logo

కువైట్‌లో గృహిణి కన్నీటి వేదన

కరవు సీమలో బడుగుల ఉపాధి వెతలు అన్నీఇన్నీ కావు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని దేశం కాని దేశానికి వెళ్లిన ఓ గృహిణికి అడుగడుగునా కష్టాలే. అక్కడి యజమాని కనీసం ఒక పూట తిండి కూడా పెట్టకుండా చిత్రవధకు గురి చేస్తున్నాడు. భర్త, కన్నబిడ్డల కోసం

Published : 28 Jun 2022 06:04 IST

విలపిస్తున్న పూజిత

సంబేపల్లె, న్యూస్‌టుడే : కరవు సీమలో బడుగుల ఉపాధి వెతలు అన్నీఇన్నీ కావు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని దేశం కాని దేశానికి వెళ్లిన ఓ గృహిణికి అడుగడుగునా కష్టాలే. అక్కడి యజమాని కనీసం ఒక పూట తిండి కూడా పెట్టకుండా చిత్రవధకు గురి చేస్తున్నాడు. భర్త, కన్నబిడ్డల కోసం తన కష్టాన్ని పంటిబిగువున దాచుకొని బతుకీడుస్తున్నారు ఆ మహిళ. చివరకు ఆరోగ్యం సహకరించకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. దీనికి తోడు స్వగ్రామంలో ఆమె తల్లి మంచానపడ్డారు. బతికుంటే కుటుంబసభ్యులను, పిల్లల్ని చూసుకోవచ్చు. ఇక్కడుంటే బతకడం కష్టమని భావించింది. రోజూ నిత్య నరకం అనుభవిస్తున్నారు. స్వదేశానికి పంపాలని వేడుకుంటున్నా అక్కడి యజమానులు కనికరం చూపడం లేదు. ఆమె బాధను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. తన వేదనను వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు ఆ మాతృమూర్తి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గున్నికుంట్ల గ్రామం కత్తివాండ్లపల్లెకు చెందిన వంగిమళ్ల పూజిత 2022 జనవరిలో బతుకు దెరువు కోసం భర్త, పిల్లలను వదిలి రూ.లక్ష ఖర్చు చేసి కువైట్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల పైభాగం నుంచి పాదల వరకు విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. దీనికి తోడు అక్కడి వారి వేధింపులతో చిత్రవధకు గురవుతున్నారు. తిండి కూడా సరిగా పెట్టడం లేదని, స్వదేశానికి పంపాలని వేడుకుంటున్నా పట్టించుకొనేవారు లేరని సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో వైరల్‌ అయింది. ఈవిషయం తెలుసుకున్న భర్త మునిరాజారెడ్డి, పిల్లలు, కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. తన భార్యను ఎలాగైనా స్వగ్రామానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం పూజిత కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసీని ఆశ్రయించారని చెబుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని