logo

దాహమో.... రఘురామ!

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్‌ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి

Updated : 29 Mar 2024 06:12 IST

 తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపని ఎమ్మెల్యే

 గొంతు తడుపుకొనేందుకు మైదుకూరు పట్టణవాసుల పాట్లు

సర్వాయపల్లెరోడ్డులో ట్యాంకరు వద్ద నీటిని పట్టుకుంటున్న ప్రజలు

 అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్‌ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి. పట్టణానికి నలువైపులా నదులున్నా శాశ్వత చర్యలు చేపట్టలేని దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం...అధికారుల ఉదాసీనత వైఖరితో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముందుచూపు లేకపోవడం.. తాత్కాలిక చర్యలతో ఉపశమన చర్యలు చేపట్టడం తాగునీటి కష్టాలకు కారణమైంది. దశాబ్ధాల చరిత్రలో ఫిబ్రవరిలో కుందూనది ఎండిపోయిన దాఖలాల్లేవు. ప్రస్తుతం ఒట్టిపోవడంతో మైదుకూరుకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత నెలరోజులుగా మంచినీటి ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.

 - న్యూస్‌టుడే, మైదుకూరు

మైదుకూరు పట్టణానికి ఒకవైపున కుందూనది , మరోవైపున పెన్నానది, ఇంకో వైపు తెలుగుగంగ ఉన్నాయి. ఇవన్నీ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చలేకపోతున్నాయి. సుమారు 55 వేలకుపైగా జనాభా ఉన్న పట్టణానికి 8 ఎంఎల్డ్‌ీల తాగునీటి అవసరం ఉంది. అందుబాటులో ఉన్న బోర్ల ద్వారా ప్రస్తుతం 3.65 ఎంఎల్‌డీల నీటిని మాత్రమే సరఫరా అవుతుండగా, 4.35 ఎంఎల్‌డీల కొరత నెలకొంది. శాశ్వత తాగునీటి పరిష్కారం లేదు. కేవలం బోర్ల ద్వారానే నేరుగా సరఫరా చేస్తున్నారు. చెరువుల్లో నీరు లేకపోవడం, నదులు ఒట్టిపోవడంతో తెలుగుగంగ ఉప జలాశయాల్లో అంతంతమాత్రంగానే నీరు ఉండటంతో భూగర్భజల మట్టం రోజురోజుకు గణనీయంగా పడిపోతోంది. ఫలితంగా తాగునీటి బోర్ల నుంచి నీరు తక్కువగా రావడంతో తాగునీటి సమస్యకు దారితీసింది. శాశ్వత తాగునీటి సమస్య పరిష్కార దిశగా తెలుగుగంగ రెండో ఉపజలాశయం ఆధారంగా 2045 నాటికి పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా బృహత్తర తాగునీటి పథకానికి తెదేపా హయాంలోనే రూపకల్పన జరిగింది. రూ.89 కోట్లతో 2018, అక్టోబరు 9న అప్పటి మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పథకం మూలకు  చేరింది. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గతేడాది గుత్తేదారులతో చర్చించి పనులు ప్రారంభించేవిధంగా చేశారు. అంతర్గతంగా పైపులైను పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థ మధ్యలోనే పనులు నిలిపేసింది. తెలుగుగంగ రెండో ఉపజలాశయం నుంచి పట్టణానికి ప్రధాన పైపులైను వేయకపోవడం, ఉపరితల భాండాగారాల నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో శాశ్వత తాగునీటి పథకం మైదుకూరుకు కలగానే మిగిలింది. పట్టణంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. డ్రమ్ముకు సరిపడే నీరు మాత్రమే ఇస్తూ ఉండటంతో కొందరు రూ.1000 నుంచి రూ.1200 వెచ్చించి ప్లాస్టిక్‌ డ్రమ్ములను కొనుగోలు చేస్తున్నారు. మార్చిలో సమస్య జఠిలంగా ఉండగా ఏప్రిల్‌, మేలలో ఎదురయ్యే సమస్యను తలుచుకుని పట్టణవాసులు భయపడిపోతున్నారు.

ములపాక నుంచి... : పెన్నానది ఆధారంగా ఖాజీపేట మండలంతోపాటు మైదుకూరు పట్టణానికి తాగునీరు సరఫరా చేసేవిధంగా బృహత్తర పథకం ఏర్పాటు చేశారు. నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో తాగునీటి సరఫరా విభాగం అధికారులు ఏడేళ్లుగా సరఫరాను నిలిపివేశారు. వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నా, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా ములపాక నుంచి ఒక ఎంఎల్‌డీని నీటిని పొందే ప్రయత్నాన్ని అధికారులు చేయలేకపోయారు. దీంతో ట్యాంకర్లతో ఒక్కో ఇంటికి కేవలం 200 లీటర్లను మాత్రమే సరఫరా చేస్తున్నారు.  యుద్ధప్రాతిపదికన ములపాక నుంచి నీటి సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకోగలిగితే పట్టణ ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.


సరిపెట్టుకుంటున్నాం : ట్యాంకర్లతో ఇస్తున్న నీరు చాలడంలేదు. రోజుకు ఇంటికి ఒక డ్రమ్ము మాత్రమే ఇస్తున్నారు. చేసేదిలేక ఇస్తున్న నీటితోనే సరిపెట్టుకుంటున్నాం. - హుసేన్‌బీ, సాయినాథపురం


సరిపోవడం లేదు : రోజుకు ఒక డ్రమ్ము నీరు ఇస్తున్నారు. తాగునీటికి సరిపోవడం లేదు. గతేడాది ఈ పరిస్థితి లేదు. కొత్త బోర్లు వేసి కుళాయిలకు నీరు ఇవ్వాలి.

- మున్నీ, సర్వాయపల్లె రోడ్డు


డ్రమ్ము నీళ్లు సరిపోవు : రోజుకు ఒక డ్రమ్ము నీళ్లు ఇస్తే సరిపోవు.  ఇంట్లో నలుగురైదుగురు ఉంటే ఏమాత్రం సరిపోవు. తాగునీటికి దూరప్రాంతాలకు వెళ్లలేక ఇస్తున్న నీటితోనే సర్దుకుంటున్నాం.  

- గౌసియా, సర్వాయపల్లె రోడ్డు


వారం రోజుల్లో ములపాక నుంచి నీరు : మైదుకూరు పట్టణానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేలా తెలుగుగంగ నుంచి ఎర్రచెరువుకు నీరు విడుదల చేశారు. వారం రోజుల్లో ములపాక నుంచి నీరు వచ్చేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నాం.

- రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని