logo

15 సార్లు ఎన్నికలు.. నలుగురే ఎమ్మెల్యేలు

మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోని డోర్నకల్‌ నియోజకవర్గం డోర్నకల్‌, మరిపెడ, కురవి, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు, సీరోలు మండలాలతో విస్తరించి ఉంది.

Published : 29 Oct 2023 05:37 IST

ఉద్ధండుల ఖిల్లా డోర్నకల్‌
డోర్నకల్‌, న్యూస్‌టుడే

కురవిలోని వీరభద్రస్వామి ఆలయం

మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోని డోర్నకల్‌ నియోజకవర్గం డోర్నకల్‌, మరిపెడ, కురవి, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు, సీరోలు మండలాలతో విస్తరించి ఉంది. నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు (డోర్నకల్‌, మరిపెడ) ఉన్నాయి. ఏడు మండలాల పరిధిలో 167 పంచాయతీలుండగా, తండాలు, గిరిజన జనాభా అధికం.

నియోజకవర్గం ముచ్చట

  • 1952లో మరిపెడ మండలంలోని చిల్లంచర్ల నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1957లో ఏర్పడిన డోర్నకల్‌ నియోజకవర్గానికి 2004 వరకు జనరల్‌ కేటగిరీ స్థానం కేటాయించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఎస్టీ కేటగిరీకి రిజర్వ్‌ అయింది.
  • డోర్నకల్‌ నియోజకవర్గం జనరల్‌ కేటగిరీగా ఉన్నప్పుడు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గిరిజనుడైన రెడ్యానాయక్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. డోర్నకల్‌ అసెంబ్లీ స్థానానికి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరగగా  ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది మాత్రం నలుగురే. వారు..  నూకల రామచంద్రారెడ్డి (నాలుగు పర్యాయాలు), రామసహాయం సురేందర్‌రెడ్డి (నాలుగు పర్యాయాలు), సత్యవతిరాథోడ్‌ (ఒకసారి), రెడ్యానాయక్‌ (ఆరు  పర్యాయాలు)
  • ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నూకల రామచంద్రారెడ్డి, రెడ్యానాయక్‌లు గతంలో మంత్రులుగా పని చేశారు.

స్వరూపం ఇదీ

  • డోర్నకల్‌ నియోజకవర్గ కేంద్రం రైల్వే కూడలి. ఇది చెన్నై-దిల్లీ గ్రాండ్‌ ట్రంక్‌ మార్గంలో ప్రధాన రైల్వేస్టేషన్‌. ఇక్కడి నుంచే భద్రాచలం రోడ్‌(కొత్తగూడెం), మణుగూరు వైపు రైల్వే ట్రాక్‌ ఉంది.
  • మరిపెడ, కురవి మండలాల మీదుగా జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి.
  • కురవిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం పేరొందింది. ఇక్కడ ఏటా కల్యాణ మహోత్సవం, జాతరలను  వైభవంగా నిర్వహిస్తారు.
  • డోర్నకల్‌లో తెలంగాణలోనే రెండో అతిపెద్ద చర్చి ఆఫ్‌ సౌత్‌ ఇండియా(సీఎస్‌ఐ)కి చెందిన ఎపీఫనీ చర్చి ప్రసిద్ధి.
  • మరిపెడలో మాకుల వేంకటేశ్వరస్వామి దేవాలయం, అబ్బాయిపాలెంలో అగస్తేశ్వరస్వామి దేవాలయం, గుండెపూడిలో కాకతీయుల కాలం నాటి శ్రీరామాలయం ప్రసిద్ధి.
  • నర్సింహులపేటలోని రెండు జంట దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంకటేశ్వరస్వామి, కపిలగిరి పర్వతంపై లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలున్నాయి. లక్ష్మీనర్సింహస్వామి వెయ్యేళ్ల క్రితం వెలిసినట్లు ప్రతీతి. వేంకటేశ్వర ఆలయంలో హోలీ రోజు స్వామి వారి కల్యాణ మహోత్సవం, వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
  • నియోజకవర్గంలో వర్షాధారిత వ్యవసాయం. రైతులు ప్రధానంగా వరి, మిరప, పత్తి పండిస్తున్నారు. నియోజకవర్గం మీదుగా ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు ప్రవహిస్తుంటాయి.

అభ్యర్థులు

భారాస -  ధరంసోతు రెడ్యానాయక్‌  
కాంగ్రెస్‌ -  ఖరారు  కాలేదు
భాజపా -  భూక్య సంగీత

ఏకగ్రీవ ఎమ్మెల్యేలు ముగ్గురు

వరంగల్‌ వ్యవసాయం, రంగంపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో రెండింటిలో ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే..

  • మొదటిసారి డోర్నకల్‌ నియోజకవర్గంలో 1972లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎన్‌.రామచంద్రారెడ్డి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటికే ఈయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1957, 1962, 1967లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది.
  • ఇదే నియోజకవర్గం నుంచి 1974లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రామసహాయం సురేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1978, 1983, 1985లో వరుసగా ఆయనే గెలుపొందారు.
  • చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. 1975లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎన్‌.యతిరాజారావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశేషమేమిటంటే  1978, 1983, 1985, 1989, 1994 వరకు వరుసగా  ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీటిలో 1978లో కాంగ్రెస్‌ పార్టీనుంచి 1983లో కాంగ్రెస్‌-ఐ నుంచి గెలుపొందగా 1985, 1989, 1994 లలో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 1999లో ఆయన కుమారుడు డా.ఎన్‌.సుధాకర్‌రావు గెలుపొందారు. చెన్నూరు నియోజకవర్గం ఉన్నంత కాలం యతిరాజారావు కుటుంబానిదే ఆధిపత్యం కొనసాగింది. తర్వాత ఇది పాలకుర్తిగా  రూపాంతరం చెందింది.

మీకు తెలుసా?

పట్టుబడితే.. వారంలో తిరిగిచ్చేస్తారు..!

ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద, ఇతర తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్మును జిల్లా ఖజనా అధికారికి అప్పగిస్తారు. ఆ నగదు, ఆభరణాలకు సంబంధించిన పత్రాలు వెంటనే చూపకపోయినా ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఏర్పాటైన అధికారుల కమిటీకి సమర్పించి.. సొమ్ము తిరిగి పొందవచ్చు. కలెక్టరేట్‌లో ఈ కమిటీ అందుబాటులో ఉంటుంది. ఆధారాలు, సరైన పత్రాలు సమర్పించిన తర్వాత కమిటీ పరిశీలించి విశ్వసిస్తే సదరు సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. ఈ ప్రక్రియ వారంలో పూర్తి కావాల్సి ఉంటుంది. వారం దాటితే వాటిని సీజ్‌ చేసి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నారు. స్వాధీన పర్చుకున్నవి కోర్టుకు అప్పగిస్తారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత కోర్టుకు తగిన ఆధారాలు సమర్పించి సొమ్మును విడిపించుకోవాల్సి ఉంటుంది.

న్యూస్‌టుడే, భూపాలపల్లి టౌన్‌


మహనీయుల మాట

అభ్యర్థులు అవినీతి పరులని, నిజాయితీ లేని వారని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటెయ్యొద్దు.

జవహర్‌లాల్‌ నెహ్రూ


నినాదం

అనాలోచితంగా వేసే ఓటు.. యువత భవితకు చేటు


యువగళం

భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం ఓటు

- భూక్య గణేశ్‌, తొలిసారిగా ఓటేస్తున్న యువకుడు

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం ఓటు. కాబట్టి నా తొలి ఓటును  సమర్థుడైన  నేతకు వేస్తా.  అందరూ ఓటేసేలా నేటి యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అధికారులు ఆ  దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. మొదటిసారిగా ఓటు వేయబోతున్నందుకు సంతోషంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని