logo

ఇక లారీలు నడపలేం!

‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భారీ వాహనాలకు పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 10న త్రైమాసిక పన్ను పెంచింది.

Published : 31 Jan 2023 02:43 IST

త్రైమాసిక పన్ను పెంచుతూ జీవో విడుదలపై యజమానుల ఆందోళన
న్యూస్‌టుడే, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు

‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భారీ వాహనాలకు పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 10న త్రైమాసిక పన్ను పెంచింది. డీజిల్‌ ధరలు పెరిగిపోవడంతోపాటు రహదారులు సరిగా లేవు. వాటి గురించి ఆలోచించకుండా పన్నులెలా పెంచుతారు’ అని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు లోడింగ్‌కు నిలిచిన లారీలు

వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో లారీల సంఖ్య ఎక్కువ. సిమెంటు కర్మాగారాలున్నందున ఎర్రగుంట్ల ప్రాంతంలో సుమారు 1,200 వరకు లారీలున్నట్లు అంచనా. ప్రొద్దుటూరులో 800, ముద్దనూరులో 220, రాయచోటి 1,000, కడపలో 600, మైదుకూరులో 80, పోరుమామిళ్లలో 50 వరకు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ నుంచి లారీల్లో ఎక్కువగా సిమెంటు, టమోట, తదితర కూరగాయలను కర్ణాటక రాష్ట్రానికి రవాణా చేస్తుంటారు.  బెంగళూరు, బళ్లారి, హోస్పెట్‌, బెల్గాం, మంగళూరు, తుముకూరుతోపాటు చెన్నైకి లారీలు వెళ్తుంటాయి. సిమెంటు తర్వాత బూడిదను తీసుకెళ్లే వాహనాలు సైతం ఎక్కువ.

ఒక్కో లారీ ద్వారా ప్రత్యక్షంగా యజమాని, ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్లతో కలిపి అయిదు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. పరోక్షంగా హమాలీలు, రహదారి పక్కన డాబాలు, హోటళ్లు ఇలా వివిధ వర్గాల వారికి ఉపాధి లభిస్తోంది. 16 టైర్ల లారీలు రూ.45 లక్షల నుంచి రూ.53 లక్షల వరకు, 14 టైర్ల లారీ అయితే రూ.38 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతోంది. సిమెంటు, బూడిదతోపాటు పచ్చి సరకులను కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలకు తరలిస్తుంటారు. ఇలా పన్నులు పెంచుకుంటూ పోతే లారీలను నడపలేమని యజమానులు వాపోతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు లారీ యజమానులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఇప్పుడు కొత్త జీవో తెచ్చి 30 శాతం త్రైమాసిక పన్ను పెంచుతామనడం దారుణమని బాధిత యజమానులు వాపోతున్నారు. త్రైమాసిక పన్ను ప్రస్తుతం రూ.8,600 కడుతున్నానని, అదనంగా పెంచితే మూడు నెలలకొకసారి రూ.11 వేలకు పైగా కట్టాల్సివస్తుందని ముద్దనూరుకు చెందిన ఓ లారీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.


జీవో విడుదల చేయడం దారుణం

బాలవెంకటరెడ్డి, లారీ యజమాని, చిలంకూరు, ఎర్రగుంట్ల మండలం

రాష్ట్ర ప్రభుత్వం త్రైమాసిక పన్ను పెంచుతున్నట్లు జీవో విడుదల చేయడం దారుణం. ఇప్పటికే జీఎస్టీతోపాటు అనేక రకాల పన్నులు కడుతున్నాం. వచ్చే ఆదాయం పన్నులకే సరిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పన్నులపై కాకుండా రహదారులను బాగుచేసి, డీజిల్‌ ధరలను తగ్గిస్తే బాగుంటుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని