logo

నేర వార్తలు

కడప రెండో పట్టణ ఠాణా పరిధిలో తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సీకేదిన్నె మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు.

Published : 28 Mar 2023 03:14 IST

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప రెండో పట్టణ ఠాణా పరిధిలో తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సీకేదిన్నె మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు. సోమవారం భర్త బేల్దారి పనికి వెళ్లారు. వివాహిత తన సోదరుడికి ఫోన్‌ చేసి అమ్మ వద్దకు వెళ్లాలి, తనను, పిల్లలను మోచంపేటలో దించాలని చెప్పడంతో సోదరుడు వారిని తీసుకెళ్లి అక్కడ దించారు. కానీ వారు ఇంటికి వెళ్లలేదు. ఎంతసేపటికీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన వివాహిత తల్లి చుట్టు పక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో రెండో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.


వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

రేణిగుంట, న్యూస్‌టుడే: రేణిగుంట-కడప మార్గంలోని కుక్కలదొడ్డి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టణ పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం మదురైకు చెందిన మహ్మద్‌ ముసాఫిర్‌(30) వస్త్ర వ్యాపారం చేస్తూ చాలా కాలం కిందట కడప జిల్లా రైల్వేకోడూరులో స్థిరపడ్డారు. వ్యాపారంలో భాగంగా ద్విచక్రవాహనంపై షేక్‌ ఇబ్రహీం(21)తో కలిసి శనివారం చెన్నై వెళ్లారు. ఆదివారం చెన్నై నుంచి రైల్వేకోడూరుకు తిరుగు పయనమయ్యారు. అర్ధరాత్రి రేణిగుంట మండలం మామండూరు-కుక్కలదొడ్డి మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీమ్‌ తల మొండెం నుంచి వేరు పడింది. ఎదురుగా వాహనం అతి వేగంగా ఢీ కొనడంతో ద్విచక్ర వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం కోసం సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రేణిగుంట పట్టణ సీఐ వెంకటసుబ్బారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

చిన్నమండెం : కడప-బెంగళూరు ప్రధాన రహదారిలోని కేశాపురం గుట్టుమోటు సమీపంలో నీలగిరి చెట్ల దగ్గర సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్టీ కాలనీకి చెందిన నచ్చుకూరి నరసింహులు (28) మృతి చెందినట్లు ఎస్‌.ఐ. రమేష్‌బాబు పేర్కొన్నారు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లె గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన నరసింహులు సొంత పని మీద ద్విచక్రవాహనంపై చిన్నమండెం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రాత్రి 9 గంటల ప్రాంతంలో రాయచోటి వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నరసింహులుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని