logo

ఇక వడ్డింపు వంతు

ఆస్తి, మూలధనం విలువ ఆధారిత పన్ను వసూళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి పలికారు. కరోనా విజృంభణతో గత రెండేళ్లుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్య

Published : 21 Jan 2022 05:20 IST

పట్టణాల్లో పెరగనున్న ఆస్తి పన్ను

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆస్తి, మూలధనం విలువ ఆధారిత పన్ను వసూళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి పలికారు. కరోనా విజృంభణతో గత రెండేళ్లుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఇది అదనపు భారం కానుంది. గరిష్ఠంగా 15 శాతం మాత్రమే పెంపు అని ప్రభుత్వం చెబుతున్నా స్థలం విలువ పెరిగినప్పుడల్లా పన్నుభారం పెరుగుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

మదింపు ప్రక్రియలు.. పన్ను పెంపు విషయమై జిల్లాలోని పట్టణాలు ముసాయిదాలను ఇప్పటికే విడుదల చేశాయి. కొన్నిచోట్ల అభ్యంతరాలను అధికారుల దృష్టికి రాజకీయ నాయకులు, వామపక్షాలు తీసుకెళ్లాయి. పన్ను పెంచడంతో అద్దెలు కూడా పెరిగే అవకాశం ఉందని, ఆర్థిక ఇబ్బందులు తప్పవని విన్నవించాయి. మరోవైపు పట్టణాల్లో పాత పన్నుస్థానే కొత్త పన్ను మదింపు ప్రక్రియలను వేగవంతం చేశారు. అన్నిచోట్ల ఒకేసారి చేపడితే సర్వరు సహకరించకపోవడంతో అంచెలంచెలుగా కొనసాగిస్తున్నారు.

ఎన్నికలుంటాయనుకుని..

పట్టణాల్లో విలీనమైన గ్రామా ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత పన్ను చెల్లిస్తున్నారో, అక్కడి స్థల విలువను నమోదు చేసేపనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికలు జరగనిచోట గతేడాది ఎన్నికలు ఉంటాయనే యోచనలో పన్ను పెంపుపై ఆలోచిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ ఊసే లేకపోవడంతో పన్ను పెంపు చర్యలను వేగవంతం చేశారు. పన్ను పెంపు విషయంలో ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారని భీమవరానికి చెందిన జేఎన్‌వీ గోపాలన్‌ అన్నారు. రిజిస్ట్రేషన్‌ విలువ పెరిగిప్పుడల్లా అదనపు భారమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. అద్దెలు కూడా మరింత పెరుగుతాయన్నారు.

రిజిస్ట్రేషన్‌ విలువలో నివాస భవనాలకు 0.10 శాతం నుంచి 0.50 శాతం వరకు, వాణిజ్య నిర్మాణాలకు 0.20 నుంచి 2శాతం వరకు పన్ను విధించవచ్చని జీవో 198లో పేర్కొంది. నిర్మాణానికి చదరపు అడుగుల్లోనూ, స్థలానికి చదరపు గజాల్లోనూ రెండింటి రిజిస్ట్రేషన్‌ విలువను పరిగణనలోకి తీసుకుని పన్ను ఖరారు చేస్తారు. పన్ను భారం ఒకేసారి చూపకుండా దఫదఫాలుగా పెంచే యోచనలో నివాసానికి మొదటి ఏడాదిలో కనిష్ఠంగా 10శాతం, గరిష్ఠంగా 15శాతం పెంపుఉంటుంది. 375 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లకు ఏడాదికి రూ.100మాత్రమే చెల్లించుకునేలా నిరుపేదలకు అవకాశం కల్పించినట్టుగా ఆయా పట్టణాల్లోని అధికారులు చెబుతున్నారు. పెంచిన పన్నును గతేడాది ఏప్రిల్‌ 1నుంచి అమలుచేస్తారు. గత అర్ధసంవత్సరంలో తాడేపల్లిగూడేనికి చెందిన ఓ యజమాని రూ.2వేలు చెల్లించారు. కొత్త పన్ను విధానంలో రూ.2400 చెల్లించాల్సి ఉండటంతో మిగిలిన రూ.400ను అతని నుంచి ఇప్పుడు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కొత్తగా నిర్మిత భవనాలకు పాత, కొత్త పన్నులను కలిపి ఇప్పుడు వసూలు చేస్తారు. ●

భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంతంలో 1100 చ.అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆర్‌సీసీ ఇంటికి అర్ధ సంవత్సర పన్నుగా రూ.1700 చెల్లిస్తున్నారు. అక్కడ చదరపు గజం స్థలం విలువ రూ.16వేలు. ప్రస్తుతం 15శాతం పన్ను పెంచితే అదనంగా రూ.250 పెరగనుంది. అంటే ఏడాదికి అదనపు భారం రూ.500 పడనుంది.

తాడేపల్లిగూడెం మెయిన్‌రోడ్డులో గజం స్థలం విలువ రిజిస్టరు ప్రకారం రూ.50వేలు ఉంది. ఇప్పటివరకు రూ. 8వేలు చెల్లిస్తుండగా ఇకపై ఏడాదికి అదనంగా రూ.3వేలు భారం పడనుందని ఈ ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు ఆవేదన చెందారు.

జిల్లాలో నిర్మాణాలు 1,75,026

ప్రస్తుతం ఇంటిపన్ను రూ.89.40 కోట్లు

అదనపు భారం రూ.12.6 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని