logo

భారాసపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

రాష్ట్రంలో పనిలేకుండా తిరుగుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారాలను భారాస కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి సత్యవతిరాథోడ్‌ కోరారు.

Published : 24 Mar 2023 04:09 IST

మాట్లాడుతున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పనిలేకుండా తిరుగుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారాలను భారాస కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి సత్యవతిరాథోడ్‌ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలో నిర్వహించిన భారాస ఆత్మీయ కుటుంబ సమ్మేళనం సందర్భంగా మహబూబాబాద్‌ గ్రామీణ మండలం కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో సత్యవతి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పథకాలతో ప్రతిపక్ష పార్టీల్లో భయం ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించలేమని గ్రహించిన ఆ పార్టీల నాయకులు ఒక్క అబద్ధాన్ని నిజం అని ప్రజల్ని నమ్మించేందుకు వంద సార్లు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు భారాస పాలనలో చేపట్టిన అభివృద్ధి ఫలాలను వివరిస్తే మహబూబాబాద్‌ నియోజకవర్గంలో మూడోసారి కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కొందరు వైఎస్సార్‌ రాజ్యం తెస్తామని తిరుగుతున్నారని వైఎస్సార్‌ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిని మళ్లీ తీసుకువస్తారా.. బయ్యారం ఉక్కు ఖనిజాన్ని తరలించుకుపోతారా అంటూ ధ్వజమెత్తారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం గవర్నర్‌ వ్యవస్థను అభాసుపాలు చేస్తుందని రాష్ట్రంలో గవర్నర్‌ను పావుగా వాడుకుంటూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మిగిలిపోయిన గొర్లెకాపరులకు త్వరలో మరో విడత గొర్లను పంపిణీ చేస్తామన్నారు. అర్హులైనవారికి నియోజకవర్గంలో మూడు వేల ఇళ్లు మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. తాను పర్యటించే ప్రతి గ్రామంలో రూ. 10 లక్షలు నిధులను మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందించిన పథకాలను వారికి గుర్తు చేయాలన్నారు. ప్రతి కార్యకర్త బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. కొన్ని వలస పక్షులు వచ్చి ఏమో మాట్లాడుతున్నాయన్నారు. వారు నోరుమెదిపితే నాలుక కోస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. తాను గతంలో ఒక్క చూపు చూస్తే ఏం జరిగిందో తెలుసుకదా? అని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ, భారాస రాష్ట్ర కార్యదర్శి పురాణం సతీష్‌, జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు, జడ్పీటీసీ సభ్యురాలు ఎల్‌.ప్రియాంక, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ నాయిని రంజిత్‌, నాయకులు తేళ్ల శ్రీనివాస్‌, సుధగాని మురళి, ఎల్‌.అశోక్‌, సాయిలు, ఎన్‌.వెంకన్న, సంద వీరన్న, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని