logo

అయిదేళ్లుగా ఏటా నష్టమే!

  2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

Updated : 23 Apr 2024 06:48 IST

వైకాపా ప్రభుత్వంలో డ్రెయిన్లు నిర్వీర్యం

 భీమవరం వద్ద గుర్రపుడెక్కతో యనమదుర్రు డ్రెయిన్‌

పాలకొల్లు, పెనుమంట్ర, న్యూస్‌టుడే:

  • 2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.6,200 చొప్పున ప్రభుత్వం రూ.21 కోట్ల వరకు పంటనష్టం ప్రకటించింది. కాని అందులో 10 శాతం నిధులు కేటాయించి డ్రెయిన్ల ఆధునికీకరణ, అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లను గడిచిన అయిదేళ్లలో బాగు చేయించలేకపోయింది.
  • పోడూరు మండలంలో 2022లో వచ్చిన వరదకు 104 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. దీని విలువ రూ. కోటికి పైబడి ఉన్నా ప్రభుత్వం తీరిగ్గా రూ. 15.61లక్షలు పంటనష్టం మంజూరు చేసి చేతులు దులుపుకొందేగాని డ్రెయిన్లు బాగుచేసి నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో చేతులెత్తేసింది.

వైకాపా ప్రభుత్వం వచ్చాక డ్రెయిన్ల వ్యవస్థను పూర్తిగా నీరుగార్చేసింది. ప్రగతి పనులకు పైసా వెచ్చించింది లేదు. అధి వర్షాలకు, వరదల సమయంలోనూ నీటమునిగిన వరిచేలలోని నీరు బయటకు లాగకపోగా గోదావరి వరదనీరును నిలువరించడంలో అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు విఫలమవుతున్నాయి. ఈ కారణంగా ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 50వేల ఎకరాల్లో అన్నదాతలు ఏటా పంట నష్టపోతున్నారు. ఉండి, పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో ఈ నష్టం అధికంగా ఉంటుంది.

  • స్లూయిజ్‌, లాకులకు కనీస మరమ్మతులు చేసి పదేళ్లు దాటింది. యలమంచిలి-నరసాపురం మండలాల సరిహద్దులో కాజడ్రెయిన్‌పై ఉన్న స్లూయిజ్‌ తలుపులూ సరిగా పనిచేయక యలమంచిలి, నరసాపురం మండలాల్లోని వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. ఇదే మండలం లక్ష్మీపాలెంలో లాకుల మరమ్మతులకు నిధులు అవసరమని గత నాలుగేళ్లుగా ఏటా ప్రతిపాదనలు చేస్తున్నారు. మంజూరు కావడంలేదు.

మరమ్మతులే లేవు

యలమంచిలి మండలం వడ్డిలంకలో నక్కలడ్రెయిన్‌పై ఉన్న అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ కింది తలుపులు పాడైపోయాయని రూ.15లక్షలతో వాటిని మరమ్మతుల నిమిత్తం ప్రతిపాదనలు చేయగా నాలుగేళ్లుగా మంజూరు లేదు. కింది తలుపులతో పాటు పై తలుపులు కూడా ప్రస్తుతం పాడవడంతో మొత్తం రూ.48లక్షలతో ప్రతిపాదనలు చేశారు. దీనికి కూడా గుత్తేదారులు ముందుకురాక పనులు చేయలేదు.

గోస్తనీదీ ఇదే గతి

  • ఒకప్పడు మోక్షప్రదాయినే కాని నేడు దు:ఖదాయినిగా మారిన ఈ గోస్తనీ పేరు వింటేనే అంతా వణుకుతున్నారు. వర్షాలు కురిసిన సందర్భంలో ఒక్క పెనుమంట్ర మండలంలో 8 గ్రామాల పరిధిలోని 5 వేల ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయి.
  • ప్రతిసీజన్‌లో వర్షాలకు గోస్తనీ డ్రెయిన్‌ ప్రభావంతో సుమారు 15 నుంచి 20 వేల ఎకరాల్లో పంట పాడవుతోంది. ఈనష్టం విలువ సరాసరిన రూ.2కోట్ల పైనే ఉంటుందని అంచనా. డ్రెయిన్‌ పొంగడంతో చేతికొచ్చిన పంట సైతం ముంపు బారిన పడి కుళ్లిపోయిన పరిస్థితులు గతంలో ఎన్నో సార్లు ఉన్నాయి. మూడేళ్ల నాడు ఈ డ్రెయిన్‌ ఆధునికీకరణ చేసినా తదుపరి నిర్వహణ లేక ఎక్కడికక్కడే కిక్కిస పెరిగి నీటి పారుదల సక్రమంగా సాగడం లేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని