logo

కర్ర దానం.. దహన సంస్కారాలకు సాయం

గ్రామంలో ఎవరైనా చనిపోతే అందరూ వెళ్లి చివరిచూపు చూసి వస్తారు. దగ్గరివారు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉంటారు. ఈ దేవరాజు మాత్రం చివరి కర్ర కాలే వరకు తోడుంటారు.. ఎలాగంటారా పేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కరాలకు అవసరమైన కర్రను ఉచితంగా సమకూరుస్తారు.

Published : 01 Apr 2023 04:11 IST

ఆదర్శంగా నిలుస్తున్న దేవరాజు దంపతులు

గ్రామంలో ఎవరైనా చనిపోతే అందరూ వెళ్లి చివరిచూపు చూసి వస్తారు. దగ్గరివారు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉంటారు. ఈ దేవరాజు మాత్రం చివరి కర్ర కాలే వరకు తోడుంటారు.. ఎలాగంటారా పేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కరాలకు అవసరమైన కర్రను ఉచితంగా సమకూరుస్తారు. ఇలా ఇప్పటి వరకు 92 పేద కుటుంబాలకు ఆసరా అయ్యారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌కు చెందిన ఈగ దేవరాజు చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు.  న్యూస్‌టుడే, రఘునాథపల్లి, జఫర్‌గఢ్‌,

ఖిలాషాపూర్‌కు చెందిన ఈగ దేవరాజు తండ్రి ఈగ ధనప్రకాష్‌, సృజన దంపతులు ఏడాదిన్నర కిందట మృతి చెందారు. తండ్రి చేసే కర్ర వ్యాపారాన్ని తాను కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు కొద్ది రోజుల వ్యవధిలో మృతి చెందడం ఆయన్ను కలచివేసింది. వారి జ్ఞాపకార్థం ఏదైనా సేవ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఏడాదిన్నర కిందట గ్రామానికి చెందిన  పేద కుటుంబానికి చెందిన ఒకరు చనిపోయారు. ఆయన్ను దహనం చేసేందుకు డబ్బులు లేకపోవడంతో బంధువులు విరాళాలు సేకరించారు. ఇది చూసిన దేవరాజు రూ.4 వేలు ఇవ్వడంతో పాటు దహనసంస్కారానికి అవసరమైన కర్రలు అందజేశారు. ఇక నుంచి గ్రామంలో ఎవరు చనిపోయినా ఉచితంగా కర్రలు అందిద్దామని భార్య యాదలక్ష్మి, సోదరుడు లాజర్‌కు చెప్పడంతో వారు అంగీకరించారు. ఇందుకోసం తల్లిదండ్రుల పేరు మీద సొంతంగా ఒక ఫౌండేషన్‌ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో ఖిలాషాపూర్‌ గ్రామస్థులకే ఇచ్చేవారు.. క్రమంగా సమీపంలోని మాదాపురం, రఘునాథపల్లి మండలం కోమాల, స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన పేదలు సైతం వస్తుండడంతో వారికి కూడా దహన సంస్కారాలకు కర్ర సాయం చేస్తున్నారు.

సమాచారం అందిస్తే ..

దహన సంస్కారాకలు కర్ర కావాలని దేవరాజుకు సమాచారం ఇస్తే.. ట్రాక్టరు వచ్చేలోపు కర్ర సిద్ధం చేసి ఉంచుతారు. ఇప్పటి వరకు 92 మందికి కర్రను అందించారు. ఖిలాషాపూర్‌లో ఆరు నెలల కిందట వారం రోజుల్లో రోజుకు ఒకరి చొప్పున ఏడుగురు చనిపోతే కర్ర అందుబాటులో లేకపోతే తన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లను నరికించి పంపారని గ్రామస్థులు తెలిపారు. దహనం చేసేందుకు అవసరమైన కర్రకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అవుతుంది. 92 మందికి ఇప్పటి వరకు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. దేవరాజు పేద విద్యార్థులకు ఏటా రాత పుస్తకాలు, పదో తరగతి విద్యార్థులు పరీక్షల ప్యాడ్‌లు, పెన్నులు ఇతర సామగ్రిని సైతం అందజేస్తారు. కరోనా కాలంలో పేదలకు భోజనం అందించడంతో పాటు వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు.

తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికే.. : - ఈగ దేవరాజు

తల్లిదండ్రులు చిన్నతనం నుంచి తమకు ఎలాంటి కష్టం రాకుండా పెంచారు. వారు మూడు నెలల వ్యవధిలో చనిపోయారు. ఆ దుఃఖం నుంచి బయట పడేందుకు నాకు నాలుగు నెలలు పట్టింది. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేదలకు సేవ చేయాలనుకున్నాను. తండ్రి చేసే కర్ర వ్యాపారం గురించి నాకు తెలుసు. దీంతో చనిపోయిన కుటుంబాలవారు పడే బాధను గమనించి ఉచితంగా కర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా. నేను ఇంటి వద్ద అందుబాటులో లేకుంటే నా భార్య  కర్ర అందిస్తుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని