logo

అవస్థల పయనం.. మరమ్మతులు గగనం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారి(353సి) అస్తవ్యస్తంగా మారింది.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం..

Published : 29 May 2023 03:16 IST

దేవుడా.. నీవే దిక్కు

ఇక్కడ రోడ్డుపై కంకర తేలి కనిపిస్తున్నది మహదేవ్‌పూర్‌ నుంచి కాళేశ్వరం వెళ్లే రహదారి. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో రహదారి విస్తరణలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.


న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారి(353సి) అస్తవ్యస్తంగా మారింది.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. అసంపూర్తిగా పనులను చేపట్టడం, అటవీ అనుమతులు సాధించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నా నిర్మాణ పనులు అసంపూర్తిగా, నాణ్యత లేకుండా చేపడుతున్నారు. దీంతో కొన్ని రోజులకే రహదారి మొత్తం దెబ్బతిని గుంతలమయంగా మారుతోంది. ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అందులో ముఖ్యంగా కాళేశ్వరం నుంచి ఇసుక లారీలు, భూపాలపల్లి నుంచి బొగ్గు లారీలు, కేటీపీపీ నుంచి బూడిద లారీలు అధిక లోడుతో ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో వెళ్తాయి. దీంతె రోడ్డంతా గుంతలమయంగా మారింది. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్లేదారి ఇదే కావడంతో హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి వాహదారులు ఈ రహదారి మీదుగానే ప్రయాణించాలి. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

పట్టించుకోని అధికారులు

జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేసేవారే కరవయ్యారు. నిత్యం ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తున్నా చూసీచూడనట్లు సంబంధింత అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల గ్రామస్థులు, యవకులు శ్రమదానంతో గుంతలను మట్టితో పూడ్చే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై ఇన్ని గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నా ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మురుగు ముంచెత్తుతోంది..

ఈ చిత్రంలో కనిపిస్తున్నది రేగొండ మండల కేంద్రంలో జాతీయ రహదారికి సంబంధించి నిర్మించిన మురుగుకాల్వ.. నిర్మాణం మధ్యలోనే నిలిపివేయడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద రోడ్డుపైకి పారుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు ఇళ్లలోకి వస్తుండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


అటవీ అడ్డంకులు

ఇక్కడ కనిపిస్తున్నది మహదేవ్‌పూర్‌ నుంచి కాళేశ్వరం వెళ్లే రహదారి. 15 కి.మీ మేర అటవీ ప్రాంతం కావడంతో అటవీ అనుమతులు రావడం లేదు. రహదారి విస్తరణలో ఎన్ని చెట్లు పోతాయో లెక్కించి గుర్తులు పెట్టారు. అలాగే 2 కి.మీ మేర రహదారి నిర్మాణానికి కాళేశ్వరం గ్రామస్థులు భూములు కోల్పోవాల్సి రావడంతో తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.


నత్తనడక.. నాసిరకం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్‌లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాసిరకంగా చేపడుతుండటంతో మురుగు కాల్వలపై ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెలు పగిపోతున్నాయి. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. పనులు చేపడుతున్న ప్రదేశంలో నీరు చల్లకపోవడంతో దుమ్ముతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


కుంగిన దారి..

కాటారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు కుంగిపోయి ఒక వైపు ఎత్తుగా మారింది. దీంతో చిన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయరహదారి పక్కన నిర్మించిన మురుగు కాల్వలు అసంపూర్తిగా ఉండటంతో వర్షపు నీరు రోడ్డుపైకి వస్తోంది.


గుత్తేదారుదే నిర్వహణ బాధ్యత..

- విద్యాసాగర్‌, ఈఈ, వరంగల్‌

జాతీయ రహదారి మరమ్మతు పనులు చేపడుతున్నాం. గుత్తేదారు నాలుగేళ్లపాటు మరమ్మతు పనులు చూసుకోవాల్సిందే. భూపాలపల్లి నుంచి చెల్పూర్‌ వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. మహదేవ్‌పూర్‌ నుంచి కాళేశ్వరం రహదారి పనులకు సంబంధించి టెండర్‌ పూర్తయి గుత్తేదారు సిద్ధంగా ఉన్నారు. అటవీ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని