మనకు దక్కిందేమిటి?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా వాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, పీఎం ఆవాస్ యోజన ప్రకటనపై ఇళ్లు నిర్మించుకునేవారు కొంత సంతృప్తికరంగా ఉన్నా..
కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
ఈనాడు డిజిటల్, ఏలూరు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా వాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, పీఎం ఆవాస్ యోజన ప్రకటనపై ఇళ్లు నిర్మించుకునేవారు కొంత సంతృప్తికరంగా ఉన్నా.. భాగస్వామ్య వ్యాపారుల పన్ను పరిమితిని సడలించకపోవడం, వ్యవసాయానికి మరిన్ని నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి గళం వినిపిస్తోంది. పంటలకు మద్దతు ధర, రుణ మాఫీ వంటి ప్రకటనలు చేస్తారని ఆశ పడిన రైతులకు నిరాశే ఎదురైంది. జాతీయ ప్రాజెక్టు పోలవరం గురించి ప్రస్తావనే లేకపోవడం జిల్లా వాసులను నివ్వెరపరిచింది.
రైతులకు వ్యవ‘సాయం’
ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల మంది రైతులున్నారు. ఇందులో నాలుగు లక్షల మంది వరకు కౌలు రైతులు. బడ్జెట్లో ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల రుణాల్లో.. జిల్లా రైతులకు దాదాపు రూ.5 వేల కోట్ల వరకు అందనుంది. ఇది వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఉపయోగపడనుంది. దీన్ని ఇంకా పెంచాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పంటలకు మద్దతు ధర ఊసే లేకపోవడం అన్నదాతలను నిరాశపరిచింది. సాగుకు తోడ్పాటు అందించేందుకు 10 వేల బయో ఇన్‌పుట్ రిసోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో జిల్లాలో 500 వరకు వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఉద్యోగులకు కాస్త ఊరట
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం ద్వారా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట లభించనుంది. జిల్లాలో దాదాపు 2 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. ఫ్యామిలీ పింఛన్‌దారులు గతంలో నెలకు రూ.15 వేల వేతనం దాటితే పన్ను చెల్లించాల్సి ఉండేది. దాన్ని రూ.55 వేలకు పెంచడం ద్వారా జిల్లాలో దాదాపు లక్ష మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది.
గిరిజన విద్యకు తోడ్పాటు
ఏజెన్సీ విద్యా వ్యవస్థ పటిష్ఠానికి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్లో 38,800 మంది ఉపాధ్యాయుల్ని నియమిస్తామని ప్రకటించారు. బుట్టాయగూడెం పరిధిలో మూడేళ్ల నుంచి ఏకలవ్య పాఠశాల నడుస్తోంది. 230 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రిన్సిపల్ మినహా మిగిలిన 10 మంది అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకం జరగనుంది.
సొంతింటికి ప్రోత్సాహం
బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం జిల్లాలో 1.5 లక్షల ఇళ్లు ఈ పథకం ద్వారా నిర్మిస్తున్నారు. తాజా నిర్ణయంతో కొత్తగా 50 వేల ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుంది.
సహకార సంఘాల దస్త్రాల ఆన్‌లైన్‌కు నిధులు
సహకార సంఘాల్లో దస్త్రాల కంప్యూటరీకరణకు నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. దేశంలోని 63 వేల సొసైటీలకు రూ.2,516 కోట్లు కేటాయించారు. కంప్యూటరీకరణ లేక పోవడంతో చాలా సంఘాల్లో రుణాలు పక్కదారి పడుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో జిల్లాలోని 250 వరకు సహకార సంఘాలకు మంచి రోజులు రానున్నాయి.
వ్యాపారులకు భారమే
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుతో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. భాగస్వామ్య వ్యాపారులు ఇప్పటివరకు 30 శాతం వరకు పన్ను చెల్లిస్తున్నారు. బడ్జెట్లో వారికి సడలింపులు ఇవ్వకపోవడం అన్యాయం.
రాజేంద్ర, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు
కొన్ని రంగాలకే లాభం
బడ్జెట్ కొన్ని రంగాలకు లాభదాయకంగా ఉండగా.. కొన్నింటికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఆదాయ పన్ను పరిమితి పెంపుతో ఉద్యోగులకు ఊరట లభించగా.. భాగస్వామ్య వ్యాపారులకు ఆ అవకాశం లేదు. పోలవరానికి నిధుల ఊసే లేదు. రాష్ట్రానికి ప్రత్యేక నిధుల కేటాయింపు లేదు.
చిరంజీవి, ఆర్థిక నిపుణుడు, ఏలూరు
వ్యవసాయ, పౌల్ట్రీ రంగాలకు ఊతం
తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయ, పౌల్ట్రీ, డెయిరీ రంగాలకు రూ.20 లక్షల కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రంగాలపై ఆధారపడిన జిల్లాకు ఇది ఎంతో ఉపయోగకరం. మడ అడవులను పెంచడానికి ప్రత్యేక చొరవ చూపారు. తద్వారా తీర ప్రాంతాలకు భద్రత ఏర్పడే అవకాశం ఉంది. ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చే అప్పులకు రూ.2 లక్షల కోట్ల వరకు హామీ ఇస్తామని ప్రకటించారు. ఆయా సంస్థలు ఎటువంటి ఆస్తులను హామీగా బ్యాంకులకు ఇవ్వనవసరం లేదు. ఆదాయ పన్ను రూ.7 లక్షల వరకు మినహాయింపు ఇస్తామని ప్రకటించినా.. ఈ పరిధిలోకి రావాలంటే ఎటువంటి పొదుపు మొత్తాలను పరిగణనలోకి తీసుకోమని తెలిపారు. రూ.7 లక్షల ఒక్క రూపాయి ఆదాయం వచ్చిన వ్యక్తి విధిగా రూ.25,000 పన్ను చెల్లించాల్సిందే. దీనిని పరిగణనలోకి తీసుకుని మార్జినల్ రిలీఫ్‌ను వర్తింపజేసి ఉంటే బాగుండేది.
చెరుకూరి శ్రీనివాసరావు, సీఏ, తణుకు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
BJP: అమెరికన్ల దృష్టిలో ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పార్టీ భాజపా: వాల్‌స్ట్రీట్ కథనం
-
Sports News
Virat Kohli: అనుష్కను చూసి వణికిపోయా: విరాట్ కోహ్లీ
-
General News
Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ
-
India News
₹10 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రికి బెదిరింపులు.. గడ్కరీ ఇంటి వద్ద భద్రత పెంపు!
-
Movies News
Payal Rajput: పాయల్ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్లో పాల్గొని!
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?