానికి అధికారులు స్థలాలను గుర్తించారు. ఇప్పటికీ వీటిల్లో పనులు మొదలు పెట్టలేదు. అదేవిధంగా మంజూరునగర్‌, పుల్లూరిరామయ్యపల్లి, బీసీ కాలనీలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని యువత, చిన్నారులకు అనుకూలంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా క్రీడా ప్రాంగణాల్లో అన్ని రకాల క్రీడా పరికరాలను అందుబాటులో ఉండే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని పలువురు పేర్కొంటున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితి..
* మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నామమాత్రంగా పనులు చేపట్టారు. ఈ ప్రాంతం క్రీడలకు అనుకూలంగానే ఉందని, కొన్ని విషయాల్లో ఇబ్బంది ఏర్పడే ప్రమాదముంటుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సెలవు రోజుల్లో క్రీడా ప్రాంగణానికి వచ్చిన వారు అదే ప్రాంతంలోని తరగతి గదులకు ముందు వరండాలో కూర్చుని మద్యం సేవించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.
* సుభాష్‌కాలనీ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనక భాగంలో ఇండోర్‌ స్టేడియం కోసం చదును చేసిన ప్రాంతంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ మొక్కలు నాటి వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో అప్పుడప్పుడు పశువులు తిరుగుతున్నాయి తప్పా క్రీడాకారులు ఎవ్వరు కూడా వెళ్లటం లేదు. ఈ క్రీడా ప్రాంగణానికి వెళ్లడానికి సుభాష్‌కాలనీ ప్రధాన రోడ్డు నుంచి ఏర్పాటు చేసిన పైపుకల్వర్టు మట్టి రోడ్డు పూర్తిగా ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది.
* సింగరేణి మిలీనియం క్వార్టర్ల ఏరియాలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో అన్ని రకాల క్రీడా పరికరాలు లేవని పలువురు యువకులు తెలిపారు. మూడు ప్రాంతాల్లో నాలుగు రాడ్ల చొప్పున పాతారు. ఖోఖో ఆడేందుకు రెండు రాడ్లు బిగించారు. లాంగ్‌జంప్‌ కోసం ఫీట్‌ నిర్మాణానికి గుంత తీసి వదిలిపెట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని