logo

అంగన్‌వాడీలో చిన్నారులకు అస్వస్థత!

గూడూరు మండలం లైన్‌తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్థులు తెలిపారు.

Updated : 02 Feb 2023 06:32 IST

నర్సంపేట ఆసుపత్రిలో..

కొత్తగూడ, న్యూస్‌టుడే: గూడూరు మండలం లైన్‌తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు, చిన్నారులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. లైన్‌తండాలోని అంగన్‌వాడీ పాఠశాలకు మంగళవారం నలుగురు చిన్నారులు వెళ్లారు. అంగన్‌వాడీ టీచర్‌ సెక్టార్‌ సమావేశం నిమిత్తం గూడూరు ఐసీడీఎస్‌ కార్యాలయానికి వెళ్లారు. ఆయా తాను విధులకు రాకుండా ఇతర వ్యక్తికి అప్పగించారు. ఆయనే పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని వండిపెట్టినట్లు పేర్కొన్నారు. చిన్నారుల్లో జస్వంత్‌, శాన్వీ, జగదీష్‌ భోజనం చేసిన గంట తర్వాత అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పిల్లలను నర్సంపేటలోని ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. శాన్వీ, జగదీశ్‌లను మంగళవారం రాత్రి ఇంటికి పంపినట్లు పేర్కొన్నారు. జస్వంత్‌కు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. నలుగురు చిన్నారుల్లో ముగ్గురు భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురవ్వడంతో కలుషిత ఆహారం తినడంతోనే ఇలా జరిగిందని తల్ల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై గూడూరు ఐసీడీఎస్‌ సీడీపీవో నీలోఫర్‌ఆజ్మీ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన ముగ్గురు పిలల్లో ఒకరు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఆ బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఆసుపత్రి వైద్యుడితో మాట్లాడగా పడని ఆహారం ఏదో తినడంతో ఇలా జరిగి ఉంటుందని చెప్పారన్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామన్నారు. ఐసీడీఎస్‌ పీడీ నర్మద అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని