logo

గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయ భూముల దస్త్రాల దహనం

నూజివీడు మండలం గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో విలువైన భూముల దస్త్రాలను బుధవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు.  

Updated : 24 Mar 2023 05:54 IST

గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసిన దస్త్రాలు

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: నూజివీడు మండలం గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో విలువైన భూముల దస్త్రాలను బుధవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు.  గురువారం ఉదయం గుర్తించిన  సిబ్బంది ఈవో విశ్వేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన నూజివీడు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై టి.రామకృష్ణ  కాలిపోయిన దస్త్రాలను పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. నిందితులు కార్యాలయంలో టేబుల్‌పై ఉన్న కంప్యూటర్‌ తదితరాలను కూడా కిందపడేసేందుకు యత్నించగా.. అవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బీరువాల తాళాలను సైతం పగులగొట్టేందుకు ప్రయత్నించి రాకపోవడంతో వదిలేశారు. సీసీ టీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు అనుమానితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విలువైన దస్త్రాలు ధ్వంసం చేయాలన్న ఆలోచన వెనుక ఎవరెవరున్నారు అనే విషయాలు పోలీసుల విచారణలో వెలుగులోకి రానున్నాయి. 

బడాబాబుల పేరు చెప్పి నానా ఇబ్బందులు  

రఘునాథస్వామి ఆలయ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం వక్ర భాష్యాలు చెబుతూ కొన్నాళ్లుగా కొందరు రైతులు కౌలు చెల్లించకుండా దేవాదాయ శాఖ అధికారులను  ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆలయానికి 3,356 ఎకరాల వ్యవసాయ, అన్నే రామకృష్ణయ్య ట్రస్టుకు చెందిన 48 ఎకరాలున్నాయి. వీటికి సంబంధించి రూ.కోట్లలో బకాయిలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు రైతులకు నోటీసులు ఇవ్వడం, వారు చెల్లింపుల దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక మెలిక పెట్టి నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఉన్నతాధికారులు ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చిన వ్యవహారంగా భావించి దూరంగా ఉంటున్నారు. ఇటీవల కొందరు గ్రామస్థులు వేంపాడు భూముల విషయంలో రాద్దాంతం చేస్తున్నారు. బడాబాబుల పేరు చెప్పి బెదిరిస్తున్నారు. కాలిపోయిన దస్త్రాలు కొన్ని రామకృష్ణ ట్రస్టుకు సంబంధించినవిగా ప్రాథమిక సమాచారం. బీరువాలో ఉన్న మరికొన్నింటిని, హార్డు డిస్కును దహనం చేశారు. వీటన్నింటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.

సమాచారం భద్రంగా ఉంది

రఘునాథస్వామి, దిగవల్లి తదితర ఆలయాల భూములకు సంబంధించిన దస్త్రాలు తదితరాల సమాచారం మరో కంప్యూటర్‌లో భద్రంగానే ఉందని ఈవో విశ్వేశ్వరరావు తెలిపారు. పలు కార్యాలయాల్లో ఈ భూములకు సంబంధించిన దస్త్రాలు ఉన్నాయని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు రామకృష్ణ పబ్లిక్‌ ట్రస్టుకు సంబంధించినవి, వేంపాడు భూముల ఎంజాయ్‌మెంట్ రిజిస్టర్‌ కాలిపోయినట్లు గుర్తించామన్నారు. సమాచారం ఉదయం 9.30కు తెలిసిందని వెంటనే రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

విచారణ ప్రారంభించాం

దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఇచ్చిన సమాచారం మేరకు విచారణ ప్రారంభించాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. వీరి వెనుక ఎవరు ఉన్నారన్నది విచారణలో తేలుతుంది అని నూజివీడు రూరల్‌ సీఐ ఆర్‌.అంకబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని