logo

యంత్రానికి మరింత ఆధునికత!

జిల్లాలోని కంబాలపల్లికి చెందిన ఇనోవేటర్‌ రేపల్లే షణ్ముఖరావు 2019లో పత్తి, మిర్చిలో కలుపు మొక్కలను తొలగించడానికి తయారు చేసిన ‘మోనోవీల్‌ మ్యాన్‌ రైడింగ్‌ పవర్‌ వీడర్‌’ను పెట్రోల్‌తో నడిచేలా గేర్‌ బాక్స్‌ లేకుండా ద్విచక్రవాహనాల చైన్లతో ముందుకు

Updated : 13 Aug 2022 05:15 IST


మోనోవీల్‌ మ్యాన్‌ రైడింగ్‌ పవర్‌ వీడర్‌ యంత్రంలోని గేర్‌ బాక్స్‌ను చూపిస్తున్న షణ్ముఖరావు

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: జిల్లాలోని కంబాలపల్లికి చెందిన ఇనోవేటర్‌ రేపల్లే షణ్ముఖరావు 2019లో పత్తి, మిర్చిలో కలుపు మొక్కలను తొలగించడానికి తయారు చేసిన ‘మోనోవీల్‌ మ్యాన్‌ రైడింగ్‌ పవర్‌ వీడర్‌’ను పెట్రోల్‌తో నడిచేలా గేర్‌ బాక్స్‌ లేకుండా ద్విచక్రవాహనాల చైన్లతో ముందుకు వెళ్లేలా రూపొందించారు. అనుకున్న విధంగానే యంత్రం పని చేసి గుర్తింపు పొందింది. ఇప్పుడు అ యంత్రానికి మరింత ఆధునికతను జోడించి అన్నదాతలకు తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చి వారికి పెట్టుబడి ఖర్చులను తగ్గించేలా రూపొందిస్తున్నారు. వచ్చే నెల నాటికి యంత్రాన్ని ఆధునికతతో పూర్తి చేస్తానని షణ్ముఖరావు పేర్కొన్నారు.
బ్యాటరీతో నడిచేలా
మొదట గేర్‌ బాక్స్‌ లేకుండా పెట్రోల్‌, చైన్లతో నడిచిన యంత్రాన్ని గేర్లు, పెట్రోల్‌తో పాటు బ్యాటరీతో కూడా పనిచేసేలా రూపొందిస్తున్నారు. ఇందులో రైతు స్వయంగా యంత్రంపై కూర్చొని పంటలోని కలుపు తీసుకునే వీలుంటుంది. రూ. 25 వేల ఖర్చుతో రూపొందిస్తున్న ఈ యంత్రాన్ని అన్నదాతలకు రూ.35 వేలకు అందుబాటులోకి తేవడమే అతని లక్ష్యం. 2019లో జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడంతో కేంద్ర ప్రభుత్వం నిధి ప్రయాస్‌ ద్వారా రూ. 10 లక్షలు కేటాయించింది. వాటితో యంత్రాన్ని మరింత ఆధునికరించేలా సంగారెడ్డి ఐఐటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరేలా ప్రోత్సహించిందని ఇన్నోవేటర్‌ షణ్ముఖరావు తెలిపారు. ఇందుకు సీబీఐటీ ప్రొఫెసర్‌ కౌశిక్‌ను గైడ్‌గా వ్యవహరిస్తున్నట్లు ఐఐటీలోని మేనేజర్‌ ఆపరేషన్‌ సాగర్‌, సాజిద్‌ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తన ఇంటి వద్దనే పరికరాన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రయోజనం ఇలా
యంత్రంతో పత్తి, మిర్చిలోని కలుపు మొక్కలను తొలగించడమే కాకుండా పొడి దుక్కులను దున్నుకునేలా మూడు నాగళ్ల సెట్‌ను, చిన్న రోటావేటర్‌ను, బోదెలను చేసుకునే పరికరాలను మార్చుకునేలా యంత్రాన్ని మరింత ఆధునికరిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లోంచే యంత్రానికి పేటెంట్‌ హక్కును పొందేందుకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఇన్నోవేషన్ల తయారీలో దేశం నుంచి ఎంపికైన నలుగురిలో రాష్ట్రం నుంచి తాను ఎంపిక కావడం గర్వంగా ఉందని షణ్ముఖరావు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని