logo

నర్సంపేట భాజపా అభ్యర్థిగా పుల్లారావు

నర్సంపేట నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా నర్సంపేట పట్టణానికి చెందిన కంభంపాటి పుల్లారావు అలియాస్‌ ప్రతాప్‌ ఖరారయ్యారు.

Published : 11 Nov 2023 06:03 IST

నర్సంపేట, న్యూస్‌టుడే:  నర్సంపేట నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా నర్సంపేట పట్టణానికి చెందిన కంభంపాటి పుల్లారావు అలియాస్‌ ప్రతాప్‌ ఖరారయ్యారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర కమిటీ నాయకులు పుల్లారావుకు సంబంధించి పార్టీ బీ-ఫాంను పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్‌, యువమోర్చా నాయకుడు మనీశ్‌కు అందజేశారు. దీంతో రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి పార్టీ అభ్యర్థిగా శుక్రవారం ఉదయం అధికారికంగా నామినేషన్‌ దాఖలు చేశారు.

ప్రస్థానం

పుల్లారావు (ప్రతాప్‌) నర్సంపేటలోని ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 15 ఏళ్లకు పైగా ప్రిన్సిపల్‌గా పని చేశారు. 2003లో సొంతంగా కొత్తగూడ, మహబూబాబాద్‌, ఖానాపురం, ములుగు ప్రాంతాల్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలలను నెలకొల్పి మూడేళ్లు నడిపారు. తర్వాత నర్సంపేటలో వృత్తి విద్యా కళాశాలలను స్థాపించారు. గడిచిన మూడేళ్లుగా గీతాంజలి గ్రూప్‌ పాఠశాలల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాజపాలో చేరి అంచెలంచెలుగా నాయకుడిగా ఎదిగారు.

పార్టీ విజయానికి సైనికుల వలే పని చేయాలి

నర్సంపేట, న్యూస్‌టుడే: క్రమశిక్షణ కలిగిన సైనికుల వలే పనిచేసి  నర్సంపేటలో పార్టీ విజయ కేతనం ఎగుర వేసేలా పాటుపడాలని భాజపా జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భాజపా అభ్యర్థిగా కంభంపాటి పుల్లారావు(ప్రతాప్‌) శుక్రవారం నామినేషన్‌ వేసిన తర్వాత  జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్ఠానం ఆదేశం మేరకు తాను వరంగల్‌ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.  ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి పుల్లారావు, నాయకులు అశోక్‌రెడ్డి, నర్సింహరాములు, శ్రీనివాస్‌, జగన్‌, కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తల్లి ఆశీర్వాదం తీసుకొని

కంభంపాటి పుల్లారావు(ప్రతాప్‌) నామినేషన్‌ వేయడానికి ముందు ఇంట్లో తల్లి హైమావతి ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి స్థానిక శ్రీ శివాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. నామపత్రాలను దేవుడి పాదాల చెంత పెట్టి పూజలు జరిపి వేదపండితుల ఆశీర్వచనం పొందారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి ప్రదర్శనగా ఆర్వో కార్యాలయం వెళ్లి నామ పత్రాలు దాఖలు చేశారు.

బయోడేటా

అభ్యర్థి: కంభంపాటి పుల్లారావు(ప్రతాప్‌)
విద్యార్హతలు: ఎం.కాం, బీఈడీ, పీహెచ్‌డీ,
జనన తేదీ: 19-06-1978, వయస్సు 45 ఏళ్లు
పుట్టిన ప్రదేశం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్దారం గ్రామం. కోన్నేళ్ల కిందట వారి కుటుంబం నర్సంపేటకు వచ్చి స్థిర పడింది.
తల్లి: హైమావతి, తండ్రి: కీ.శే.బసవయ్య, భార్య: కంభంపాటి జ్యోతి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు),
పిల్లలు: తేజస్వి (బీటెక్‌ మొదటి సంవత్సరం), వర్షిణి (ఇంటర్‌ రెండో సంవత్సరం), సోదరి: వట్టి రమాదేవి ఏంఏ బీఈడీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని