logo

శిబిరాలే.. చికిత్సల్లేవ్‌

తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి.

Updated : 18 Apr 2024 06:07 IST

ప్రచార ఆర్భాటంగా జగనన్న సురక్ష

తణుకులో నిర్వహించిన శిబిరం (పాతచిత్రం)

 తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. ఆరోగ్యశ్రీ సేవలున్న ఆసుపత్రులకు వెళుతున్నా స్లాట్‌ పనిచేయడం లేదని సమాధానమిస్తున్నారని రోగుల సహాయకులు వాపోతున్నారు.

తాడేపల్లిగూడెంలో మొదటివిడత ఆరోగ్యసురక్ష శిబిరాల్లో సుమారు 120 మందిని గుర్తించగా 30 మందికి మాత్రమే శస్త్రచికిత్సలు చేశారు. ఇక తప్పక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు కొంతమంది వాపోయారు.

 ఈనాడు డిజిటల్‌, భీమవరం, తణుకు గ్రామీణం, తాడేపల్లిగూడెం అర్బన్‌: ‘జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలి. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వ్యక్తి ఎవరూ ఉండకూడదు. వైద్యశిబిరాలు నిర్వహించడమే కాదు.. రోగుల ఆరోగ్యం బాగయ్యేంత వరకు ఎవరికి ఏ అవసరం ఉన్నా చేయూతనివ్వాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠనే కాకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ప్రతిష్ఠనూ పెంచుతోంది’ అధికారుల సమీక్షా సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి. అయితే వారి మాటలకు క్షేత్రస్థాయిలో చేతలకు పొంతన కుదరడం లేదు.

 కిట్లు ఇచ్చారు.. సేవలేవీ..

ప్రచారమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఈ శిబిరాల నిర్వహణకు ఒక్కోదానికి సుమారు రూ.25వేల వరకు కేటాయించారు. వీటి నిర్వహణకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చయింది. ఇవి ఆయా గ్రామ/ వార్డు సచివాలయాలకు తడిసి మోపయ్యాయి. వైద్యం నిమిత్తం వచ్చిన రోగికి, వారి సహాయకులకు సైతం అవసరం ఉన్నా లేకపోయినా జగన్‌ ఫొటోతో ఉన్న ఆరోగ్యసురక్ష కిట్‌ ఉన్న సంచిని అందజేశారు. దాని విలువ కనీసం రూ.20 చొప్పున చూసినా సుమారు రూ.60 లక్షలు దాటింది. ప్రచారం కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం రోగులకు శస్త్రచికిత్సలను ఆలస్యం చేయడం వారి ఆరోగ్యంతో ఆడుకోవడమేనని, ఒక్కోసారి ప్రాణాల మీదకు వేస్తే ఏం చేస్తారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ వాస్తవం..

జిల్లాలో ఆరోగ్య సురక్ష మొదటివిడతలో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ 30 నుంచి 45 రోజుల పాటు 447 వైద్య శిబిరాలు నిర్వహించారు. 3.46 లక్షల మందికి వైద్యసేవలందించి, 1,678 మందిని వై.ఎస్‌.ఆర్‌.ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్సలకు సిఫార్సు చేశారు. రెండోవిడత ఆరోగ్య సురక్ష శిబిరాలు మొదలైనా తొలివిడతలో సగం మందికి కూడా శస్త్రచికిత్సలు కాలేదు. 451 మందికి మాత్రమే జరిగాయి. ఒకపక్క 14 రకాల వైద్యపరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచామని, 264 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు, 132 మంది మెడికల్‌ అధికారులు, ఇతర ఆరోగ్య సిబ్బంది.. మరోపక్క ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు అని ఊదరగొడుతున్నారు గానీ క్షేత్రస్థాయిలో మాత్రం రోగులకు చుక్కలు చూపుతున్నారు.

ఉన్నవారితో సర్దుబాటు..

జిల్లాలో ఒక జిల్లా ఆరోగ్య కేంద్రం, మూడు సీహెచ్‌సీలు, నాలుగు ఏరియా ఆసుపత్రులు, 34 పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా వాటిలో మెరుగైన వైద్యసేవలందించాల్సింది పోయి ప్రచారమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పాటు చేశారనే విమర్శలున్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలోనైనా, జగనన్న ఆరోగ్య సురక్షలో వైద్యసేవలందించినా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే అదే వైద్యులే అందించారు. ప్రత్యేకంగా వైద్యుల నియామకం గాని.. సిబ్బందిని గాని భర్తీచేసిన దాఖలాలు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని