logo

కోతలు లేకుండా కూత వినపడేనా..!

ఒకప్పుడు రైల్వే బడ్జెట్‌ వస్తుందంటే స్థానికులు ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. ఇప్పుడు కేంద్ర సాధారణ బడ్జెట్‌లో ఇది ప్రత్యేకంగా కలిసిపోవడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేటాయింపులు సరిగా తెలియడం లేదు.

Published : 30 Jan 2023 05:18 IST

రైల్వే బడ్జెట్‌పై ‘ఉమ్మడి వరంగల్‌’ ఆశలెన్నో..

కాజీపేట, న్యూస్‌టుడే

ఒకప్పుడు రైల్వే బడ్జెట్‌ వస్తుందంటే స్థానికులు ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. ఇప్పుడు కేంద్ర సాధారణ బడ్జెట్‌లో ఇది ప్రత్యేకంగా కలిసిపోవడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేటాయింపులు సరిగా తెలియడం లేదు. మరోవైపు గత కొన్నేళ్లుగా కీలక ప్రాజెక్టులకు అడుగులు పడడం లేదు. అసంపూర్తి పనులు సైతం ముందుకు సాగడం లేదు.. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న వచ్చే రైల్వే బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రతిపాదిత పనులకు కోతలు లేకుండా కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

వరంగల్‌ రైల్వే స్టేషన్‌


పీఓహెచ్‌కు స్థల సమస్య..

కాజీపేట అయోధ్యపురంలో రూ.900 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పిరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ షెడ్‌, వ్యాగన్‌ రిపేర్‌ షెడ్ల నిర్మాణానికి ఎకరంన్నర స్థల సమస్య కారణంగా పనులు ప్రారంభం కావడం లేదు. 12 ఏళ్లుగా దీని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీఓహెచ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని దేవాదాయశాఖ నుంచి సేకరించి కేంద్రానికి అప్పగించింది.  ఈ క్రమంలో 150 ఎకరాల ప్రైవేటు స్థలానికి ముఖద్వారం వద్ద ఉన్న ఎకరంన్నర భూమి కావాలని కేంద్రం అడుగుతోంది. తాము పనులు చేసుకోవడానికి ఇది అడ్డంకిగా ఉందని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థల సేకరణ చేసి ఇవ్వాలి. ప్రస్తుతం ఈ దస్తావేజు ఆర్డీవో వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ సమస్య తీరితే షెడ్ల నిర్మాణం జరుగుతుంది. దీంతో కాజీపేట చుట్టు పక్కల ప్రాంతాల్లో 1500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.


పేరుకే కాజీపేట.. ప్లాటుఫారాలు రెండే..

కాజీపేట రైల్వే స్టేషన్‌లో మరో రెండు ప్లాటుఫారాలు అవసరం. స్టేషన్‌లో ఇవి మూడు మాత్రమే ఉండటంతో రైళ్లు వేచిచూడాల్సి వస్తుంది. ఈ సమస్య తీర్చడానికి గతంలో మరో రెండు ప్లాటుఫారాలు మంజూరయ్యాయి. ఇంత వరకు ఎలాంటి కదలిక లేదు. ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు జీఎం మీద ఒత్తిడి తీసుకు రావాల్సిన అవసరం ఉంది.


మహబూబాబాద్‌కు మంచి అవకాశం

మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా ప్రయాణికుల, సరకు రవాణా రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక్కడ  ప్లాటుపారాల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న రెండింటికి అదనంగా మరొకటి వస్తే రైళ్ల రాకపోకలు సులువుగా మారుతాయి. ఇంకా స్టేషన్‌లో వేచి ఉండు గదులు, స్టేషన్‌ ఆవరణ విస్తరణ, నెహ్రూసెంటర్‌ వైపు అభివృద్ధి చేయాల్సి ఉంది.


నాలుగు లైన్లు వస్తే టౌన్‌ అభివృద్ధి..

రూ.2500 కోట్లతో బల్లార్షా- కాజీపేట మధ్య మూడోలైను నిర్మాణం జరుగుతోంది. హసన్‌పర్తి రోడ్‌ నుంచి కాజీపేట టౌన్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా వరంగల్‌ వరకు నాలుగు లైన్లను ప్రతిపాదించారు (అదనంగా మరో రెండు) ఇది త్వరతగతిన పూర్తయితే కాజీపేట టౌన్‌ రైల్వే స్టేషన్‌లో ఎక్కువ రైళ్లు ఆగడానికి అవకాశం ఉంది.


భద్రాచల రామయ్య.. మేడారం వచ్చేనా?

వరంగల్‌ రైల్వే స్టేషన్‌ను వాస్తుశిల్పం పేరుతో రూ.12 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ కేంద్రంగా వరంగల్‌ భద్రకాళి నుంచి భద్రాచల రామయ్య.. అక్కడి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవచ్చు. ఇప్పటికే వరంగల్‌ నుంచి కొత్తగూడెం (భద్రాచలం రోడ్‌) వరకు  రైలు మార్గం ఉంది. కొత్తగూడెం, మణుగూరు నుంచి తాడ్వాయి అడవుల మీదుగా రామగుండం, భూపాలపల్లికి రెండు మార్గాల్లో సర్వే కోసం గతంలో బడ్జెట్‌లో ప్రతిపాదనలు వచ్చాయి. ప్రైవేటు సంస్థతో సర్వే కూడా చేయించారు.

* ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే వరంగల్‌ భద్రకాళి నుంచి కొత్తగూడెం మీదుగా భద్రాచలం.. అక్కడి నుంచి సమ్మక్క సారలమ్మ.. తాడ్వాయి అభయారణ్యాల పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. హసన్‌పర్తి నుంచి కరీంనగర్‌కు గతంలో రెండు సార్లు బడ్జెట్‌లో ప్రస్తావన వచ్చింది.  ఆ తర్వాత దీని ఊసు లేదు. ఇదే జరిగితే వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి నుంచి వేములవాడ రాజన్న దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కరీంనగర్‌ మీదుగా నిజామాబాద్‌ ఇప్పటికే ఉన్న రైల్వే మార్గం ద్వారా బాసర సరస్వతిని కూడా దర్శనం చేసుకోవచ్చు.


వీటినైనా దృష్టి పెట్టాలి..

* జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపురం నుంచి సూర్యాపేటకు యూపీఏ ప్రభుత్వం ఉండగా కొత్త రైల్వే లైను ప్రతిపాదన వచ్చింది. దీనిపై సర్వే జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి లేదు. డోర్నకల్‌ నుంచి మిర్యాలగూడకు గత బడ్జెట్‌లో ప్రకటించి ఆ తర్వాత ఎలాంటి ఊసు లేదు.

* హైదరాబాదు నుంచి జనగామ రైల్వేస్టేషన్‌ వరకు మూడోలైను నిర్మించి ఎంఎంటీఎస్‌ రైలును నడపాలని రైల్వే భావిస్తోంది. కాజీపేట వరకు మూడోలైను నిర్మిస్తే ఎంఎంటీఎస్‌ రైలు వరంగల్‌ రైల్వే స్టేషన్‌ వరకు నడపడానికి అవకాశం ఉంది.

* కాజీపేట రైల్వే స్టేషన్‌ పరిధిలో రైళ్లను శుభ్రం చేయడానికి రెండు పిట్‌లైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కాజీపేట నుంచి ముంబయికి రెండు రైళ్లు నడుపుతున్నారు. ఇలా మరిన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తే స్టేషన్‌ మరింత అభివృద్ధి చెందుతుంది. కాజీపేట నుంచి షిర్డీ, తిరుపతి లాంటి ప్రాంతాలకు రైళ్లు వేయాలని డిమాండ్లు ఉన్నాయి.


ప్రతిపాదనలు పంపాం
- వరంగల్‌ ఎంపీ పి దయాకర్‌

రైల్వే బడ్జెట్‌ కోసం  ప్రతిపాదనలు పంపించాం. కాజీపేట డివిజన్‌, పీఓహెచ్‌, వ్యాగన్‌ పరిశ్రమ, కాజీపేట టౌన్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి కాజీపేట నుంచి తిరుపతికి, షిర్డీకి కొత్త రైళ్లను వేయాలని కోరాం. గతంలో ప్రతిపాదించిన రైల్వే లైన్లను పరిశీలించాలని చెప్పాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని