logo

Kuppam: నిద్ర పట్టలేదని షికారుకెళ్లి ముగ్గురి దుర్మరణం.. అంతా క్షణాల్లోనే..

స్నేహితుడి జన్మదిన వేడుకలను సరదాగా నిర్వహించుకున్న అనంతరం అర్ధరాత్రి వేళ నిద్ర పట్టలేదని.. అలా షి‘కారు’కు వెళ్లొద్దామని బయల్దేరిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదం బారిన పడి శాశ్వత నిద్రలోకి జారుకున్న విషాద ఘటన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని చిన్నశెట్టిపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Updated : 27 Feb 2023 09:24 IST

అతి వేగం తెచ్చిన అనర్థం  
కుటుంబాల్లో తీరని శోకం
న్యూస్‌టుడే, కుప్పం,  రాజంపేట గ్రామీణం, రైల్వేకోడూరు

నుజ్జయిన కారు

స్నేహితుడి జన్మదిన వేడుకలను సరదాగా నిర్వహించుకున్న అనంతరం అర్ధరాత్రి వేళ నిద్ర పట్టలేదని.. అలా షి‘కారు’కు వెళ్లొద్దామని బయల్దేరిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదం బారిన పడి శాశ్వత నిద్రలోకి జారుకున్న విషాద ఘటన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని చిన్నశెట్టిపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుప్పం పీఈఎస్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్న ఓ విద్యార్థి పుట్టినరోజు వేడుకలకు అతని పెద్దమ్మ కుమారుడు.. మదనపల్లె మిట్స్‌ కళాశాల విద్యార్థి వెంకటసాయి కల్యాణ్‌తోపాటు పీఈఎస్‌లో ఎంబీబీఎస్‌ ఆఖరి ఏడాది విద్యార్థి శ్రీవికాస్‌రెడ్డి, తృతీయ ఏడాది విద్యార్థి తలారి ప్రవీణ్‌, పలువురు స్నేహితులు, విద్యార్థులు హాజరయ్యారు. పీఈఎస్‌ ఎదురుగా ప్రవీణ్‌ ఉంటున్న అద్దె గదిని వేడుకలకు వేదికగా మలుచుకుని శుక్ర, శనివారాల్లో సంబరాలు చేసుకున్నారు.

కుప్పం ప్రభుత్వాసుపత్రి వద్ద రోదిస్తున్న వెంకటసాయి కల్యాణ్‌ తల్లి, బంధువులు

అంతా క్షణాల్లోనే...

శనివారం అర్ధరాత్రి వరకు సంబరాలు చేసుకున్న విద్యార్థుల్లో కొందరు అద్దె గదిలో నిద్రపోయారు. శ్రీవికాస్‌రెడ్డికి కారు నడపడం సరదా కావడం.. ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో అలా తిరిగొద్దామని తలారి ప్రవీణ్‌తోపాటు వెంకటసాయి కల్యాణ్‌ను వెంటబెట్టుకొని కుప్పంకు చెందిన మరో విద్యార్థి కారులో ఆదివారం తెల్లవారుజామున బయల్దేరారు. పయనమైన నిమిషాల వ్యవధిలోనే మూడున్నర గంటల సమయంలో రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. ఈ దుర్ఘటనకు అతివేగం, అజాగ్రత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ప్రవీణ్‌ను కడసారి చూసేందుకు  వచ్చిన కుటుంబసభ్యులు

కన్నవారికి కన్నీరు మిగిల్చి...

రాజంపేటకు చెందిన వెంకటసాయి కల్యాణ్‌ మృతిని తల్లిదండ్రులు సుశీలమ్మ, రమణయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలన్న ఆశ.. అడియాసగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు గ్రామీణ పరిధి పెనుబర్తికి చెందిన శ్రీవికాస్‌రెడ్డి వైద్య చదువులు పూర్తి చేసి కుటుంబానికి ఆదరువుగా ఉంటాడని ఆశపడిన తల్లిదండ్రులు మాధవి, సచ్ఛేంద్రరెడ్డికి కుమారుడి మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది. రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన తలారి ప్రవీణ్‌ శాశ్వతంగా దూరం కావడాన్ని అతని తల్లిదండ్రులు గంగులమ్మ, సుబ్బరాయుడు తట్టుకోలేకపోతున్నారు. ప్రవీణ్‌కు ఇద్దరు అక్కలు. ఒకరు ఎంబీబీఎస్‌ పూర్తి చేయగా మరో సోదరి బ్యాంకులో ఉద్యోగం సాధించారు. వారి స్ఫూర్తితో వైద్య చదువును ఎంచుకున్న అతను లక్ష్యాన్ని చేరుకోకుండానే ఇలా మృత్యు కౌగిలిలోకి చేరుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని