logo

జగన్‌ జమానాలో నిధులు దోచేసి... అభివృద్ధి ఆపేసి!

దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్‌ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది.

Updated : 06 May 2024 06:44 IST

పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం
ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపు
ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు
న్యూస్‌టుడే- పెనుమంట్ర, తణుకు గ్రామీణం, పెనుగొండ

దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్‌ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. కనీసం పాలకవర్గాలకూ తెలియకుండా నిధులు దోచేస్తూ... సర్పంచులను ఉత్సవవిగ్రహాల్లా మార్చేసింది. గతంలో పల్లెల్లో  సదుపాయాల కల్పనకు వినియోగించిన ఉపాధి హామీ పథకం సామగ్రి వ్యయం(మెటీరియల్‌ కాంపొనెంట్‌) నిధులను సైతం గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు వెచ్చించింది. ప్రభుత్వ పరంగా పంచాయతీలకు రావాల్సిన స్టాంప్‌ డ్యూటీ సొమ్మునూ జమ చేయడం లేదు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది.

ఆదాయం అంతంతమాత్రమే...

జిల్లాలో 409 పంచాయతీలున్నాయి. వీటిలో 70 శాతం చిన్న పంచాయతీలే. పన్నుల ద్వారా వీటికొచ్చే ఆదాయం అంతంతమాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అందజేయాల్సిన నిధులను జమ చేయకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయింది. గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. తాగునీటి మోటార్లు మరమ్మతుకు గురైతే బాగు చేయించేందుకు సైతం సర్పంచులు అప్పులు చేయాల్సిన దుస్థితి. కొన్ని పంచాయతీల్లో ఉద్యోగులు రూ.లక్షల్లో అవినీతికి పాల్పడ్డగా... బాధ్యుల నుంచి రికవరీ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అక్కడ వైకాపా నేతలే సర్పంచులుగా ఉండటంతో... ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

విద్యుత్తు బకాయిలకు చెల్లించాలంటూ....

జిల్లాకు రూ.23.78 కోట్లు టైడ్‌, ఆన్‌టైడ్‌ నిధులు విడుదలయ్యాయి. ఆన్‌టైడ్‌ కింద వచ్చిన సొమ్ములో 40 శాతం విద్యుత్తు బాకాయిలకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ నిధులు చెల్లించని పంచాయతీలకు నోటీసులివ్వడంతోపాటు విద్యుత్తు సరఫరా నిలిపివేసింది. ఆన్‌టైడ్‌ నిధుల్లో కొంత విద్యుత్తు బకాయిలకు పోగా... మిగతా నిధులతో ఏమి చేయగలమని పలువురు సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఈ నిధులతో పారిశుద్ధ్య పనులు, దాని నిర్వహణ సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో నిధుల్లేక పారిశుద్ధ్య నిర్వహణ మొక్కుబడిగా మారింది.


అయిదేళ్లలో భ్రష్టు పట్టించారు

సర్పంచిగా గెలిచానన్న మాటే గాని పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా వైకాపా నాయకులు అడుగడుగునా అడ్డుపడ్డారు. వారిని ఎదురించి ఏవైనా పనులు చేస్తే... బిల్లులు ఎలా చేసుకుంటావో చూస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. దేశంలోనే ఘన చరిత్ర కలిగిన వేల్పూరు పంచాయతీని అయిదేళ్ల వైకాపా పాలనలో భ్రష్టు పట్టించారు.

కృష్ణవేణి, సర్పంచి, వేల్పూరు


గుర్తింపు  పొందలేకపోతున్నాం

మా పంచాయతీకి మంజూరైన పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులను వైకాపా ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది. దీంతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయా. కొన్ని పనులకు సొంత నిధులు వెచ్చించా. పంచాయతీలో నిధుల్లేకపోవడంతో ప్రజలకు న్యాయం చేయలేకపోయా.

నక్కా శ్యామలాసోని, సర్పంచి, పెనుగొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని