logo

పట్టణ ప్రగతి నిధులు విడుదలయ్యేనా?

పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ ప్రగతి పనులకు నిధులు నెలలు గడిచినా విడుదల కావడం లేదు.

Published : 07 Jun 2023 04:29 IST

మహబూబాబాద్‌ పట్టణంలోని తొర్రూరు రోడ్డులో పట్టణ ప్రగతి నిధులతో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ ప్రగతి పనులకు నిధులు నెలలు గడిచినా విడుదల కావడం లేదు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది పురపాలక సంఘాల్లో ఐదు నెలల నుంచి నిధులు రాకపోవడంతో.. ఆ నిధుల విడుదలకు ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని పురపాలక సంఘాలు ఎదురు చూస్తున్నాయి. చేసిన పనుల బిల్లుల కోసం వస్తున్న గుత్తేదారులకు సమాధానం చెప్పలేక అధికారులు సందిగ్ధంలో పడుతున్నారు. ప్రతిపాదించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తుంటే, పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించనిదే పనులెలా చేయాలంటూ గుత్తేదారుల వాపోతున్నారు.

ఐదు నెలలు దాటినా..

పట్టణాల్లో చేపట్టిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసి ప్రతి నెలా బిల్లులు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2020లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. జనాభా ప్రాతిపదికన పురపాలక సంఘాలకు ఎన్ని నిధులు కేటాయించాలో ముందుగానే నిర్దేశించి ఆ మేరకు పనులను ప్రతిపాదించేవారు. పూర్తి చేసిన పనులకు వందశాతం నిధులు వెంటనే విడుదలయ్యేవి. 2021 ఆగస్టు నుంచి పట్టణ ప్రగతి నిధుల్లో  సుమారు 25 శాతం నిధులకు కోత విధించింది. మిగిలిన 75 శాతం నిధులను కూడా క్రమం తప్పకుండా విడుదల చేయడం లేదు. ఐదు నెలలు దాటినా.. నేటికి నిధులు విడుదల చేయనట్లు తెలిసింది. 2022 నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన పట్టణ ప్రగతి నిధులను, 2022 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను 2023 మార్చి 31న విడుదల చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఎలాంటి నిధులు విడుదల చేయలేదని తెలిసింది.

పనులు చేయిస్తున్నాం

కె.ప్రసన్నరాణి, పురపాలక కమిషనర్‌

ప్రతి నెలా పట్టణ ప్రగతికి నిధులు మంజూరవుతాయనే ప్రణాళికాబద్దంగా ఆ పథకం ద్వారా వివిధ పనులను చేయిస్తున్నాం. చేసిన పనుల వివరాలను బిల్లుల చెల్లింపునకు సంబంధిత అధికారులకు పంపించాం. ఈ పథకంలో చేపట్టే పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. వారిని ఒప్పించి పనులు చేయించాం. నిధుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని