logo

రాజంపేటలో వైకాపాకు భారీ షాక్‌!

రాజంపేట నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే అధిక సంఖ్యలో నాయకులు తెదేపాలో చేరగా, మరికొందరు నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో మంగళగిరిలో చేరారు.

Published : 18 Apr 2024 04:19 IST

వందలాది మంది తెదేపాలో చేరిక
వరుస కడుతున్న కీలక నాయకులు
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

రాజంపేట నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే అధిక సంఖ్యలో నాయకులు తెదేపాలో చేరగా, మరికొందరు నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో మంగళగిరిలో చేరారు. ఇంకా కొంతమంది కీలక నేతలు గురువారం పార్టీలో చేరేందుకు రాజంపేట నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఇదే బాటలో మరికొందరున్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి వైకాపా టిక్కెట్టు ఇవ్వకపోవడం, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి నాయకత్వంలో పని చేయడానికి ఇష్టపడని కొందరు తెదేపాలో చేరాలనే అభిప్రాయానికి వచ్చారు. రాజంపేటలో దాదాపు వైకాపా కీలక నేతలందరూ తెదేపాలోకి దూకేస్తున్నారు. ఎమ్మెల్యే మేడా సైతం వైకాపా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తెదేపా అధికారంలోకి వస్తుందనే ధీమాతోనూ వైకాపా నేతలు అక్కడి నుంచి జారిపోతున్నారు. ఈ నెల 24న రాజంపేటలో జరిగే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సభలో మిగిలిన కీలక నేతలందరూ పార్టీలో చేరనున్నారు. నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం, రాజంపేట మండలాల్లో వైకాపా పూర్తిగా ఖాళీ అయిపోయినట్లయింది. వైకాపాలో రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్న నేతలు సైతం పార్టీని వీడిపోతున్నారు. వైకాపా నేతలందరినీ తెదేపాలో చేర్పించడానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, పోలి సుబ్బారెడ్డి కంకణం కట్టుకున్నారు. రాజంపేట పురపాలక సంఘంలో పలువురు వైకాపా కౌన్సిలర్లు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం ఆకేపాటి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. నారా లోకేశ్‌ సమక్షంలో రాజంపేట మండలం చెర్లోపల్లి, మందరం, మదనగోపాలపురం నుంచి దాదాపు 100 మంది వరకు తెదేపాలో చేరారు. బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌ రాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్రహ్మణ్యంరాజు, మదనగోపాలపురం సర్పంచి పెంచలయ్య, చెర్లోపల్లి ఉప సర్పంచి కొండూరు నరసింహరాజు, రామరాజు, న్యాయవాది సుబ్బరాజు, వైకాపా మండల సీనియర్‌ నేత విశ్వనాథ్‌రాజు, రవిరాజు తదితరులు చేరారు. రాజంపేట పట్టణంలోని మైనార్టీ నాయకుడు, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గండికోట గుల్జార్‌ భాషా, రాష్ట్ర ముదిరాజ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ లక్ష్మీనరసయ్య, వక్ఫ్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌ బుధవారం వారి పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు లేబాక సర్పంచి వెంకటనర్సయ్య, నాగిరెడ్డిపల్లి మేజర్‌ పంచాయతీ సర్పంచి సూర్యనారాయణ, ఆడకూరు ఉప సర్పంచి రమేష్‌ బాబురాజు, టంగుటూరు ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి భర్త పెంచలయ్య హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. రాజంపేట పురపాలక సంఘం నుంచి 8 మంది కౌన్సిలర్లు వైకాపా నుంచి తెదేపాలో చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని