logo

సారు.. ఏ ఊరినీ వదల్లేదు..!

గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు.

Published : 28 Mar 2024 04:07 IST

తప్పుడు నివేదికలిచ్చి అవినీతిపరుల్ని కాపాడిన వైనం
ఈనాడు, వరంగల్‌

  • గతంలో జిల్లాలో పనిచేసిన ఉన్నతాధికారికి గ్రామాల నుంచి భారీగా వసూళ్లు చేసి ముట్టజెప్పి ఈ అధికారి తానూ భారీగా వెనకేసుకున్నట్టు సమాచారం.
  • ఈ అధికారికి విరమణ అనంతరం వచ్చే పింఛను నిలుపుదల చేయాలని గ్రామస్థులు వందకుపైగా వినతి పత్రాలను జిల్లా కలెక్టర్‌కు, ఏజీ, ఆడిట్ కార్యాలయాల్లో సమర్పించారు.

‘హమ్మయ్య ఇక ఉద్యోగ విరమణ చేస్తున్నందున ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని.. తాను తప్పించుకున్నట్టే అని ఆ అధికారి అనుకుంటున్నారు.’
‘ఆయన అవినీతిపై సాక్ష్యాధారాలతో పోరాడుతున్న వారు ప్రభుత్వం ఇకనైనా విచారణ జరిపి విరమణ సమయంలో రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు. వాటిని కప్పిపుచ్చేందుకు రూ.లక్షల్లో లంచాలు తీసుకొన్నారు. ఎవరైనా గ్రామస్థులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే అక్కడ ఎలాంటి గోల్‌మాల్‌ జరగలేదంటూ ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి అక్రమాలకు వత్తాసు పలికారు.  జనగామ జిల్లాలో ఓ అధికారి పనితీరు ఇది..

విదేశాలకు వెళ్లేందుకు రంగం సిద్ధం?

త్వరలో ఉద్యోగ విరమణ చేసి విదేశాలకు వెళ్లేందుకు ఈ అధికారి ప్రయత్నిస్తున్నారు. ఆ లోపే ఆయనపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  
నకిలీ రసీదులపై ఫిర్యాదులొచ్చినా..

  • జిల్లాలో 50కి పైగా గ్రామాల్లో రూ.లక్షల్లో గోల్‌మాల్‌ జరిగినట్టు స్థానికులు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా ఈ అధికారి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
  • జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక మండల కేంద్రంలో మట్టిని అక్రమంగా తవ్వి రూ.కోట్లలో అప్పటి సర్పంచి దందా చేశారు. దీనికి సంబంధించిన నకిలీ రసీదులు ముద్రించి జారీ చేశారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం పక్కదారి పట్టింది. ఈ వ్యవహారంపై సదరు అధికారి విచారణ చేసి నకిలీ రసీదులు స్వాధీనం చేసుకున్నారు. దీని వివరాలు వెల్లడించాలని ఫిర్యాదుదారుడు సహ చట్టం ద్వారా కోరితే పొంతనలేని సమాధానాలు ఇచ్చి సమాచారాన్ని కప్పిపుచ్చారు. ఈ వ్యవహారంలో అప్పటి సర్పంచి వద్ద ఆ అధికారి రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
  • ఇదే పంచాయతీకి సంబంధించి రూ. 1.37 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరగ్గా సదరు అధికారే నివేదిక సమర్పించి, అప్పటి సర్పంచికి రికవరీ నోటీసు ఇచ్చారు. నిధుల్ని మాత్రం రికవరీ చేయలేకపోయారు. దీంతో అధికారి వైఫల్యంపై ఈ నెల 1న ఓ సామాజిక కార్యకర్త ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తూ ఈ అధికారి పాస్‌పోర్టు బ్లాక్‌ చేయాలని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను నిలిపివేసి లోతుగా విచారణ జరపాలని కోరారు.
  • బచ్చన్నపేట మండలంలోని మరో పంచాయతీకి సంబంధించి కూడా నకిలీ రసీదుల కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. 2014 నుంచి 2020 వరకు గ్రామంలోని నల్లా బిల్లులు, ఇంటి పన్నులు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో వసూలు చేశారు. ఈ ఒక్క ఊరులోనే రూ.80 లక్షల వరకు అవినీతి జరిగినట్టు గ్రామస్థులు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై సదరు అధికారి పైపైన విచారణ చేసి న్యాయస్థానానికి సైతం తప్పుడు నివేదిక సమర్పించారు.
  • పాలకుర్తితోపాటు అనేక పంచాయతీల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదులు వెల్లువెత్తగా విచారణ జరిపి ఆయా సర్పంచులు, అవినీతికి పాల్పడిన ఆయా కార్యదర్శుల నుంచి అధికారి భారీ మొత్తంలో పుచ్చుకుని వదిలేసినట్టు విమర్శలు వెల్లువెత్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని