logo

యువతపైకి రుణపాశం

వరంగల్‌లో ఇప్పటికే సైబర్‌ ఆగంతకులు ప్రజల నుంచి రూ.లక్షల కొద్ది డబ్బులు కాజేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులు, యువత లక్ష్యంగా రుణయాప్‌లు ఇష్టారాజ్యంగా వేధిస్తున్నాయి. పరువు పోతుందని, తల్లిదండ్రులు, బంధువులకు తెలిసిపోతుందేమోనని

Published : 18 Aug 2022 05:24 IST

అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్న నిర్వాహకులు

- న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం

వరంగల్‌లో ఇప్పటికే సైబర్‌ ఆగంతకులు ప్రజల నుంచి రూ.లక్షల కొద్ది డబ్బులు కాజేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులు, యువత లక్ష్యంగా రుణయాప్‌లు ఇష్టారాజ్యంగా వేధిస్తున్నాయి. పరువు పోతుందని, తల్లిదండ్రులు, బంధువులకు తెలిసిపోతుందేమోనని బాధితుల్లో చాలామంది ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోవారికి తెలిసే అవకాశం ఉండదని భావించి పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారు. తీరా కట్టేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.

ఒకసారి రుణం తీసుకుని కట్టేశాక కూడా వదిలిపెట్టరు. అడగకుండానే డబ్బులు ఖాతాకి పంపిస్తారు. ఇదేంటని అడిగితే మీరే రిక్వెస్ట్‌ పెట్టారంటూ గందరగోళానికి గురి చేసి రెట్టింపు డబ్బులు వచ్చేదాకా వేధిస్తూనే ఉంటారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణ యాప్‌ల నిర్వాహకులు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారు. రుణం చెల్లించడంలో జాప్యమైనా.. అడిగినంత చెల్లించకపోయినా వేధింపులకు దిగుతున్నారు. సంక్షిప్త సందేశాలు పంపిస్తూ అసభ్యకరంగా దూషిస్తారు. చిత్రాలు మార్ఫింగ్‌ చేసి మోసగాడు.. దొంగ అంటూ సామాజిక మాధ్యమాల్లో పెడుతారు. ఫోన్‌ కాంటాక్టుల్లోని నెంబర్లకు రుణం తీసుకుని చెల్లించడం లేదని మేసేజ్‌లు పంపించి పరువు బజారుకీడుస్తారు.

కేసు నమోదు ఎలా..

రుణయాప్‌ల బాధితులు ఫిర్యాదు చేస్తే ఐటీ చట్టంలో చీటింగ్‌ కేసు కింద నమోదు చేస్తారు. యాప్‌ ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారు.. దానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఉందా.. లేదా.. అనేది చూస్తారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రుణం తీసుకుంటే చెల్లించేందుకు 60 రోజులు గడువు ఉంటుంది. అంతలోపే అడుగుతున్నాయంటే అవి కచ్చితంగా వేధించే యాప్‌లే అని నిర్ధారణ చేసుకోవచ్ఛు దాదాపు 90 శాతం యాప్‌లకు ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అనుమతులు ఉండవు. రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిశోధించిన ప్రకారం చాలా యాప్‌లు చైనా నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఈ నిర్వాహకులను గుర్తించి పట్టుకోవడం చాలా కష్టం. పోయిన సొమ్ము చాలామటుకు దొరికే అవకాశం ఉండదు. చివరికి సిమ్‌ తీసి వేరేది తీసుకోవాల్సిన ఉదంతాలు అనేకముంటున్నాయి.

ఆకర్షణీయ ప్రకటనలతో...

సైబర్‌ మోసం లాగా రుణయాప్‌ల నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో ఏమారుస్తున్నారు. ఎలాంటి ఆధారాలు అవసరం లేదని, అడిగినంత ఇస్తామని, విడతల వారీగా కట్టొచ్చని.. ఇలా రకరకాలుగా ఎర వేస్తుంటారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలని, అదీ ఉచితమేనని చెప్పి నమ్మిస్తారు. డౌన్‌లోడ్‌ చేసుకున్నాక అసలు కథ మొదలవుతోంది. యాప్‌నకు అనుమతినిస్తూ పోయినకొద్ది ఫోన్‌ కాంటాక్టులు, గ్యాలరీ ఫొటోలు, ఇతర వివరాలు యాప్‌నకు అనుసంధానమవుతాయి. అలా తీసుకున్నవారి వారికి తెలిసేలోపే నిర్వాహకుల చేతిల్లోకి వెళ్లి నిస్సహాయులుగా మార్చుతుంటారు.

అడిగినంత కట్టాల్సిందే..

బాధిత విద్యార్థి ఒకరు రూ.14 వేలు రుణం కావాలని కోరితే రూ.11,600 మాత్రమే ఇచ్చారు. ప్రాసెసింగ్‌ ఫీజు, ఓపెనింగ్‌ ఫీజులంటూ కోత విధించారు. వారం ముగిసే సరికి రూ.16,200 కట్టాలని సందేశం పంపించారు. వేధింపులు ఎక్కువగా కావడంతో చేసేదేం లేక చెల్లించాడు. ఒకసారి రుణం తీసుకున్నాక పూర్తి వివరాలు నిర్వాహకుల దగ్గర ఉంటాయి. దీంతో మరోసారి అవసరం లేకపోయినా డబ్బులు జమ చేసి రెట్టింపు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. నయీంనగర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. నక్కలగుట్టలో ఇంజినీరింగ్‌ విద్యార్థి రూ.20వేలు రుణం తీసుకుని వడ్డీతో సహ చెల్లించినా ఇంకా చెల్లించాలని ఇబ్బంది పెట్టడంతో సెల్‌ఫోన్‌ నెంబర్‌ మార్చుకున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుందాం

* రుణయాప్‌ల జోలికి అస్సలు వెళ్లొద్ధు ఒకవేళ వెళ్లినా వాటికి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అనుమతి ఉందా.. అని చెక్‌ చేసుకోవాలి.

* చరవాణులకు వచ్చే అనసరమైన సందేశాలకు స్పందించొద్ధు ఫోన్‌ చేసి తాము రుణామిస్తామంటూ నమ్మించేవారి మాటలు నమ్మి వివరాలు పంచుకోవద్ధు

* సామాజిక మాధ్యమాల్లో ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు పోస్టు చేయొద్ధు

* ఆకర్షణీయమైన ప్రకటనల లింక్‌లు నొక్కితే మనకు తెలియకుండానే పూర్తి వివరాలు ఆగంతకుల చేతుల్లోకి వెళ్లిపోతాయి.

* రుణయాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చరవాణి డేటాతో పాటు కాంటాక్టు నెంబర్లు, సెల్‌ఫోన్‌లోని వ్యక్తిగత చిత్రాలు, ఇతర వివరాలు సైబర్‌ నేరగాళ్లకు చిక్కే అవకాశం ఉంది. వీటి ఆధారంగా వివిధ రూపాల్లో వేధించే అవకాశం ఉంది.

* ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సైబర్‌ పోలీసులను సంప్రదించాలి.

అలాంటి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు..

రుణయాప్‌లను ఎవరూ డౌన్‌లోడ్‌ చేసుకొవద్దు. రుణం కావాలనుకుంటే బ్యాంకుల వద్దకు వెళ్లి అడిగిన వివరాలు ఇచ్చి నిబంధనల ప్రకారం తీసుకోచ్చు. చాలామంది రుణయాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని మోసపోతున్నట్లు గుర్తించాం. అయితే చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. భయపడకుండా పోలీసులను సంప్రదించాలి. లేకపోతే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. - జనార్దన్‌రెడ్డి, సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్‌  

ఇటీవల జరిగిన ఘటనలు..

* కాజీపేట సోమిడికి చెందిన విద్యార్థి ‘క్రేజీ బీ’ అనే లోన్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని అవసర నిమిత్తం రూ.7 వేలు తీసుకున్నారు. తిరిగి చెల్లించినా డబ్బులు రాలేదనడంతో తిరిగి రూ.8,960 పంపించారు. తర్వాత యాప్‌ నిర్వాహకులు బెదిరిస్తుండటంతో కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* హనుమకొండలోని నయీంనగర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రూ.20 వేలు రుణం తీసుకుని వడ్డీతో సహా చెల్లించారు. యాప్‌ నుంచి అడగకుండానే రూ.30 వేలు ఖాతాలో జమయ్యాయి. ఇలా ఎందుకు ఇచ్చారంటూ యాప్‌ నిర్వాహకులను ప్రశ్నిస్తే వడ్డీతో చెల్లించాలన్నారు. నిరాకరించడంతో అసభ్యకరంగా దూషిస్తూ ఫొటోలు పంపించి వేధించడంతో స్థానిక ఠాణా పోలీసులను ఆశ్రయించారు.

* వరంగల్‌లోని శివనగర్‌కి చెందిన ఓ విద్యార్థి రుణ యాప్‌ నుంచి రూ.లక్ష రుణం తీసుకుని రూ.1.50 లక్షలు చెల్లించినా ఇంకా బాకీ తీరలేదన్నారు. ఒక్కరోజు ఆలస్యమైందని యాప్‌ ప్రతినిధి బాధితుడి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.

* హనుమకొండకు చెందిన ఓ యువతి రూ.10వేలు రుణం తీసుకుని కట్టడంలో కొంత జాప్యం కావడంతో అసభ్యకరంగా సందేశాలు పంపించి వేధించారు. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కొద్దిరోజులకు వేధింపులు ఆగిపోవడంతో సిమ్‌ మార్చేశారు.

పోలీసులు తెలిపిన ప్రకారం రుణయాప్‌ల్లో తరచూ వాడుతున్నవి..

యూపీఏ లోన్‌, ఫస్ట్‌ క్యాష్‌, రిచ్‌, లోన్‌ గో, వావ్‌ రూపీ, శార్ప్‌ లోన్‌, స్కైలోన్‌, లైవ్‌ క్యాష్‌, రూపీ బాక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ లోన్‌, క్యాష్‌ అడ్వాన్స్‌, హలో రూపీ, హ్యాండ్‌ క్యాష్‌, ఐ క్రెడిట్‌, భారత్‌ క్యాష్‌, స్మార్ట్‌ కాయిన్‌, ఈజీ లోన్‌, సిల్వర్‌ ప్యాకెట్‌, క్యాష్‌క్యారీ లోన్‌..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని