logo

‘మోదీ పాలన దేశానికే ప్రమాదకరం’

‘ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ఎదిగిన ప్రధాని మోదీ ప్రత్యేకమైన వ్యక్తి.. టెర్రరిజం వల్లకాదు, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ పాలనలో దేశానికే ప్రమాదం ముంచుకొస్తుంది.

Updated : 27 Mar 2023 06:41 IST

ప్రసంగిస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, చిత్రంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలు

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: ‘ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ఎదిగిన ప్రధాని మోదీ ప్రత్యేకమైన వ్యక్తి.. టెర్రరిజం వల్లకాదు, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ పాలనలో దేశానికే ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ ఉపద్రవం నుంచి దేశాన్ని రక్షించేందుకు కలిసివచ్చే పార్టీలతో సీపీఐ ఉద్యమాలను సాగిస్తూ ముందుకు వెళుతుంది’ అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌లో నిర్వహిస్తున్న ‘ప్రజాపోరు యాత్ర’ ఆదివారం రాత్రి మహబూబాబాద్‌ చేరింది. పట్టణంలో నిర్వహించిన సభలో నారాయణ మాట్లాడారు. కేంద్రంలోని భాజపా కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వరంగ సంస్థలను అప్పగిస్తోందన్నారు. ప్రధానంగా అదానికి దేశ సంపదను దోచి పెడుతోందన్నారు. ఈ విధానాలను నిలదీస్తున్నందుకే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై  రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని నారాయణ ఆరోపించారు. అమిత్‌షాపై ఉన్న అత్యాచార కేసుల నుంచి ఆయనను  కాపాడేందుకు 12 మందిని హతమార్చారన్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రి వర్గంలో 24 మందిపై కేసులు ఉన్నాయన్నారు. రాహుల్‌ గాంధీ ఉదంతంపై ప్రతిపక్ష పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. గ్రామాల్లో తిరిగి ‘మోదీ హఠావో దేశ్‌కీ బచావో’ నినాదంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామన్నారు. రాష్ట్రంలో భాజపా బలోపేతం కావడానికి పరోక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారణమన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవల మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై దిల్లీలో చేసిన పోరాటానికి మద్దతు తెలిపామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ సాధనకు కలసి పోరాడేందుకు సీపీఐ సిద్ధంగా ఉందన్నారు. సీపీఐ నేత బి.అజయసారథిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.జ్యోతి, నాయకులు నల్లు సుధాకర్‌రెడ్డి, కె.శ్రీనివాస్‌, కె.పాండురంగాచారి, పి.రమేష్‌, పి.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు