logo

మక్కకు ‘మద్దతు’న్నా రైతుకు కన్నీరే!

మొక్కజొన్నలకు మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలు వేసి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రెండేళ్లుగా నష్టపోయిన రైతులు ఖరీఫ్‌లో ఈ పంట సాగు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు కంటే అధిక ధర లభించడం

Published : 29 Sep 2022 02:03 IST

అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి
నర్సంపేట, న్యూస్‌టుడే

నర్సంపేట మార్కెట్‌లో కవర్‌ షెడ్డు కింద ఆరబోసిన రైతుల మక్కలు

మొక్కజొన్నలకు మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలు వేసి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రెండేళ్లుగా నష్టపోయిన రైతులు ఖరీఫ్‌లో ఈ పంట సాగు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు కంటే అధిక ధర లభించడం కొంత ఊరటనిస్తున్నా తగ్గిన పంట దిగుబడి రైతులను నిరాశ పరుస్తోంది.     

ప్రభుత్వ మద్దతు ధర: క్వింటాలుకు రూ. 1962
ప్రస్తుతం మార్కెట్‌లో పలుకుతున్న రూ. 2500-2200

మక్కల ధర పెరిగినందుకు మంచి దిగుబడి వస్తే లాభసాటిగా ఉండేదని రైతులు చెబుతున్నారు. గతేడాది ఎకరాకు 25-30 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రస్తుతం 15-20 క్వింటాళ్లకు మించట్లేదన్నారు.

ఇదీ పరిస్థితి..
కుటుంబ ఖర్చులు, రబీలో పెట్టుబడికి ఆసరా అవుతోందని గంపెడాశతో ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది.  జులైలో వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం.. తర్వాత పక్షం రోజులు తీవ్రమైన ఎండలు కాయడం దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూ పాయని పలువురు రైతులు చెప్పారు. జులైలో క్రమం తప్పకుండా కురిసిన వర్షాలతో పంట చేన్లు జాలుపట్టి బాగా దెబ్బతిన్నాయి. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని పంట చేన్లను కాపాడుకుంటే ఆగస్టు మూడోవారంలో పీసు వేసే దశలో కురిసిన మరోసారి దెబ్బతీశాయి. దీంతో కంకుల సైజు తగ్గడంతో పంట దిగుబడి బాగా పడిపోయింది.

పడిపోతున్న ధరలు
మార్కెట్‌లో రోజు రోజుకు మక్కల ధర పతనమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో క్వింటాలుకు రూ.400 తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 25న క్వింటాలు మక్కలకు రూ.2565 పలికిన ధర బుధవారం రూ.2118కు తగ్గింది. వ్యాపారులు పథకం ప్రకారం ధర తగ్గిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నెల 21న క్వింటాలు రూ.2312 పలికితే ఆరు రోజుల్లో రూ.194 తగ్గిందంటే పరిస్థితి అర్థమవుతోంది.

సగం దిగుబడి పడిపోయింది
- పొడిశెట్టి జంపయ్య, కౌలు రైతు, జల్లి

నాది చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం. కౌలుకు తీసుకున్న రెండెకరాల్లో మొక్కజొన్న వేశాను. పెట్టుబడి ఎకరాకు రూ.50 వేలు అయింది. దిగుబడి రెండెకరాల్లో 38 క్వింటాలు వచ్చింది. పంట బాగుంటే ఎకరాకు 25-30 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఎకరాకు కౌలు రూ.18 వేలు. ఏమి మిగిలే పరిస్థితి లేదు.

ధర తగ్గిస్తున్నారు
- బానోతు బుచ్చా, ఇప్పల్‌తండా, నర్సంపేట

అర ఎకరంలో మక్కలు పండించాను. ఈ ఏడాది ధర మంచిగానే ఉన్నా లాభం లేకుండా పోయింది. పది రోజుల కింద క్వింటాలుకు రూ.2400-2300 కొనుగోలు చేసిన వ్యాపారులు మక్కలు రావడం ప్రారంభం కావడంతో ధర తగ్గిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని